దేశబంధు | Special story to Chittaranjan Das | Sakshi
Sakshi News home page

దేశబంధు

Published Sun, Sep 23 2018 12:20 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Special story to Chittaranjan Das - Sakshi

‘తాను సమర్పించుకునే కానుక ద్వారానే మనిషి తనను తాను ఆవిష్కరించుకుంటాడు. చిత్తరంజన్‌ దాస్‌ తన సోదర భారతీయుల కోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ కార్యక్రమం అంటూ ఏదీ కానుకగా ఇవ్వలేదు. ఒక మహోన్నత ఆకాంక్షలోని అమృతోపమానమైన సృజనాత్మక శక్తి త్యాగం రూపం సంతరించుకుంటే, చిత్తరంజన్‌దాస్‌ జీవితం అలాంటి త్యాగానికి ప్రతిరూపంగా మాత్రం కనిపిస్తుంది.’దేశబంధు చిత్తరంజన్‌దాస్‌ గురించి విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ అన్న మాటలివి. గాంధీ రాకకు పూర్వం మేధస్సు, జ్ఞానం కలగలసిన మహోన్నతులు భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలకంగా ఉండేవారు. అలాంటివారిలో చిత్తరంజన్‌దాస్‌ (నవంబర్‌ 5, 1870–జూన్‌ 16, 1925) ఒకరు. గాంధీ రాక తరువాత జాతీయ కాంగ్రెస్‌ సాధారణ ప్రజలకు చేరువైంది. ఈ రెండు దశల ఉద్యమంలోనూ దాస్‌ ప్రముఖంగానే కనిపిస్తారు. 

భువనమోహన్‌దాస్, నిస్తరిణీదేవిల కుమారుడు దాస్‌. అఖండ భారత్‌లో ఢాకా సమీపంలోని విక్రమపురిలో ఆయన జన్మించారు. వైద్యం ఆ కుటుంబంలో వంశపారంపర్యంగా వచ్చేది. కానీ భువనమోహన్‌ న్యాయవాది. చిత్తరంజన్‌ కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో పట్టభద్రుడైన తరువాత ఐసీఎస్‌ పరీక్ష కోసం 1890లో ఇంగ్లండ్‌ వెళ్లారు. ఆ పరీక్షలో సఫలం కాలేక, న్యాయశాస్త్రం చదివి 1893లో భారతదేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన నివాసం కలకత్తాయే. ఆ హైకోర్టులోనే ఆయన అద్భుతమైన బారిస్టర్‌గా ఖ్యాతి గడించారు. మిగిలిన నాయకుల మాదిరిగా కాకుండా దాస్‌ చాలా ఆలస్యంగా, అంటే 1910 దశకంలోనే భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన రాజకీయంగా చురుకుగా ఉన్నది 1917–1925 మధ్యనే కూడా. 

దాస్‌ సామాజిక, రాజకీయ, కుటుంబ నేపథ్యం ఎంతో వైవిధ్యమైనది. భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యకలాపాల గురించి దాస్‌కు పూర్తిగా తెలుసు. అయినా ఎందుకు ఆ సంస్థ వెంట నడవలేదో అంతుపట్టదు. పైగా ఆ రోజులలో దాస్‌ అంటే యువతరంలో ఎంతో ఆకర్షణ ఉండేది. గొప్ప వక్త, కవి, రచయిత, పత్రికా రచయిత, ప్రఖ్యాతి గాంచిన బారిస్టర్‌. దాస్‌ విద్యార్థిగా ఉండగా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌లో సభ్యులు. ఆ సంఘం తరపున ఒకసారి సురేంద్రనాథ్‌ బెనర్జీ పిలిపించి ఉపన్యాసం ఇప్పించారు. ఈ సంఘటన భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవించిన మరుసటి సంవత్సరమే జరిగింది. అయినా దాస్‌ కాంగ్రెస్‌కు కాకుండా, సురేంద్రనాథ్‌కు భక్తుడయ్యారు. ఆయన కుటుంబం బ్రహ్మ సమాజాన్ని అవలంబించేది. భారతీయ మూలాలను విశేషంగా గౌరవిస్తూ, ఆధునిక ప్రపంచానికి తగ్గట్టు భారతీయ సమాజాన్ని నడిపించడమే బ్రహ్మ సమాజ సభ్యుల ఆశయంగా ఉండేది. దాస్‌ కూడా ప్రాచీన భారతీయ విలువలుగా ప్రసిద్ధి పొందినవాటిని గౌరవిస్తూ, వాటి పునాదిగానే ఆధునిక భారతావనిని కలగన్నాడని అనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంతో బలంగా ప్రభావితమైనవారు చిత్తరంజన్‌ దాస్‌. చాలామంది వంగదేశీయులలో తీవ్రమైన మార్పు తెచ్చినట్టే, బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం చిత్తరంజన్‌లో కూడా తాత్వికమైన, రాజకీయమైన మార్పును తెచ్చింది. మొదటి నుంచి బిపిన్‌చంద్రపాల్‌ ఆశయాలను అభిమానించిన దాస్‌ వందేమాతరం ఉద్యమంలో అతివాదుల వైపే సహజంగా మొగ్గారు. మరొక పరిణామం కూడా ఉంది. అది ఆయన జీవితాన్నే మార్చి వేసింది. 1907వ సంవత్సరంలో ఆయన అలీపూర్‌ బాంబు కుట్ర కేసు వాదించారు. అందులో ప్రధాన నిందితుడు అరవింద్‌ ఘోష్‌. అప్పటికే బిపిన్‌పాల్, ఘోష్‌ కలసి స్థాపించిన ‘వందేమాతరం’ పత్రికకు దాస్‌ కూడా తనవంతు సాయం చేశారు. నిజానికి అంతకు ముందే స్వాతంత్య్ర సమరయోధులు బ్రహ్మ బందోపాధ్యాయ, బిపిన్‌ పాల్‌ల మీద మోపిన కేసును వాదించి ఉద్యమకారుల కేసులు వాదించడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు. కానీ అలీపూర్‌ బాంబు కుట్ర కేసు ఆయన పేరును భారతదేశమంతటా స్మరించుకునేటట్టు చేసింది. వందేమాతరం ఉద్యమం సమయంలో కింగ్స్‌ఫర్డ్‌ అనే కలెక్టర్‌ అకృత్యాలు దారుణంగా ఉండేవి. కలకత్తా చీఫ్‌ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్‌ కూడా అతడే.  సుశీలాసేన్‌ అనే కుర్రవాడు వందేమాతరం అని నినాదం ఇచ్చినందుకు కింగ్స్‌ఫోర్డ్‌ పేకబెత్తంతో చావగొట్టించాడు. ఈ సమాచారం విప్లవకారులను కలచివేసింది.

ఇక పత్రికా సంపాదకులపైన కూడా అతడు కక్షకట్టాడు.  కింగ్స్‌ఫోర్డ్‌ మీద ప్రతీకారం తీర్చుకోవాలని వారంతా భావించారు. ముఖ్యంగా అనుశీలన సమితి సభ్యులు ఇందుకు పథక రచన చేశారు. కింగ్స్‌ఫోర్డ్‌ కలకత్తా నుంచి ముజఫర్‌పూర్‌కు బదిలీ అయి వెళ్లిన తరువాత అతని హత్యకు విప్లవకారులు పథకం వేసుకున్నారు. 1908 ఏప్రిల్‌ 30 రాత్రి ఇంగ్లిష్‌వాళ్ల  క్లబ్బు నుంచి అతడు ఇంటికి వెళుతున్నాడని భావించి ఒక కోచ్‌ మీద బాంబు విసిరారు. కానీ అందులో అతడు లేడు. దానిలోపల ఉన్న ఇద్దరు ఆంగ్ల మహిళలు మరణించారు. ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్‌ బోస్‌ ఆ బాంబు విసిరారు. దీనినే మానిక్‌తొల్ల బాంబు కుట్ర కేసు అని కూడా అంటారు. ఖుదీరామ్‌కు ఉరిశిక్ష పడింది. తాను ఇద్దరు మహిళలను నిష్కారణంగా చంపానన్న బాధే అతడిని పోలీసులకు దొరికిపోయేటట్టు చేసింది. చాకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.  ఇది అనుశీలన సమితి చేసింది. సమితితో అరవింద్‌ ఘోష్‌కు సన్నిహిత సంబంధం ఉండేది. దీనితో ఆయన కూడా అరెస్టయ్యారు. అరవిందుని మీద దేశద్రోహం కేసు నమోదు చేశారు.అలీపూర్‌లో విచారణ జరిగింది. గొప్ప మేధావిగా పేర్గాంచిన అరవింద్‌ఘోష్‌ కేసు వాదించడానికి మొదట కొంత నిధిని సేకరించారు. బీఎన్‌ చక్రవర్తి, కేఎన్‌ చౌధురి మొదట వాదించారు. చిత్రంగా డబ్బులు అయిపోగానే కేసు అయోమయంలో పడింది. వాదించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి స్థితిలో దాస్‌ ముందుకు వచ్చి కేసు వాదించారు. పైగా చాలా ఖర్చు ఆయనే భరించారు. మొత్తానికి అరవిందుడు నిర్దోషిగా తేలాడు. కానీ అదే కేసులో నిందితుడు బరీంద్రకుమార్‌కు ఉరిశిక్ష పడింది. ఈయన అరవిందుని సోదరుడే. ఇంకొక నిందితుడు ఉల్హాస్‌కుమార్‌కు కూడా మరణదండన విధించారు. ఈ కేసును దాస్‌ అప్పీలు చేసి ఆ ఇద్దరి మరణ దండనను యావజ్జీవ కారాగారవాసంగా మార్పించగలిగారు.  ఈ కేసులో దాస్‌ చూపించిన ప్రతిభ భారతీయులనే కాదు, యూరోపియన్‌ న్యాయ నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. 

