Chittaranjan
-
సుభాష్ చంద్రబోస్ ఏం చదువుకున్నారు? ఐసీఎస్ ఎందుకు వద్దన్నారు?
నేడు (జనవరి 23) స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి. బోస్ పుట్టిన రోజును శౌర్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 2021లో బోస్ జయంతిని శౌర్య దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విద్యార్హతలు ఏమిటి? ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా, బోస్ ఎందుకు ఆ ఉద్యోగంలో చేరలేదో తెలుసుకుందాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897, జనవరి 23న ఒడిశాలోని బెంగాల్ డివిజన్లోని కటక్‌లో జన్మించారు. బోస్ తన తల్లిదండ్రులకు తొమ్మిదవ సంతానం. బోస్ నాటి కలకత్తాలో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత తదుపరి చదువుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లారు. బోస్ కేవలం తన 24 ఏళ్ల వయసులో ఐసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఉన్నత ఉద్యోగాల అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, బ్రిటీష్ వారికి బానిసగా ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఉద్యోగంలో చేరలేదు. బోస్ స్వాతంత్ర్య పోరాటంలో కాలుమోపేందుకు ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చి, నాటి ప్రముఖ నేత చిత్తరంజన్ దాస్‌తో జతకట్టారు. 1921లో చిత్తరంజన్ దాస్‌కు చెందిన స్వరాజ్ పార్టీ ప్రచురించే ‘ఫార్వర్డ్’ అనే వార్తాపత్రికకు సంపాదకత్వ బాధ్యతలను బోస్ స్వీకరించారు. 1920 నుంచి 1942 వరకు భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఆవిష్కరింపజేసే ‘ది ఇండియన్ స్ట్రగుల్’ అనే పుస్తకాన్ని బోస్ రచించారు. బోస్ 1939లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అయితే కొంతకాలానికే బోస్ ఆ పదవికి రాజీనామా చేశారు. నేతాజీ తన జీవితకాలంలో 11 సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఇది కూడా చదవండి: స్వాతంత్య్రాన్ని ఊహించిన ‘బోస్’ ఏం చేశారు? -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. సీనియర్ నేత రాజీనామా
సాక్షి, కల్వకుర్తి: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఏ రాజకీయ నేత ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్న ఒక పార్టీలో ఉన్న నేత.. నేడు ఇంకో పార్టీలో చేరుతున్నారు. తాజాగా తెలంగాణలోని అధికార బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించినట్టు తెలిపారు. బీఆర్ఎస్కు గుడ్ బై.. అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల లిస్టును కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. నేడు తన నివాసంలో అనుచరులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం బీఆర్ఎస్ అధిష్టానానికి రాజీనామా లేఖను పంపినట్టు తెలిపారు. కిషన్‌రెడ్డితో భేటీ.. మరోవైపు.. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన చిత్తరంజన్ దాస్, బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 1న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ రానుండగా.. ఆయన సమక్షంలోనే చిత్తరంజన్ కాషాయతీర్థం తీసుకోనున్నట్టు సమాచారం. కాగా, ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో చిత్తరంజన్ దాస్ భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని కిషన్ రెడ్డి ఆహ్వానించగా.. అందుకే చిత్తరంజన్ దాస్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. నాడు ఎన్టీఆర్‌ను ఓడించి జాయింట్ కిల్లర్‌గా.. ఇదిలా ఉండగా.. చిత్తరంజన్ దాస్‌కి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన పేరు ఉంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను ఓడించి జాయింట్ కిల్లర్‌గా పేరుగాంచారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎన్టీఆర్ పోటీ చేయగా.. కాంగ్రెస్ తరపున చిత్తరంజన్ దాస్ పోటీ చేసి గెలుపొందారు. అనంతరం, చిత్తరంజన్ దాస్ 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్లో చేరారు. కాగా, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. చిత్తరంజన్ రాజీనామా స్థానికంగా బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తెలిసిందే. నిన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హస్తం గూటికి చేరారు. ఇది కూడా చదవండి: కారు చివరి సీట్లు ఖరారు.. పెండింగ్ స్థానాలకూ అభ్యర్థుల ఖరారు -
ఎన్నికలు వాయిదా వేయరాదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఏర్పాట్ల పేరుతో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయరాదని కాంగ్రెస్ కోరింది. షెడ్యూల్ ప్రకారమే ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్‌కు సోమవారం టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎన్.నిరంజన్ లేఖ రాశారు. వీవీప్యాట్ రశీదులను ఏడు సెకన్ల పాటే ప్రదర్శిస్తుండడంతో ఓటు ఎవరికి పడిందో గుర్తించడానికి ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వీవీప్యాట్ల రశీదులను 30 సెకన్లపాటు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్న 185 మంది అభ్యర్థుల్లో తమకు కావాల్సిన అభ్యర్థిని 12 బ్యాలెట్ యూనిట్లలో వెతికి గుర్తించడానికి సమయం పట్టనుందని, దీంతో పోలింగ్ వేళలను పెంచాలని కోరారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ పోలింగ్ నిర్వహిస్తే సమయం సరిపడదని అన్నారు. -
దేశబంధు
‘తాను సమర్పించుకునే కానుక ద్వారానే మనిషి తనను తాను ఆవిష్కరించుకుంటాడు. చిత్తరంజన్ దాస్ తన సోదర భారతీయుల కోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ కార్యక్రమం అంటూ ఏదీ కానుకగా ఇవ్వలేదు. ఒక మహోన్నత ఆకాంక్షలోని అమృతోపమానమైన సృజనాత్మక శక్తి త్యాగం రూపం సంతరించుకుంటే, చిత్తరంజన్‌దాస్ జీవితం అలాంటి త్యాగానికి ప్రతిరూపంగా మాత్రం కనిపిస్తుంది.’దేశబంధు చిత్తరంజన్‌దాస్ గురించి విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ అన్న మాటలివి. గాంధీ రాకకు పూర్వం మేధస్సు, జ్ఞానం కలగలసిన మహోన్నతులు భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలకంగా ఉండేవారు. అలాంటివారిలో చిత్తరంజన్‌దాస్ (నవంబర్ 5, 1870–జూన్ 16, 1925) ఒకరు. గాంధీ రాక తరువాత జాతీయ కాంగ్రెస్ సాధారణ ప్రజలకు చేరువైంది. ఈ రెండు దశల ఉద్యమంలోనూ దాస్ ప్రముఖంగానే కనిపిస్తారు. భువనమోహన్దాస్, నిస్తరిణీదేవిల కుమారుడు దాస్. అఖండ భారత్‌లో ఢాకా సమీపంలోని విక్రమపురిలో ఆయన జన్మించారు. వైద్యం ఆ కుటుంబంలో వంశపారంపర్యంగా వచ్చేది. కానీ భువనమోహన్ న్యాయవాది. చిత్తరంజన్ కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో పట్టభద్రుడైన తరువాత ఐసీఎస్ పరీక్ష కోసం 1890లో ఇంగ్లండ్ వెళ్లారు. ఆ పరీక్షలో సఫలం కాలేక, న్యాయశాస్త్రం చదివి 1893లో భారతదేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన నివాసం కలకత్తాయే. ఆ హైకోర్టులోనే ఆయన అద్భుతమైన బారిస్టర్‌గా ఖ్యాతి గడించారు. మిగిలిన నాయకుల మాదిరిగా కాకుండా దాస్ చాలా ఆలస్యంగా, అంటే 1910 దశకంలోనే భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన రాజకీయంగా చురుకుగా ఉన్నది 1917–1925 మధ్యనే కూడా. దాస్ సామాజిక, రాజకీయ, కుటుంబ నేపథ్యం ఎంతో వైవిధ్యమైనది. భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల గురించి దాస్‌కు పూర్తిగా తెలుసు. అయినా ఎందుకు ఆ సంస్థ వెంట నడవలేదో అంతుపట్టదు. పైగా ఆ రోజులలో దాస్ అంటే యువతరంలో ఎంతో ఆకర్షణ ఉండేది. గొప్ప వక్త, కవి, రచయిత, పత్రికా రచయిత, ప్రఖ్యాతి గాంచిన బారిస్టర్. దాస్ విద్యార్థిగా ఉండగా స్టూడెంట్స్ అసోసియేషన్‌లో సభ్యులు. ఆ సంఘం తరపున ఒకసారి సురేంద్రనాథ్ బెనర్జీ పిలిపించి ఉపన్యాసం ఇప్పించారు. ఈ సంఘటన భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించిన మరుసటి సంవత్సరమే జరిగింది. అయినా దాస్ కాంగ్రెస్‌కు కాకుండా, సురేంద్రనాథ్‌కు భక్తుడయ్యారు. ఆయన కుటుంబం బ్రహ్మ సమాజాన్ని అవలంబించేది. భారతీయ మూలాలను విశేషంగా గౌరవిస్తూ, ఆధునిక ప్రపంచానికి తగ్గట్టు భారతీయ సమాజాన్ని నడిపించడమే బ్రహ్మ సమాజ సభ్యుల ఆశయంగా ఉండేది. దాస్ కూడా ప్రాచీన భారతీయ విలువలుగా ప్రసిద్ధి పొందినవాటిని గౌరవిస్తూ, వాటి పునాదిగానే ఆధునిక భారతావనిని కలగన్నాడని అనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంతో బలంగా ప్రభావితమైనవారు చిత్తరంజన్ దాస్. చాలామంది వంగదేశీయులలో తీవ్రమైన మార్పు తెచ్చినట్టే, బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం చిత్తరంజన్‌లో కూడా తాత్వికమైన, రాజకీయమైన మార్పును తెచ్చింది. మొదటి నుంచి బిపిన్‌చంద్రపాల్ ఆశయాలను అభిమానించిన దాస్ వందేమాతరం ఉద్యమంలో అతివాదుల వైపే సహజంగా మొగ్గారు. మరొక పరిణామం కూడా ఉంది. అది ఆయన జీవితాన్నే మార్చి వేసింది. 1907వ సంవత్సరంలో ఆయన అలీపూర్ బాంబు కుట్ర కేసు వాదించారు. అందులో ప్రధాన నిందితుడు అరవింద్ ఘోష్. అప్పటికే బిపిన్‌పాల్, ఘోష్ కలసి స్థాపించిన ‘వందేమాతరం’ పత్రికకు దాస్ కూడా తనవంతు సాయం చేశారు. నిజానికి అంతకు ముందే స్వాతంత్య్ర సమరయోధులు బ్రహ్మ బందోపాధ్యాయ, బిపిన్ పాల్ల మీద మోపిన కేసును వాదించి ఉద్యమకారుల కేసులు వాదించడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు. కానీ అలీపూర్ బాంబు కుట్ర కేసు ఆయన పేరును భారతదేశమంతటా స్మరించుకునేటట్టు చేసింది. వందేమాతరం ఉద్యమం సమయంలో కింగ్స్‌ఫర్డ్ అనే కలెక్టర్ అకృత్యాలు దారుణంగా ఉండేవి. కలకత్తా చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ కూడా అతడే. సుశీలాసేన్ అనే కుర్రవాడు వందేమాతరం అని నినాదం ఇచ్చినందుకు కింగ్స్‌ఫోర్డ్ పేకబెత్తంతో చావగొట్టించాడు. ఈ సమాచారం విప్లవకారులను కలచివేసింది. ఇక పత్రికా సంపాదకులపైన కూడా అతడు కక్షకట్టాడు. కింగ్స్‌ఫోర్డ్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని వారంతా భావించారు. ముఖ్యంగా అనుశీలన సమితి సభ్యులు ఇందుకు పథక రచన చేశారు. కింగ్స్‌ఫోర్డ్ కలకత్తా నుంచి ముజఫర్‌పూర్‌కు బదిలీ అయి వెళ్లిన తరువాత అతని హత్యకు విప్లవకారులు పథకం వేసుకున్నారు. 1908 ఏప్రిల్ 30 రాత్రి ఇంగ్లిష్‌వాళ్ల క్లబ్బు నుంచి అతడు ఇంటికి వెళుతున్నాడని భావించి ఒక కోచ్ మీద బాంబు విసిరారు. కానీ అందులో అతడు లేడు. దానిలోపల ఉన్న ఇద్దరు ఆంగ్ల మహిళలు మరణించారు. ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్ బోస్ ఆ బాంబు విసిరారు. దీనినే మానిక్‌తొల్ల బాంబు కుట్ర కేసు అని కూడా అంటారు. ఖుదీరామ్‌కు ఉరిశిక్ష పడింది. తాను ఇద్దరు మహిళలను నిష్కారణంగా చంపానన్న బాధే అతడిని పోలీసులకు దొరికిపోయేటట్టు చేసింది. చాకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది అనుశీలన సమితి చేసింది. సమితితో అరవింద్ ఘోష్‌కు సన్నిహిత సంబంధం ఉండేది. దీనితో ఆయన కూడా అరెస్టయ్యారు. అరవిందుని మీద దేశద్రోహం కేసు నమోదు చేశారు.అలీపూర్‌లో విచారణ జరిగింది. గొప్ప మేధావిగా పేర్గాంచిన అరవింద్‌ఘోష్ కేసు వాదించడానికి మొదట కొంత నిధిని సేకరించారు. బీఎన్ చక్రవర్తి, కేఎన్ చౌధురి మొదట వాదించారు. చిత్రంగా డబ్బులు అయిపోగానే కేసు అయోమయంలో పడింది. వాదించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి స్థితిలో దాస్ ముందుకు వచ్చి కేసు వాదించారు. పైగా చాలా ఖర్చు ఆయనే భరించారు. మొత్తానికి అరవిందుడు నిర్దోషిగా తేలాడు. కానీ అదే కేసులో నిందితుడు బరీంద్రకుమార్‌కు ఉరిశిక్ష పడింది. ఈయన అరవిందుని సోదరుడే. ఇంకొక నిందితుడు ఉల్హాస్‌కుమార్‌కు కూడా మరణదండన విధించారు. ఈ కేసును దాస్ అప్పీలు చేసి ఆ ఇద్దరి మరణ దండనను యావజ్జీవ కారాగారవాసంగా మార్పించగలిగారు. ఈ కేసులో దాస్ చూపించిన ప్రతిభ భారతీయులనే కాదు, యూరోపియన్ న్యాయ నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. అనుశీలన సమితి సభ్యుల మీద నమోదైన మరో కేసు ఢక్కా కుట్ర కేసు. అనుశీలన సమితి వ్యవస్థాపకులలో ఒకరైన పులీన్ బిహారీ దాస్, మరో 36 మందిపై కేసు నమోదైంది. వీరందరినీ కూడా చిత్తరంజన్‌దాస్ విడుదల చేయించగలిగారు. 11 మందికి మాత్రమే శిక్ష పడింది. తరువాతి కేసు ఢిల్లీ కుట్ర కేసు. ఇది 1913లో జరిగింది. 1912 డిసెంబర్లో లార్డ్ హార్డింజ్ వైస్రాయ్గా వచ్చాడు. ఇతడి గౌరవార్థం ఏర్పాటు చేసిన ఊరేగింపు జరిగింది. అప్పుడే అతడు ప్రయాణిస్తున్న వాహనం మీద బాంబు పడింది. త్రుటిలో తప్పి వెనుక ఉన్న రక్షకభటుడి మీద పడి పేలింది. అతడు మరణించాడు. హార్డింజ్ కూడా చిన్న దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు. అమీర్‌చంద్, అవ«ద్ బిహారీ, బాలముకుంద్, బసంత్‌కుమార్ బిశ్వాస్ అనే యువకులను అరెస్టు చేశారు. కానీ పథక రచనలో కీలకంగా వ్యవహరించిన రాస్బిహారీ బోస్ తప్పించుకున్నాడు. తరువాత జపాన్ వెళ్లిపోయాడు. చిత్తరంజన్ ఈ కేసును కూడా వాదించి వారిని విడిపించారు. అందుకోసం ఆయన కలకత్తా నుంచి ఢిల్లీ వెళ్లేవారు. రవింద్ ఘోష్, లాలా లజపతిరాయ్, బిపిన్‌పాల్, బాలగంగాధర తిలక్ వంటివారు భారత జాతీయ కాంగ్రెస్‌లో పనిచేసినవారే. కానీ మితవాదుల ధోరణి వారికి నచ్చేది కాదు. జాతీయ దృక్పథంతో, ఒక క్రమశిక్షణ కోసం ఆ సంస్థతో కలసి కొంత కాలం నడిచారు. తరువాత వేరయ్యారు. లేదా విభేదిస్తూ అందులోనే కొనసాగారు. చిత్తరంజన్ కూడా అంతే. పైగా ఇప్పుడు పేర్కొన్న ఆ మహనీయులంతా దాస్ సన్నిహితులే కూడా. జలియన్‌వాలా బాగ్ ఉదంతంలో డయ్యర్‌నీ, ఓడ్వయ్యర్‌నీ బోను ఎక్కించాలని తీవ్రంగా శ్రమించినవారిలో చిత్తరంజన్ ఒకరు. ఆ మారణ హోమం దాస్‌ను కలచివేసినట్టు కనిపిస్తుంది. 1919 ఏప్రిల్ 13న ఆ దుర్ఘటన జరిగింది. జనరల్ డయ్యర్ పాశవిక చర్య మీద విచారణ జరపవలసిందని భారతీయులు పట్టుపట్టారు. దీని ఫలితమే హంటర్ కమిషన్. ఇందులో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. వారు చిమన్లాల్ సెటల్వాడ్, జగత్ నారాయణ్. కమిటీ ముందుకు వచ్చిన సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అధికారం దాస్‌కు అప్పగించారు. కానీ ఇందుకు పంజాబ్ ప్రభుత్వం అంగీకరించలేదు. జలియన్ వాలాబాగ్ పరిణామాలలో భాగంగా అరెస్టయిన ముగ్గురికి హంటర్ ఎదుట సాక్ష్యం ఇచ్చే అవకాశం ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. కనీసం పంజాబ్ ప్రాంత నాయకుల అభిప్రాయాలను తీసుకోవాలని దాస్‌తో పాటు మోతీలాల్ కూడా కోరారు. ఇందుకు కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. దీనితో హంటర్ కమిషన్‌ను కాంగ్రెస్ బహిష్కరించింది. అప్పుడే గాంధీజీ అధ్యక్షతన కాంగ్రెస్ ఒక కమిటీని నియమించింది. 1,700 మందిని కలసి సేకరించిన సాక్ష్యాలను బట్టి 1,200 మంది మరణించారని తేలింది. 3,600 మంది గాయపడ్డారని వెల్లడైంది. కానీ ప్రభుత్వం చెప్పిన మృతులు 370. 1922లో గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనాలని దాస్ నిర్ణయించుకున్నారు. బెంగాల్ ప్రాంతంలో ఆ ఉద్యమానికి అవసరమైన సన్నాహాలలో నిమగ్నమయ్యారు కూడా. నిజానికి జలియన్ వాలా బాగ్ ఉదంతం తరువాతనే ఆయన న్యాయవాద వృత్తిని వీడారు. ఇప్పుడు పూర్తిగా దూరమయ్యారు. కానీ చౌరీచౌరా ఉదంతం తరువాత గాంధీ ఏకపక్షంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం దాస్‌కు నచ్చలేదు. ‘బార్డోలీలో తలపెట్టిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆపివేయడానికి ఏదైనా బలవత్తరమైన కారణం ఉండవచ్చు. కానీ బెంగాల్లో ప్రభుత్వాన్ని స్తంభింపచేయడానికి ఉద్దేశించిన స్వచ్ఛంద సేవకుల కార్యక్రమాన్ని నిలిపివేయడం అసమంజసం. ఈ విధంగా మహాత్ముడు పొరపాటు చేయడం ఇది రెండోసారి’ అని దాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1922 నాటి గయ జాతీయ కాంగ్రెస్ సభలకు ఆయన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. శాసన మండళ్లను బహిష్కరించడం సరికాదన్నదే ముందు నుంచీ దాస్ వాదన. ఆ వాదన అక్కడ వీగిపోయింది. దాస్ కాంగ్రెస్‌కు రాజీనామా ఇచ్చారు. తరువాత స్వరాజ్ పార్టీ స్థాపించారు. గ్రామాలకు పునర్వైభవం తీసుకురావడం, అక్కడ స్వయం పాలన ఏర్పాటు చేయడం దాస్ కలల్లో ముఖ్యమైనది. అంటే వాటిని పునర్నిర్మించాలి. సహకార వ్యవస్థను ఏర్పాటు చేసి, కుటీర పరిశ్రమలను నెలకొల్పి స్వయం సమృద్ధంగా ఉంచాలని ఆయన భావించారు. అలాగే గాంధీజీతో కొన్ని అంశాలలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ జాతీయ విద్యను, దాని అవసరాన్ని దాస్ సరిగానే గుర్తించారు. తాను ఏర్పాటు చేసిన జాతీయ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్‌గా నేతాజీ బోస్‌ను దాస్ నియమించారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించడానికి కూడా ఆయన వెనుకాడలేదు. చిత్తరంజన్ దాస్ జీవితానికి మరొక కోణం కూడా ఉంది. అది సృజనాత్మక రచనలు. మలంచా, మాల అనే గేయాల సంపుటాలు ఆయనవే. వీటికి బెంగాలీ సాహిత్యంలో ఎంతో ఖ్యాతి ఉంది. సాగర్ సంగీత్, అంతర్యామి, కిశోర్–కిశోరి ఆయన ఇతర రచనలు. ఒక అకుంఠిత కృషి తరువాత తీవ్రంగా అలసిపోయిన దాస్ విశ్రాంతి కోసం డార్జిలింగ్ వెళ్లారు. అక్కడే ఆయన కన్నుమూశారు. ఆయన భౌతికకాయం కలకత్తాకు వచ్చినప్పుడు దాదాపు మూడులక్షల మంది హాజరయ్యారు. టాగోర్ చెప్పినట్టు చిత్తరంజన్ త్యాగశీలతను జాతికి నేర్పారు. అందుకే ఆయన దేశబంధు. డా. గోపరాజు నారాయణరావు -
దాడులు చేస్తే బుద్ధిచెబుతాం
కల్వకుర్తి టౌన్ : అగ్రకుల నాయకులు బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల నాయకులపై దాడి చేస్తే బుద్ధి చెబుతామని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అన్నారు. వారుచేసే వ్యాపారంలో తగినంత ఓర్పు, సహనం ఉంటేనే చేయాలని, లేదంటే మానుకోవాలని చెప్పారు. బీసీ సంఘాలు, కులసంఘాల, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆదివారం కల్వకుర్తిలోని పాలమూరు చౌరస్తాలో దాదాపు మూడు గంటలకు పైగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తరంజన్‌దాస్ మాట్లాడారు. దాడి చేయడమే కాకుండా, తమకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేయటం దారుణమని అన్నారు. అమరావతి బార్ యజమానులు మండలంలోని తిమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను వెంబండించి కొట్టడం దారు ణమని బీసీ సంఘాల నాయకులు అన్నారు. వెల్దండ మండలం వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. దెబ్బలుతిన్న వారిని ప రామర్శించకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పూనుకుంటాం అమరావతి బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు సమయంలో అదే ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని, అయినా వినకుండా ఏర్పాటు చేశారని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఓ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ భాగస్వామిగా ఉంటూ, తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు. కల్వకుర్తి ఘటనను రాష్ట్రవ్యాప్త ఆందోళనగా మార్చుతామని బీసీ నాయకులు పేర్కొన్నారు. ఈ ఘటన విషయంలో డీఎస్పీ చొరవ అభినందించదగినదని అన్నారు. కానీ డీఎస్పీని స్థానిక ప్రజాప్రతినిధి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఆయన దురహంకారానికి నిదర్శనమని అన్నారు. డీఎస్పీతో సమావేశం పోలీసుల సూచనలతో ధర్నా విరమించిన బీసీ సంఘాల నాయకులతో కల్వకుర్తి డీఎస్పీ ఎల్సీ నాయక్, నాగర్‌కర్నూల్ డీఎస్పీ లక్ష్మీనారాయణ సమావేశం నిర్వహించారు. పట్టణాన్ని ప్రశాంత వాతావరణంలో ఉంచుదామని, దానికి అందరూ సహకరించాలని కోరారు. ముగ్గురు యువకులపై 20మందికి పైగా దాడిచేశారని, వారందరినీ అరెస్టు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. డీఎస్పీలు మాట్లాడుతూ వారిని కూడా పట్టుకుంటామని చెప్పారు. ధర్నా కార్యక్రమంలో బీసీ సబ్‌ప్లాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లె గోపాల్, బీఎల్ఎఫ్ పార్లమెంట్ సమన్వయకర్త ప్రొఫెసర్ వెంకటదాసు, ఓబీసీ నేత పైళ్ల ఆశయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బాలాజీ సింగ్, బీసీ నాయకులు బాలస్వామి గౌడ్, జంగయ్య, కేవీపీఎస్ నాయకులు, వడ్డెర కుల సంఘ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
సోనాలీ పెళ్లి చేసుకుంది..
బొకారో: యాసిడ్ దాడి బాధితురాలు సోనాలీ ముఖర్జీ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఏళ్ల తరబడి చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ, కోర్టులు చుట్టూ తిరిగి తిరిగి వేసారిన ఆమె జీవితంలో వెలుగుపూలు వికసించాయి. ఫేస్బుక్లో పరిచయమైన చిత్తరంజన్ అనే వ్యక్తి సోనాలీ ముఖర్జీ వ్యక్తిత్వాన్ని మెచ్చి ప్రేమించి పెళ్లచేసుకున్నారు. బొకారోలోని కోర్టహాలులో కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరి పెళ్లి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సోనాలి 18 ఏళ్ల వయసులో ఉన్నపుడు యాసిడ్ దాడికి గురైంది. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వేధించిన వ్యక్తులను ప్రతిఘటించినందుకు గాను, కక్షకట్టిన ముగ్గురు వ్యక్తులు ఆమె తన ఇంటి మేడమీద నిద్రిస్తుండగా సోనాలిపై యాసిడ్ పోశారు. దీంతో ముఖం, మెడ, కుడి ఛాతీ భాగంలో తీవ్ర గాయాల పాలయ్యింది. ఈ కేసులో ఆమె అలుపెరుగని పోరాటం చేస్తోంది. అయితే ఆమె సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు బొకారోలోని గవర్నమెంటు స్కూల్లో చిరుద్యోగాన్ని సంపాదించారు. యాసిడ్ బాధితులకు ప్రభుత్వం ఉద్యోగభృతి కల్పించాలంటూ మీడియా ముందుకొచ్చి డిమాండ్ చేశారు. కౌన్ బనేగా కరోడ్ పతి టెలివిజన్ షోలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కూడా అందుకున్నారు సోనాలి. ఇలా ఆమె ధైర్యానికి , ఆత్మవిశ్వాసానికి ముగ్ధుడైన చిత్తరంజన్ ఆమెతో స్నేహాన్ని పెంచుకుని, పెళ్లి ప్రస్తావన తెచ్చారు. పరస్పర అంగీకారంతో బంధువుల అభినందనల మధ్య చాలా సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. జంషెడ్‌పూర్‌కు చెందిన చిత్తరంజన్ ఒడిషాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న సోనాలీని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అభినందించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోరాడుతున్న అతి కొద్దమంది మహిళలో ఒకరిగా ఆమెను గౌరవిస్తామన్నారు. యాసిడ్ దాడి ఘటనతో తన జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని, ఉత్సాహాన్ని చిత్తరంజన్ తిరిగి తీసుకొచ్చారంటున్నారు సోనాలి. కాగా కోర్టు ఫీజులు, చికిత్స కోసం సోనాలి కుటుంబం ఆస్తులు, బంగారాన్ని సైతం తెగ నమ్ముకుని న్యాయం కోసం పోరాడుతోంది. ఇప్పటికీ నిందితుల నుంచి బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. -
లలితరంజన్
రేడియో అంతరంగాలు రేడియో కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి సంగీతాన్ని నేర్పించిన ఘనత మహాభాష్యం చిత్తరంజన్‌కు మాత్రమే దక్కుతుంది. తల్లి నుంచి పుణికిపుచ్చుకున్న సంగీతమే తనను ఇంతటి వాణ్ణి చేసిందంటారాయన. లలిత సంగీతం నేర్చుకోవడం, పాడడం అందరికీ తెలుసు. కానీ దానిపై పరిశోధన చేయాలనే ఆలోచన ఎంతమందికి వస్తుంది? అలా పరిశోధన చేసి దేశంలోనే మొదటిసారిగా లలిత సంగీతాన్ని యూనివర్సిటీ కోర్సుల్లో చేర్చిన ప్రత్యేకత కూడా చిత్తరంజన్దే. ఆకాశవాణిలో ఎందరో సంగీత విద్వాంసులు తమ సేవలనందించారు. అలాంటి మహానుభావుల్లో ఆయనొకరు. తన జీవితంలో సంగీతం ఇచ్చిన మధురానుభూతులను ప్రముఖ రేడియో కళాకారిణి శారదాశ్రీనివాసన్ తో పంచుకున్నారు చిత్తరంజన్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... అందరికీ తొలి పలుకులు అమ్మే నేర్పుతుందంటారు. అలాగే మా అమ్మ పేరిందేవి నాకు పలుకులతో పాటు స్వరాలూ నేర్పింది. ఆమె ఇంట్లోనే వయొలిన్ నేర్చుకునేది. అప్పుడు నేనూ వినేవాణ్ణి. అలా సంగీతంపై ఆసక్తి పెరిగింది. స్కూల్లోనూ పాటలు బాగా పాడేవాణ్ణి. రేడియోలో సంగీతం మా నాన్న మహాభాష్యం రంగాచార్యులుగారు దక్కన్ రేడియోలో ఇంజినీర్‌గా పని చేసేవారు. అలా చిన్నప్పటి నుంచే రేడియోలో ప్రసారమయ్యే పిల్లల కార్యక్రమాల్లో నేను పాల్గొనేవాణ్ణి. నాకు బాగా గుర్తు.. అక్కడ మొదట నేను ‘మా తెలుగు తల్లి’ పాటతో పాటు మరికొన్ని పాడాను. అంతా అయిపోయాక కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందర్నీ పిలిచి డబ్బులిచ్చారు. నా చేతిలో రూ.3 పెట్టారు మా నాన్నగారి ముందే. ‘‘నాన్నా! నాకు డబ్బులు ఇస్తున్నారు’’ అన్నాను. ఆయన ‘‘తీసుకో’’ అని నవ్వారు. అప్పుడు స్టేషన్లలో రికార్డింగులు లేవు కాబట్టి ఎనిమిదేళ్ల వయసులోనే నేను లైవ్‌లో పాడాను. నన్ను వద్దన్నారు 1954లో మొదటిసారి ఆడిషన్స్‌కు వెళ్లాను. క్యాజువల్ ఆర్టిస్ట్‌గా చేరుదామని. నేను రేడియో ఇంజినీర్ కొడుకునన్న కారణంగా నన్ను తీసుకునేది లేదన్నారు. కానీ అప్పటి ప్రోగ్రామ్ అసిస్టెంట్ వాక్నిస్గారు నాకు అవకాశం ఇవ్వాలంటూ సిఫారసు చేశారు. అప్పుడు ఆయన ‘‘ప్రతిభ ఉంటే ఎవరినైనా తప్పకుండా ప్రోత్సహించాలి’’ అన్న మాటలు నేను మర్చిపోలేను. బాలమురళితోగారితో బాంధవ్యం 1955లో మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు హైదరాబాద్‌లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. అప్పుడు నాతో ఎన్నో పాటలు పాడించారు. తర్వాత 1958 నుంచి 1962 వరకు ఆయన దగ్గర శిష్యుడిగా ఎంతో నేర్చుకున్నాను. ఆయన వయొలిన్ అద్భుతంగా వాయించేవారు. బాలమురళి గారితో కలిసి వందల కచేరీల్లో పాల్గొన్నాను. తర్వాత రేడియో వల్లే నాకు సాహిత్య దిగ్గజం దేవులపల్లి కృష్ణశాస్త్రి, సినీ సంగీత దర్శకుడు ఘంటసాల గారితో మంచి స్నేహం ఏర్పడింది. సంగీత కార్యక్రమాలు 1971లో నేను ఆకాశవాణిలో రెగ్యులర్ గాయకుడుగా, సంగీత దర్శకుడిగా చేరి 1997లో పదవీ విరమణ చేశాను. 1972లో నేను వారానికో రోజు ప్రసారమయ్యే ‘ఈ పాట నేర్చుకుందాం’ అనే కార్యక్రమం నిర్వహించాను. అలాగే 1983లో ‘కలిసి పాడుదాం’ అనే ప్రోగ్రామ్ మొదలుపెట్టాను. అలా దేశంలోని 16 భాషల్లో పాటలు నేర్పాను. ఇది ప్రతి ఆదివారం ప్రసారం అయ్యేది. చాలామంది రేడియో ద్వారా సంగీతం నేర్చుకొని మ్యూజిక్ టీచర్‌గా ఉద్యోగం సంపాదించామని చెప్పేవారు. కార్యక్రమం ఎంతో బాగుందని బరోడా, ఖరగ్‌పూర్ లాంటి ఎన్నో ప్రాంతాల నుంచి ఫోన్లు, గుట్టలుగా లెటర్లు వచ్చాయి. సంగీతం నేర్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నవాడికి ఇంతకంటే ఏం కావాలి. రేడియోలోనే నాగార్జున సాగరం, రామప్ప, శర్మిష్ట, కొత్త కోవెల, మేఘసందేశం, శివక్షేత్రయాత్ర మొదలైన ఎన్నో సంగీత రూపకాలు చేశాను. మేఘసందేశంలో నేనూ, మీరు (శారదాశ్రీనివాసన్) చేశాం. ‘కోర్సు’ అలా మొదలైంది.. నాకు చిన్నప్పటి నుంచి పరిశోధనలు చేయడమంటే ఇష్టం. అలాగే లలిత సంగీతంపైనా చేశాను. అలా ఎన్నో ఏళ్లు కృషి చేసి లలిత సంగీతానికి ప్రప్రథమంగా పాఠ్యప్రణాళికను రూపొందించాను. ఆ పుస్తకం పూర్తి కాగానే బాలమురళీ కృష్ణగారికి, మరో సంగీత విద్వాంసులు నూకల చినసత్యనారాయణగారికి చూపించాను. చాలా బాగా వచ్చిందన్నారు. తర్వాత 1999లో డాక్టర్ సి. నారాయణరెడ్డిగారికి పంపాక నాకు ఫోన్ చేసి ఎక్స్‌లెంట్‌గా ఉందన్నారు. అలా నా పరిశోధనను తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత సంగీతం కోర్సుగా పెట్టారు. పాలగుమ్మి విశ్వనాథం గారు మూడేళ్లు, దాదాపు నేనొక ఏడేళ్లు లలిత సంగీతానికి లెక్చరర్ గా చేశాం. ఆ పుస్తకానికే శ్రీలంకలోని ‘ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్’ వారు 2008లో నాకు డాక్టరేట్ ఇచ్చారు. ..:: నిఖితా నెల్లుట్ల ఫొటోలు: ఎస్.ఎస్ ఠాకూర్ చిత్తరంజనం రేడియోలో 2006 నుంచి ‘చిత్తరంజనం’ అనే ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. అందులో 1940 నుంచి సినీ ప్రపంచంలో తమ స్వరాలనందించిన సంగీత దర్శకుల గురించి విశ్లేషణాత్మక కార్యక్రమం నిర్వహించారు. కేవీ మహదేవన్, పెండ్యాల, ఎంఎస్ విశ్వనాథం, ఘంటసాల, ఇళయరాజా, సీఆర్ సుబ్బరామన్ నుంచి నేటి తరం మ్యూజిక్ డెరైక్టర్ ఏఆర్ రెహమాన్‌తో పాటు దాదాపు 35మంది దక్షిణాది సినీరంగ సంగీత దర్శకులపై ప్రోగ్రాములు చేశారు. అందుకున్న పురస్కారాలు సుమారు 1500 పాటలకు సంగీతం అందించారు. అలాగే 8 వేల పాటలు పాడారు. వివిధ సంస్థల నుంచి ‘గాన రత్న’, ‘కళారత్న’, ‘లలిత గాంధర్వ కళానిధి’, ‘లలిత సంగీత చక్రవర్తి’, ‘మధుర స్వరనిధి’, ‘లలిత సంగీత సామ్రాట్’లాంటి బిరుదులు అందుకున్నారు. సినిమాల్లోనూ సంగీతం ‘కులదైవం’, ‘స్వర్ణగౌరి’, ‘విధివిలాసం’, ‘సూర్యచంద్రులు’ మొదలైన చిత్రాల్లో పాటలు పాడారు. అలాగే ‘మన మహాత్ముడు’, ‘శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మహత్త్యం’ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలకు సంగీతమందించారు. -
మాకు స్ఫూర్తి రజనీ గారే!
మహాభాష్యం చిత్తరంజన్, ప్రముఖ లలిత సంగీత విద్వాంసులు ప్రముఖ కవి, గాయకుడు, వాగ్గేయకారుడు, స్వరకర్త రజనీగారు లలిత సంగీత వికాసానికీ, అభివృద్ధికీ ఎనలేని సేవలందించారు. ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో 1941లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎన్నో మధురమైన లలిత గీతాలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఉమర్ ఖయ్యాయి తత్త్వాన్ని వర్ణిస్తూ కృష్ణశాస్త్రి గారు రాసిన ‘అతిథిశాల’కు ఆయన పర్షియన్ సంగీతపు పోకడలతో అద్భుతమైన బాణీలు కూర్చారు. ఆయనే ఖయ్యావయిగా కూడా నటించి పాడారు. మా తండ్రి గారు, రజనీ గారి తండ్రి గారు పిఠాపురం వాస్తవ్యులు. అందుకని ఆయనకు నా పైన ప్రత్యేకమైన ప్రేమ, వాత్సల్యం. 1963లో హైదరాబాద్ ఆకాశవాణిలో ఈ నాటిక ప్రసారమైనప్పుడు ఆయనతో పాటు నేనూ అందులోని పాటలు పాడాను. అరబ్బీ సంగీత పద్ధతిలో పాటలే కాక పద్యాలు కూడా చదవడం అంత తేలికైన విషయం కాదు. కర్ణాటక, హిందుస్తానీ సంగీతంలో వాడుకలో లేని రాగాలెన్నిటినో ఉపయోగించడం లాంటి ప్రయోగాలెన్నో చేసిన మొట్టమొదటి వ్యక్తి - రజనీగారు. ఆ తరువాత పాలగుమ్మి విశ్వనాథం గారు, ఆ పైన నేను కూడా వాడుకలో లేని అనేక రాగాల్ని వినియోగించి, ప్రజారంజక గీతాలు తయారుచేశాం. ఆ విషయంలో మా అందరికీ స్ఫూర్తి రజనీ గారే. -
దేవీశరన్నవరాత్రులు సిద్ధమవుతున్న నగరం
వరప్రదాయని దుర్గామాతను తనివితీరా కొలుచుకునేందుకు నగరవాసులు తహతహలాడుతున్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బెంగాల్నుంచి కళాకారులను రప్పించుకుని వారితో అమ్మవారి ప్రతిమలను చేయిస్తున్నారు. చిత్తరంజన్ పార్కులోని మేళా మైదానంలో 17 అడుగుల ఎత్తు కలిగిన దుర్గామాత ప్రతిమ ఏర్పాటు కానుంది. సాక్షి, న్యూఢిల్లీ:దేవీశరన్నవరాత్రులకు నగరవాసులతోపాటు ఇక్కడ నివసిస్తున్న బెంగాలీలుఅన్నివిధాలుగా సన్నద్ధమవుతున్నారు. నగరంలోని ప్రతి ప్రాంతంలో దుర్గాపూజ వేడుకలు జరిగినప్పటికి మినీ బెంగాల్‌గా పేర్కొనే చిత్తరంజన్ ఉద్యానవనంలో ఈ వేడుక వైభవం చూడడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. బెంగాల్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన కళాకారులు ఇక్కడి పందిళ్లలో దుర్గా మాత ప్రతిమలను రూపొందిస్తున్నారు. పూజా పందిళ్ల ఏర్పాటు పనులు రేయింబవళ్లు జరుగుతున్నాయి. కళాకారులు రోజుకు దాదాపు 15 గంటలపాటుశ్రమిస్తూ మహిషాసుర మర్థిని ప్రతిమను తీర్చిదిద్దుతున్నారు. విభిన్న రూపాలలో, విభిన్న ఇతివృత్తాలతో దుర్గాపూజ పందిళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. చిత్తరంజన్ పార్క్ మేళా మైదానంలో దుర్గామాత రాజస్థానీ మహిళా ఆకృతిని దాలుస్తుండగా, సంగమ్ విహార్‌లో అమ్మవారు ఆధునిక మహిళ రూపంలో దర్శనమివ్వనుంది. చిత్తరంజన్పార్కులోని కాళీ మందిర్ ప్రాంతంలో బెంగాల్ నుంచి వచ్చిన 11 మంది కళాకారులు మూడు నెలలుగా దుర్గామాతప్రతిమలను రూపొందిస్తున్నారు. మొదట వెదురు కర్రలతో ఆకారాన్ని రూపొందించి, దానిపై గడ్డిని తాళ్లతో కట్టి ఆపై మట్టితో శరీరాకృతిని ఇస్తామని ప్రతిమలను తయారుచేస్తున్న గోవింద్‌నాథ్ చెప్పారు. ప్రతిమ తయారీ కోసం బంకమట్టిని బెంగాల్ నుంచి తీసుకువస్తామని ఆయన తెలిపారు.ఈ మట్టిని యమునానది తీరంనుంచి తెచ్చేమట్టితో కలిపి ప్రతిమల తయారీకి వినియోగిస్తామన్నారు. ప్రతిమ గట్టిగా ఉండడం కోసం మట్టిలో జనపనారను కలుపుతామన్నారు. ప్రతిమ ముఖాన్ని ముఖ్యంగా కన్నుతోపాటు ముక్కునుమరింత అందంగా తీర్చిదద్దడానికిఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. ప్రతిమ తయారీ పూర్తయ్యాక దానిని ఎండబెట్టి రంగులు వేస్తారు. సాధారణంగా ఐదడుగుల దుర్గా ప్రతిమ ఖరీదు రూ. 10 వేల రూపాయలు ఉంటుంది. చిత్తరంజన్ పార్కులోని మేళా మైదానంలో 17 అడుగుల ఎత్తు కలిగిన దుర్గామాత ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. కాగా చిత్తరంజన్ పార్కు దుర్గాపూజా సమితి 1976లో ఏర్పాటైంది. ఈ పార్కుకు సమీపంలో నివసిస్తున్న కొందరు స్థానికులు ఏర్పాటై దీనిని ప్రారంభించారు. కాలక్రమేణా ఈ సమితి నిర్వహించే పూజాదికాలకు రాజధానిలో అత్యంత ప్రాచుర్యం లభించింది. దీంతో లక్షలాది మంది దుర్గాదేవి భక్తులు మాత ప్రతిమను దర్శించుకునేందుకు, వీలైతే పూజలో పాల్గొనేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఈ సమితికి పండుగ సమయంలో స్థానికులు భారీగా విరాళాలను అందజేస్తారు. 1993లో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ పార్కులో దక్షిణేశ్వర్ సెట్టింగ్‌ను ఏర్పాటుచేశారు. అదే ఏడాది బెంగాలీయుడైన స్వామి వివేకానంద శతజయంతి ఉత్సవాలను కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించారు. 80 అడుగుల పొడవు కలిగిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత 1994లో బేలూర్ మఠ్ (శ్రీ రామకృష్ణ ఆలయం) సెట్టింగ్‌ను ఏర్పాటుచేశారు.