స్వరాజ్యాన్ని సంపూర్ణం చేసినవాడు.... | Special story on vappala pangunni menon | Sakshi
Sakshi News home page

స్వరాజ్యాన్ని సంపూర్ణం చేసినవాడు....

Published Sun, Nov 25 2018 1:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Special story on vappala pangunni menon - Sakshi

భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే క్రమంలో ఎన్నో చర్చలు జరిగాయి. ‘స్వరాజ్యం గురించి చర్చలంటూ జరిగితే  ఇకపై అందులో పాల్గొనేవి భారత జాతీయ కాంగ్రెస్, బ్రిటిష్‌ ప్రభుత్వాలలే కాదు. మూడో పక్షం కూడా ఉంది– అది ముస్లిం లీగ్‌’ అన్నాడు జిన్నా. నిజానికి ముస్లింలీగ్‌ వైఖరి, పెచ్చరిల్లిన మత హింస, అది అంతర్యుద్ధానికి దారి తీస్తుందన్న అనుమానాలు నాటి చాలా పరిణామాలను ప్రభావితం చేశాయి, తొందరపెట్టాయి. స్వాతంత్య్రం, దేశ విభజన అంశాల మీద ప్రతిష్టంభన ఏర్పడడానికి కారణం కూడా అవే. ఈ దశలోనే కాంగ్రెస్, లీగ్, ప్రభుత్వంతో పాటు నాలుగో భాగస్వామి ఉందన్న సంగతి ఇంగ్లిష్‌ జాతి మహా మేధస్సుకు తట్టింది. ఆ భాగస్వామి – స్వదేశీ సంస్థానాలు.

 ఆఖరి వైస్రాయ్‌ మౌంట్‌బాటన్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన చర్చలలో నెహ్రూ, పటేల్, జేబీ కృపలానీ, బల్దేవ్‌సింగ్‌; జిన్నా, లియాఖత్‌ అలీ ఖాన్, నిష్తార్‌ వంటివారు ఉన్నారు (గాంధీజీ పాత్ర తక్కువే). అంతకు ముందు తేజ్‌ బహదూర్‌ సప్రూ, మోతీలాల్‌ వంటివారు చర్చలలో పాల్గొనేవారు. వీరందరితో పాటు మరొక పేరు కూడా చరిత్రలో ప్రముఖంగా ఉండాలని అనిపిస్తుంది. ఆయన వీపీ మేనన్‌. భారత్, పాకిస్తాన్‌ పేరుతో స్వతంత్ర ప్రతిపత్తి కల రెండు భూభాగాలుగా అఖండ∙భారత్‌ను విభజించడమే ప్రతిష్టంభనకు పరిష్కారమని మౌంట్‌బాటన్‌కు, నెహ్రూకు చెప్పినవారే మేనన్‌. కానీ బ్రిటిష్‌ ప్రభుత్వం అఖండ భారత్‌ను ఖండఖండాలుగా చీల్చి వెళ్లాలని అనుకుంది. 562 స్వదేశీ సంస్థానాలకు సంపూర్ణ స్వాతంత్య్రం ఇస్తూ, భారత్, పాక్‌లను ఏర్పాటు చేస్తూ విభజన ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఇదెంత ఘోర తప్పిదమో మేనన్‌కు తెలుసు. సంస్థానాలను స్వాతంత్య్రం వచ్చే నాటికే భారత్‌లో అంతర్భాగం చేస్తేనే ఆ చారిత్రక తప్పిదాన్ని సవరించగలమని మొదట గుర్తించినదీ ఆయనే. పటేల్‌ చొరవ, మేనన్‌ చాకచక్యం వల్ల  మూడు మినహా మిగిలిన సంస్థానాలన్నీ భారత్‌లో విలీనమైనాయి.