అనుశీలన సమితి సభ్యుల మీద నమోదైన మరో కేసు ఢక్కా కుట్ర కేసు. అనుశీలన సమితి వ్యవస్థాపకులలో ఒకరైన పులీన్‌ బిహారీ దాస్, మరో 36 మందిపై కేసు నమోదైంది. వీరందరినీ కూడా చిత్తరంజన్‌దాస్‌ విడుదల చేయించగలిగారు. 11 మందికి మాత్రమే శిక్ష పడింది. తరువాతి కేసు ఢిల్లీ కుట్ర కేసు. ఇది 1913లో జరిగింది. 1912 డిసెంబర్‌లో లార్డ్‌ హార్డింజ్‌ వైస్రాయ్‌గా వచ్చాడు. ఇతడి గౌరవార్థం ఏర్పాటు చేసిన ఊరేగింపు జరిగింది. అప్పుడే అతడు ప్రయాణిస్తున్న వాహనం మీద బాంబు పడింది. త్రుటిలో తప్పి వెనుక ఉన్న రక్షకభటుడి మీద పడి పేలింది. అతడు మరణించాడు. హార్డింజ్‌ కూడా చిన్న దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు. అమీర్‌చంద్, అవ«ద్‌ బిహారీ, బాలముకుంద్, బసంత్‌కుమార్‌ బిశ్వాస్‌ అనే యువకులను అరెస్టు చేశారు. కానీ పథక రచనలో కీలకంగా వ్యవహరించిన రాస్‌బిహారీ బోస్‌ తప్పించుకున్నాడు.  తరువాత జపాన్‌ వెళ్లిపోయాడు. చిత్తరంజన్‌ ఈ కేసును కూడా వాదించి వారిని విడిపించారు. అందుకోసం ఆయన కలకత్తా నుంచి ఢిల్లీ వెళ్లేవారు. రవింద్‌ ఘోష్, లాలా లజపతిరాయ్, బిపిన్‌పాల్, బాలగంగాధర తిలక్‌ వంటివారు భారత జాతీయ కాంగ్రెస్‌లో పనిచేసినవారే. కానీ మితవాదుల ధోరణి వారికి నచ్చేది కాదు. జాతీయ దృక్పథంతో, ఒక క్రమశిక్షణ కోసం ఆ సంస్థతో కలసి కొంత కాలం నడిచారు. తరువాత వేరయ్యారు. లేదా విభేదిస్తూ అందులోనే కొనసాగారు.  చిత్తరంజన్‌ కూడా అంతే. పైగా ఇప్పుడు పేర్కొన్న ఆ మహనీయులంతా దాస్‌ సన్నిహితులే కూడా. 

జలియన్‌వాలా బాగ్‌ ఉదంతంలో డయ్యర్‌నీ, ఓడ్వయ్యర్‌నీ బోను ఎక్కించాలని తీవ్రంగా శ్రమించినవారిలో చిత్తరంజన్‌ ఒకరు. ఆ మారణ హోమం దాస్‌ను కలచివేసినట్టు కనిపిస్తుంది. 1919 ఏప్రిల్‌ 13న ఆ దుర్ఘటన జరిగింది. జనరల్‌ డయ్యర్‌ పాశవిక చర్య మీద విచారణ జరపవలసిందని భారతీయులు పట్టుపట్టారు. దీని ఫలితమే హంటర్‌ కమిషన్‌. ఇందులో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. వారు చిమన్‌లాల్‌ సెటల్వాడ్, జగత్‌ నారాయణ్‌. కమిటీ ముందుకు వచ్చిన సాక్షులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసే అధికారం దాస్‌కు అప్పగించారు. కానీ ఇందుకు పంజాబ్‌ ప్రభుత్వం అంగీకరించలేదు. జలియన్‌ వాలాబాగ్‌ పరిణామాలలో భాగంగా అరెస్టయిన ముగ్గురికి హంటర్‌ ఎదుట సాక్ష్యం ఇచ్చే అవకాశం ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. కనీసం పంజాబ్‌ ప్రాంత నాయకుల అభిప్రాయాలను తీసుకోవాలని దాస్‌తో పాటు మోతీలాల్‌ కూడా కోరారు. ఇందుకు కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. దీనితో హంటర్‌ కమిషన్‌ను కాంగ్రెస్‌ బహిష్కరించింది. అప్పుడే గాంధీజీ అధ్యక్షతన కాంగ్రెస్‌ ఒక కమిటీని నియమించింది. 1,700 మందిని కలసి సేకరించిన సాక్ష్యాలను బట్టి 1,200 మంది మరణించారని తేలింది. 3,600 మంది గాయపడ్డారని వెల్లడైంది. కానీ ప్రభుత్వం చెప్పిన మృతులు 370. 

1922లో గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనాలని దాస్‌ నిర్ణయించుకున్నారు. బెంగాల్‌ ప్రాంతంలో ఆ ఉద్యమానికి అవసరమైన సన్నాహాలలో నిమగ్నమయ్యారు కూడా. నిజానికి జలియన్‌ వాలా బాగ్‌ ఉదంతం తరువాతనే ఆయన న్యాయవాద వృత్తిని వీడారు. ఇప్పుడు పూర్తిగా దూరమయ్యారు. కానీ చౌరీచౌరా ఉదంతం తరువాత గాంధీ ఏకపక్షంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం దాస్‌కు నచ్చలేదు. ‘బార్డోలీలో తలపెట్టిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆపివేయడానికి ఏదైనా బలవత్తరమైన కారణం ఉండవచ్చు. కానీ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని స్తంభింపచేయడానికి ఉద్దేశించిన స్వచ్ఛంద సేవకుల కార్యక్రమాన్ని నిలిపివేయడం అసమంజసం. ఈ విధంగా మహాత్ముడు పొరపాటు చేయడం ఇది రెండోసారి’ అని దాస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1922 నాటి గయ జాతీయ కాంగ్రెస్‌ సభలకు ఆయన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. శాసన మండళ్లను బహిష్కరించడం సరికాదన్నదే ముందు నుంచీ దాస్‌ వాదన. ఆ వాదన అక్కడ వీగిపోయింది. దాస్‌ కాంగ్రెస్‌కు రాజీనామా ఇచ్చారు. తరువాత స్వరాజ్‌ పార్టీ స్థాపించారు. 

గ్రామాలకు పునర్వైభవం తీసుకురావడం, అక్కడ స్వయం పాలన ఏర్పాటు చేయడం దాస్‌ కలల్లో ముఖ్యమైనది. అంటే వాటిని పునర్నిర్మించాలి. సహకార వ్యవస్థను ఏర్పాటు చేసి, కుటీర పరిశ్రమలను నెలకొల్పి స్వయం సమృద్ధంగా ఉంచాలని ఆయన భావించారు. అలాగే గాంధీజీతో కొన్ని అంశాలలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ జాతీయ విద్యను, దాని అవసరాన్ని దాస్‌ సరిగానే గుర్తించారు. తాను ఏర్పాటు చేసిన జాతీయ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్‌గా నేతాజీ బోస్‌ను దాస్‌ నియమించారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించడానికి కూడా ఆయన వెనుకాడలేదు.  చిత్తరంజన్‌ దాస్‌ జీవితానికి మరొక కోణం కూడా ఉంది. అది సృజనాత్మక రచనలు. మలంచా, మాల అనే గేయాల సంపుటాలు ఆయనవే. వీటికి బెంగాలీ సాహిత్యంలో ఎంతో ఖ్యాతి ఉంది. సాగర్‌ సంగీత్, అంతర్యామి, కిశోర్‌–కిశోరి ఆయన ఇతర రచనలు. ఒక అకుంఠిత కృషి తరువాత తీవ్రంగా అలసిపోయిన దాస్‌ విశ్రాంతి కోసం డార్జిలింగ్‌ వెళ్లారు. అక్కడే ఆయన కన్నుమూశారు. ఆయన భౌతికకాయం కలకత్తాకు వచ్చినప్పుడు దాదాపు మూడులక్షల మంది హాజరయ్యారు.  టాగోర్‌ చెప్పినట్టు చిత్తరంజన్‌ త్యాగశీలతను జాతికి నేర్పారు. అందుకే ఆయన దేశబంధు.
డా. గోపరాజు నారాయణరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement