స్వాతంత్య్రానంతరం తూర్పుగోదావరి జిల్లాలో 16 నియోజకవర్గాలుంటే వీటిలో నాలుగు ద్విసభ్య రిజర్వుడు స్థానాలు. 1952లో వీటికి తొలి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో జిల్లాలో పార్లమెంటు స్థానాలు మూడు. వాటిలో కాకినాడ ఒకటైతే రాజమండ్రి ద్విసభ్య నియోజకవర్గాలు ఉండేవి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి దక్కిన అసెంబ్లీ స్థానాలు నాలుగే. తుని, పెద్దాపురం, అన పర్తి, పామర్రు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. టంగుటూరి ప్రకాశం పంతులు కాంగ్రెస్‌ను వీడి సొంతంగా ఏర్పాటు చేసిన కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ (కేఎంపీపీ) జిల్లాలోని 4 స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించింది. ఆపార్టీ గెలిచిన నాలుగు స్థానాల్లో భద్రాచలం ఒకటి. అప్పట్లో భద్రాచలం డివిజన్‌గా ఈ జిల్లాలోనే ఉండేది. రైతు నేత ఎన్జీ రంగా స్థాపించిన కృషికార్ లోక్‌పార్టీ బూరుగుపూడి స్థానాన్ని గెలుచుకోగా, అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అభ్యర్థి అమలాపురం ద్విసభ్య రిజర్వుడు స్థానం నుంచి గెలుపొందారు.
దుర్గాబాయి దేశముఖ్‌ను ఓడించిన రాజమండ్రి !
1952లో జరిగిన తొలి ఎన్నికల్లో రాజమండ్రి ద్విసభ్య సాధారణ లోక్‌సభ స్థానంనుంచి విలక్షణ తీర్పు నమోదైంది. ఈ స్థానం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్ధిగా ఎన్.రెడ్డి నాయుడు కాంగ్రెస్ అభ్యర్ధిపై విజయం సాధించారు. ఆయన చేతిలో ఓటమి పాలైనది మరెవరో కాదు... ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశముఖ్ ! అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన కళా వెంకటరావు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన అమలాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘోరపరాజయం పాలయ్యారు. పోలైన ఓట్లలో ఆయనకు 12.5 శాతం మాత్రమే వచ్చాయి.
రాజమండ్రి నుంచి పోటీచేసిన సోషలిస్టునేత, స్వాతంత్య్ర సమరయోధులు మద్దూరి అన్నపూర్ణయ్య కూడా కమ్యూనిస్టు అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అంతేకాక మూడోస్థానంలో నిలిచారు. అలాగే రామచంద్రపురం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మల్లిపూడి పళ్లంరాజు (ప్రస్తుత కేంద్రమంత్రి పళ్లంరాజు తాత) ప్రజాపార్టీ అభ్యర్థి చేతిలో ఓడారు. ఆశ్చర్యం ఏమిటంటే స్వాతంత్య్రం తెచ్చానని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తొలి ఎన్నికల్లో మూడు లోక్‌సభ స్థానాల్లోనూ ఓటమి పాలైంది.
తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జెల్ల
Published Tue, Mar 25 2014 11:56 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement