వరప్రదాయని దుర్గామాతను తనివితీరా కొలుచుకునేందుకు నగరవాసులు తహతహలాడుతున్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బెంగాల్‌నుంచి కళాకారులను రప్పించుకుని వారితో అమ్మవారి ప్రతిమలను చేయిస్తున్నారు. చిత్తరంజన్ పార్కులోని మేళా మైదానంలో 17 అడుగుల ఎత్తు కలిగిన దుర్గామాత ప్రతిమ ఏర్పాటు కానుంది.
సాక్షి, న్యూఢిల్లీ:దేవీశరన్నవరాత్రులకు నగరవాసులతోపాటు ఇక్కడ నివసిస్తున్న బెంగాలీలుఅన్నివిధాలుగా సన్నద్ధమవుతున్నారు. నగరంలోని ప్రతి ప్రాంతంలో దుర్గాపూజ వేడుకలు జరిగినప్పటికి మినీ బెంగాల్‌గా పేర్కొనే చిత్తరంజన్ ఉద్యానవనంలో ఈ వేడుక వైభవం చూడడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. బెంగాల్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన కళాకారులు ఇక్కడి పందిళ్లలో దుర్గా మాత ప్రతిమలను రూపొందిస్తున్నారు. పూజా పందిళ్ల ఏర్పాటు పనులు రేయింబవళ్లు జరుగుతున్నాయి. కళాకారులు రోజుకు దాదాపు 15 గంటలపాటుశ్రమిస్తూ మహిషాసుర మర్థిని ప్రతిమను తీర్చిదిద్దుతున్నారు. విభిన్న రూపాలలో, విభిన్న ఇతివృత్తాలతో దుర్గాపూజ పందిళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. చిత్తరంజన్ పార్క్ మేళా మైదానంలో దుర్గామాత రాజస్థానీ మహిళా ఆకృతిని దాలుస్తుండగా, సంగమ్ విహార్‌లో అమ్మవారు ఆధునిక మహిళ రూపంలో దర్శనమివ్వనుంది.
చిత్తరంజన్‌పార్కులోని కాళీ మందిర్ ప్రాంతంలో బెంగాల్ నుంచి వచ్చిన 11 మంది కళాకారులు మూడు నెలలుగా దుర్గామాతప్రతిమలను రూపొందిస్తున్నారు. మొదట వెదురు కర్రలతో ఆకారాన్ని రూపొందించి, దానిపై గడ్డిని తాళ్లతో కట్టి ఆపై మట్టితో శరీరాకృతిని ఇస్తామని ప్రతిమలను తయారుచేస్తున్న గోవింద్‌నాథ్ చెప్పారు. ప్రతిమ తయారీ కోసం బంకమట్టిని బెంగాల్ నుంచి తీసుకువస్తామని ఆయన తెలిపారు.ఈ మట్టిని యమునానది తీరంనుంచి తెచ్చేమట్టితో కలిపి ప్రతిమల తయారీకి వినియోగిస్తామన్నారు. ప్రతిమ గట్టిగా ఉండడం కోసం మట్టిలో జనపనారను కలుపుతామన్నారు. ప్రతిమ ముఖాన్ని ముఖ్యంగా కన్నుతోపాటు ముక్కునుమరింత అందంగా తీర్చిదద్దడానికిఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. ప్రతిమ తయారీ పూర్తయ్యాక దానిని ఎండబెట్టి రంగులు వేస్తారు.
సాధారణంగా ఐదడుగుల దుర్గా ప్రతిమ ఖరీదు రూ. 10 వేల రూపాయలు ఉంటుంది. చిత్తరంజన్ పార్కులోని మేళా మైదానంలో 17 అడుగుల ఎత్తు కలిగిన దుర్గామాత ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. కాగా చిత్తరంజన్ పార్కు దుర్గాపూజా సమితి 1976లో ఏర్పాటైంది. ఈ పార్కుకు సమీపంలో నివసిస్తున్న కొందరు స్థానికులు ఏర్పాటై దీనిని ప్రారంభించారు. కాలక్రమేణా ఈ సమితి నిర్వహించే పూజాదికాలకు రాజధానిలో అత్యంత ప్రాచుర్యం లభించింది. దీంతో లక్షలాది మంది దుర్గాదేవి భక్తులు మాత ప్రతిమను దర్శించుకునేందుకు, వీలైతే పూజలో పాల్గొనేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఈ సమితికి పండుగ సమయంలో స్థానికులు భారీగా విరాళాలను అందజేస్తారు. 1993లో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ పార్కులో దక్షిణేశ్వర్ సెట్టింగ్‌ను ఏర్పాటుచేశారు. అదే ఏడాది బెంగాలీయుడైన స్వామి వివేకానంద శతజయంతి ఉత్సవాలను కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించారు. 80 అడుగుల పొడవు కలిగిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత 1994లో బేలూర్ మఠ్ (శ్రీ రామకృష్ణ ఆలయం) సెట్టింగ్‌ను ఏర్పాటుచేశారు.
దేవీశరన్నవరాత్రులు సిద్ధమవుతున్న నగరం
Published Wed, Sep 17 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM
Advertisement
Advertisement