ఇదే జరగకపోతే, 562 సంస్థానాలతో రాజకీయ ఏకత్వం లేక ఈ దేశం తల్లడిల్లేది. అవి కొనసాగి ఉంటే ఎన్ని అంతర్యుద్ధాలు జరిగి ఉండేవో! ఎన్ని దేశాలు జోక్యం చేసుకునేవో! సాంస్కృతిక ఏకత్వాన్ని రాజకీయ ఏకత్వంతో పరిపూర్ణం చేయాలన్న స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాన్ని అలా పటేల్, మేనన్‌ గౌరవించారు. దేశాన్ని అంతర్యుద్ధం బెడద నుంచి బారి నుంచి రక్షించారు. వాపాళ్‌ పంగుణ్ణి మేనన్‌ (సెప్టెంబర్‌ 30, 1893–డిసెంబర్‌ 31, 1965) కేరళలోని కోథాకురస్సి (మలబార్‌) అనే గ్రామంలో పుట్టారు.  ఒక బంధువు సాయంతో 1914లో సిమ్లా వెళ్లి ప్రభుత్వోద్యోగంలో చేరారు. అది కూడా హోం శాఖలో సహాయకునిగా. తరువాత సంస్కరణల విభాగానికి పంపించారు. చివరి ముగ్గురు వైస్రాయ్‌లు లిన్‌లిత్‌గో (1936–1943), వేవెల్‌ (1943–1947), మౌంట్‌బాటన్‌ (1947–1948) దగ్గర ఆయన రాజకీయ సంస్కరణల కమిషనర్‌గా పనిచేశారు. ఆ ముగ్గురూ మేనన్‌ మాటకు ఎంతో విలువ ఇచ్చేవారు. 1942లో సంస్కరణల కమిషనర్‌ హెచ్‌వి హడ్సన్‌ వెళ్లిపోయిన తరువాత ఆ పదవిలో భారతీయుడిని నియమించడానికి ఇంగ్లండ్‌ మీనమేషాలు లెక్కపెట్టింది. కానీ  లిన్‌లిత్‌గో మేనన్‌ను ఆ పదవికి ఎంపిక చేశారు. స్వాతంత్య్రం గురించి, భారత్‌కు చెందిన ఇతర అంశాలను చర్చించడానికి వేవెల్‌ ఇంగ్లండ్‌ వెళ్లినప్పుడల్లా మేనన్‌ను తీసుకువెళ్లేవాడు. మౌంట్‌బాటన్‌ మేనన్‌ను రాజ్యాంగ సలహాదారుగా నియమించారు. మౌంట్‌బాటన్‌ సొంత బృందంలో మేనన్‌ ఒక్కరే భారతీయుడు. మిగిలిన ఇస్మే, కాంప్‌బెల్‌ వంటి వారందరినీ ఆయన ఇంగ్లండ్‌ నుంచి తెచ్చుకున్నారు. 

 సిమ్లా సమావేశాల (1945–46)కు మేనన్‌ సహాయ కార్యదర్శి. మౌంట్‌బాటన్, మేనన్‌ చర్చించుకునే సమయంలో సంస్థానాలకు స్వాతంత్య్రం ఇవ్వాలన్న మాట వచ్చింది. దీనితో మేనన్‌ అదే మీ అభిప్రాయమైతే నేను పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఇది తెలిసిన ఎడ్వినా మౌంట్‌బాటన్‌ కలగచేసుకుని మేనన్‌ను వారించారు. అయినా బ్రిటిష్‌ ప్రభుత్వం ఆ మహా చారిత్రక తప్పిదం చేసింది.  అందులో శ్వేతజాతికి లెక్కకు మించి దురుద్దేశాలు ఉన్నాయి. 
1947 ఆగస్టులో స్వాతంత్య్రం వస్తుందనగానే, జూన్‌ నుంచే పటేల్, మేనన్‌ సంస్థానాల విలీనం పని ఆరంభించారు. కశ్మీర్‌ది ఒక రకం సమస్య. నిజాం పాక్‌ వైపు మొగ్గాడు. తన దూతని పాక్‌కు పంపాడు. తిరువాన్కూర్‌కు స్వతంత్రంగా ఉండాలని ఆశ. ఇది ఫ్రాన్స్‌లో రాయబారిని నియమించేసింది. జునాగఢ్‌ (గుజరాత్‌) నవాబు పాక్‌లో చేరతానన్నాడు. తిరుగుబాటు వచ్చింది. తరువాత భారత్‌లో విలీనం చేశారు. జో«ద్‌పూర్‌ రాజా కూడా పాక్‌లో చేరతానన్నాడు. అతడిని కూడా లొంగదీశారు. కశ్మీర్‌ అంశాన్ని నెహ్రూ తన చేతుల్లోకి తీసుకున్నారు.
 
నిజాం వివాదాన్ని కూడా నెహ్రూ ఐక్య రాజ్యసమితి భద్రతా మండలికి నివేదించాలనే అనుకున్నారు. అక్కడి పరిస్థితులను చక్క దిద్దడానికి సైన్యాన్ని పంపించాలన్న సర్దార్‌ పటేల్‌ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించారు. ఇలాంటి పరిస్థితులలో ఒకే ఒక్క లేఖ నెహ్రూ చేతనే వాళ్లకి (రజాకార్లకి) గుణపాఠం చెప్పాల్సిందే అనిపించేటట్టు చేసింది. ఈ ఘట్టం మొత్తం ఎం కె కె నాయర్‌ (ఐఏఎస్‌ అధికారి) రాసిన (మలయాళంలో రాశారు. తరువాత ఆంగ్లంలోకి వచ్చింది) ‘ది స్టోరీ ఆఫ్‌ యాన్‌ ఎరా టోల్డ్‌ వితౌట్‌ ఇల్‌ విల్‌’ పుస్తకంలో ఉంది. బీజేపీ అగ్రనేత ఎల్‌కె అడ్వాణీ దీనిని కష్టపడి సేకరించి తన బ్లాగ్‌లో వివరించారు (నవంబర్‌ 5, 2013). ఇక్కడ తెలుస్తుంది– మేనన్‌ ముగ్గురు వైస్రాయ్‌ల దగ్గర పని చేసినా తన జాతీయతా భావాన్ని ఎంత పదిలంగా ఉంచుకున్నారో! 

నాయర్‌ ఇలా రాశారు: ‘ఏప్రిల్‌ 30, 1948న హైదరాబాద్‌ నుంచి మొత్తం భారత సైన్యం వైదొలగింది. తరువాత రజ్వి, రజాకార్లు సకల నీతినియమాలకు స్వస్తి పలికి సంస్థానమంతా స్వైర విహారం చేశారు. మౌంట్‌బాటన్‌ నిష్క్రమించడÆ , రాజాజీ గవర్నర్‌ జనరల్‌ కావడం అప్పుడే జరిగాయి. నెహ్రూ, పటేల్, రాజాజీలకు హైదరాబాద్‌ పరిస్థితి పూర్తిగా తెలుసు. నిజాం విపరీత ధోరణులకి స్వస్తి పలకాలంటే సైన్యాన్ని పంపించాల్సిందేనని పటేల్‌ నమ్మకం. అప్పటికే నిజాం పాకిస్తాన్‌కు తన దూతను పంపించాడు. లండన్‌ బ్యాంకులోని తన ప్రభుత్వ అకౌంట్‌ నుంచి పెద్ద మొత్తంలో నగదు కూడా బదలీ చేయించాడు. సర్దార్‌ పటేల్‌ ఈ విషయాలన్నీ మంత్రిమండలి సమావేశంలో ప్రస్తావించి, హైదరాబాద్‌లో సాగుతున్న భీతావహ పాలనకు అంతం పలకడానికి సైన్యాన్ని పంపించాలని కోరారు. సాధారణంగా నెమ్మదిగా, ప్రశాంతంగా, అంతర్జాతీయ మర్యాదలు పాటిస్తూ మాట్లాడే నెహ్రూ అవన్నీ విడిచి పెట్టేసి, ‘మీరొక పూర్తి మతతత్వవాది. మీ సిఫారసులను నేను ఏనాటికీ ఆమోదించను’ అన్నారు.  పటేల్‌ ఏ భావమూ వ్యక్తం చేయకుండానే వెళ్లిపోయారు.’

హైదరాబాద్‌ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. దీనికి ఒక పరిష్కారం చూడడంతో పాటు, నెహ్రూ, పటేల్‌ నడుమ సయోధ్యను కూడా సాధించాలని రాజాజీ భావించారు. రాజాజీ మొదట మేనన్‌తోనే సంప్రతించారు. సైన్యం సిద్ధంగానే ఉందనీ, ఆదేశాలు ఇచ్చిన మరుక్షణమే హైదరాబాద్‌కు బయలుదేరగలదని సమాచారం ఇచ్చారు మేనన్‌. నెహ్రూ, పటేల్‌ ఇద్దరినీ మరునాడు వైస్రాయ్‌ హౌస్‌కు (నేటి రాష్ట్రపతి భవన్‌) రావలసిందని రాజాజీ ఆహ్వానించారు. మేనన్‌ను కూడా ఆహ్వానించారు. మేనన్‌ రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరుతుండగా హోం శాఖ కార్యదర్శి బచ్‌ వచ్చి ఒక లేఖ ఇచ్చాడు. అది బ్రిటిష్‌ హైకమిషనర్‌ ఇచ్చినది. దానిని నేరుగా రాజాజీకి ఇచ్చారు మేనన్‌. ఇద్దరూ చూశారు. లేఖను తన దగ్గరే పెట్టుకున్నారు రాజాజీ. సమావేశంలో రాజాజీ నిజాం సంస్థానం పరిస్థితిని వివరించారు. దేశ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నెహ్రూ  తనదైన శైలిలో అలా చేస్తే అంతర్జాతీయంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందని బరువైన మాటలతో చెప్పారు. అప్పుడే మేనన్‌ తెచ్చిన లేఖను నెహ్రూ ముందు పెట్టారు రాజాజీ. నెహ్రూ ముఖం కందగడ్డ అయింది. బట్టతల మీద నరాలు ఉబ్బాయి, కోపం వల్ల. కుర్చీలో నుంచి లేచి, ఎదురుగా బల్లను గుద్ది ‘ఒక్క క్షణం కూడా వృథా చేయవద్దు. వాళ్లకి గుణపాఠం చెప్పాల్సిందే’ అని అరిచారు. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏం ఉంది? అప్పటికి రెండురోజుల క్రితమే ఆ సంస్థానంలో పనిచేసే ఇద్దరు క్రైస్తవ సన్యాసినుల మీద రజాకార్లు లైంగిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఒక కాన్వెంట్‌లో పనిచేస్తున్న ఆ నన్స్‌ డబ్బయ్‌ ఏళ్లవాళ్లు. ఇందుకు బ్రిటిష్‌ హై కమిషనర్‌  నిరసన ప్రకటిస్తూ రాసిన లేఖ అది. 

పథకం ప్రకారం సైన్యాన్ని పంపించవలసిందని కమాండర్‌ ఇన్‌ చీఫ్‌కు సమాచారం ఇవ్వమని ఆ క్షణంలోనే రాజాజీ మేనన్‌ను ఆదేశించారు. కథ ఇక్కడితో అయిపోలేదు. అప్పటికి భారత్‌కు, పాక్‌కు ఇంగ్లిష్‌ సైనిక కమాండర్లే ఉన్నారు. పైగా సమాచారం చేరవేసుకునేవాళ్లు. అలాంటి వాళ్లు ఉండగా ఈ ‘ఆపరేషన్‌’ (పోలో) ఎలా? అప్పుడు భారత కమాండర్‌ బూషర్‌. పాక్‌ సైన్యాధిపతికి కూడా అక్కడి రాజకీయ నాయకుల వలెనే భారత నేతలంటే పగ. మేనన్‌ ఆదేశం గురించి బూషెర్‌ రాజేంద్ర సింగ్‌కు చెప్పారు. రాజేంద్రసింగ్‌ జనరల్‌ చౌదరికి తెలియచేశారు. మూడు రోజులే సమయం. ఆ మరునాటి రాత్రే బూషెర్‌ పాక్‌ కమాండర్‌తో మాట్లాడాడు. ఆ మరునాడు ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయని అడుగుతూ మేనన్‌ బూషెర్‌ గదికి వెళ్లారు. ఏర్పాట్ల గురించి చెప్పబోయాడు బూషెర్‌. ‘అవన్నీ నాకు తెలుసు, నేను వచ్చింది అవి తెలుసుకోవడానికి కూడా కాదు. ఒకమాట చెప్పు. నిన్న రాత్రి నీవు పాక్‌ కమాండర్‌తో మాట్లాడావు కదా!’ అని నేరుగా అడిగారు మేనన్‌. బూషెర్‌ ముఖం పాలిపోయింది. ‘మేనన్‌! మిత్రులు వాళ్లలో వాళ్లు మాట్లాడుకోకూడదని చెప్పదలిచావా?’ అన్నాడు బూషెర్‌. ‘దానిని మిత్రుల మధ్య సంభాషణే అంటారా?’ మేనన్‌ తిరిగి అడిగారు. ‘అయితే శంకిస్తున్నావా?’ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అన్నాడు బూషెర్‌. ‘మరి.. ఫ్రెంచ్‌లో ఎందుకు మాట్లాడవలసి వచ్చింది?’ రెట్టించారు మేనన్‌. ‘ ఇంతకీ ఆ సంభాషణ మిత్రుల మధ్య మాటా మంతి అనే అంటావా?’ అడిగారు మేనన్‌. ‘అదే!’ అన్నాడు గడుసుగా బూషర్‌.

అప్పుడే ఒక పత్రాన్ని తీసి బూషెర్‌కి ఇచ్చారు మేనన్‌. ఆ ఇద్దరు ఫ్రెంచ్‌లో జరిపిన సంభాషణకి ఆంగ్లానువాదమది. ఇదీ అసలు సంభాషణ:బూషెర్‌: ఈ రాత్రికి హైదరాబాద్‌ మీద దాడి మొదలవుతోంది. ఎక్కువ రోజులేమీ తీసుకోదు. ఏదైనా చేయాలనుకుంటే సరైన పద్ధతిలో చేయండి!’ పాకిస్తాన్‌ కమాండర్‌: కృతజ్ఞతలు. ఇది లియాఖత్‌ అలీఖాన్‌కి చేరవేస్తాను. జిన్నా తుది క్షణాలు లెక్కిస్తున్నారు.....అప్పుడు భేషజమంతా విడిచి పెట్టి, ‘నేను తప్పు చేశాను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు వీపీ!’ అన్నాడు చెమటలు పట్టేసిన బూషెర్‌. బూషెర్‌ దగ్గర నుంచి ఒక పత్రం వెంటనే తీసుకున్నారు మేనన్‌. ‘వ్యక్తిగత, ఆరోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నాను. దీనిని వెంటనే ఆమోదించవలసింది.’ అంటే రాజీనామా. వెంటనే జనరల్‌ కరియప్ప భారత సైనిక దళాల ప్రధానాధికారి అయ్యారు. సంస్థానాల విలీనంలో ఇలాంటి ఎన్నో సామదానభేద దండోపాయాలను మేనన్‌ ప్రయోగించారు. భారత రాజ్యాంగం, సంస్థానాల విలీనం, రాజకీయ సంస్కరణల మీద తనకున్న లోతైన అవగాహనతో మేనన్‌ చాలా రచనలు చేశారు. వాటిలో ‘టాన్స్‌ఫర్‌ ఆఫ్‌ పవర్‌ ఇన్‌ ఇండియా’, ‘ది ఇంటిగ్రేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టేట్స్‌’, యాన్‌ ఔట్‌లైన్‌ ఆఫ్‌ ఇండియన్‌  కానిస్టిట్యూషనల్‌ హిస్టరీ’ పుస్తకాలు ఇప్పటికీ విలువను కోల్పోకుండా ఉన్నాయి.  స్వాతంత్య్రం రావడానికి ముందే ఇంతటి నిర్మాణాత్మకమైన పని చేసిన మేనన్‌ పటేల్‌ మరణంతోనే ఒక్కసారిగా తెరమరుగైపోయారు.
- డా. గోపరాజు నారాయణరావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement