సోనాలీ పెళ్లి చేసుకుంది..
బొకారో: యాసిడ్ దాడి బాధితురాలు సోనాలీ ముఖర్జీ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఏళ్ల తరబడి చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ, కోర్టులు చుట్టూ తిరిగి తిరిగి వేసారిన ఆమె జీవితంలో వెలుగుపూలు వికసించాయి. ఫేస్బుక్లో పరిచయమైన చిత్తరంజన్ అనే వ్యక్తి సోనాలీ ముఖర్జీ వ్యక్తిత్వాన్ని మెచ్చి ప్రేమించి పెళ్లచేసుకున్నారు. బొకారోలోని కోర్టహాలులో కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరి పెళ్లి జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. సోనాలి 18 ఏళ్ల వయసులో ఉన్నపుడు యాసిడ్ దాడికి గురైంది. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వేధించిన వ్యక్తులను ప్రతిఘటించినందుకు గాను, కక్షకట్టిన ముగ్గురు వ్యక్తులు ఆమె తన ఇంటి మేడమీద నిద్రిస్తుండగా సోనాలిపై యాసిడ్ పోశారు. దీంతో ముఖం, మెడ, కుడి ఛాతీ భాగంలో తీవ్ర గాయాల పాలయ్యింది. ఈ కేసులో ఆమె అలుపెరుగని పోరాటం చేస్తోంది. అయితే ఆమె సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు బొకారోలోని గవర్నమెంటు స్కూల్లో చిరుద్యోగాన్ని సంపాదించారు.
యాసిడ్ బాధితులకు ప్రభుత్వం ఉద్యోగభృతి కల్పించాలంటూ మీడియా ముందుకొచ్చి డిమాండ్ చేశారు. కౌన్ బనేగా కరోడ్ పతి టెలివిజన్ షోలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కూడా అందుకున్నారు సోనాలి. ఇలా ఆమె ధైర్యానికి , ఆత్మవిశ్వాసానికి ముగ్ధుడైన చిత్తరంజన్ ఆమెతో స్నేహాన్ని పెంచుకుని, పెళ్లి ప్రస్తావన తెచ్చారు. పరస్పర అంగీకారంతో బంధువుల అభినందనల మధ్య చాలా సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. జంషెడ్పూర్కు చెందిన చిత్తరంజన్ ఒడిషాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు.
ప్రేమ వివాహం చేసుకున్న సోనాలీని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అభినందించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోరాడుతున్న అతి కొద్దమంది మహిళలో ఒకరిగా ఆమెను గౌరవిస్తామన్నారు. యాసిడ్ దాడి ఘటనతో తన జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని, ఉత్సాహాన్ని చిత్తరంజన్ తిరిగి తీసుకొచ్చారంటున్నారు సోనాలి. కాగా కోర్టు ఫీజులు, చికిత్స కోసం సోనాలి కుటుంబం ఆస్తులు, బంగారాన్ని సైతం తెగ నమ్ముకుని న్యాయం కోసం పోరాడుతోంది. ఇప్పటికీ నిందితుల నుంచి బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం.