సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వల్ల విద్యార్థులు, అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. పేపర్ లీక్ కారణంగా రెండుసార్లు గ్రూప్-1 రద్దయ్యిందని భట్టి విక్రమార్క అన్నారు.
ఉద్యోగుల భర్తీ అంశంలో అధికారులతో రెండు కమిటీలు వేశారని.. ఇప్పటి వరకు 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. మరో 13వేల ఖాళీలను గుర్తించామని డిప్యూటీ సీఎం అన్నారు. విద్యార్థుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని పోటీ పరీక్షలను వాయిదా వేశామని.. 2024-25 జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.
నోటిఫికేషన్లు.. పోస్టుల భర్తీ ఇలా..
గ్రూప్-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్-2ను డిసెంబరులో, గ్రూప్-3 నవంబరులో నిర్వహించనున్నట్లు భట్టి వెల్లడించారు. ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యుత్ శాఖలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.
నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు జరపనున్నారు. వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మేలో పరీక్షలు జరపనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నారు. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్‌లో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సెప్టెంబర్‌లో పరీక్షలు జరపనున్నారు.
వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూపు2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్‌లో పరీక్షలు జరపనున్నారు. వచ్చే ఏడాది జులైలో గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్‌లో పరీక్షలు జరపనున్నారు. సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment