సాక్షి, కల్వకుర్తి: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఏ రాజకీయ నేత ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్న ఒక పార్టీలో ఉన్న నేత.. నేడు ఇంకో పార్టీలో చేరుతున్నారు. తాజాగా తెలంగాణలోని అధికార బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించినట్టు తెలిపారు.
బీఆర్‌ఎస్‌కు గుడ్ బై..
అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల లిస్టును కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. నేడు తన నివాసంలో అనుచరులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం బీఆర్ఎస్ అధిష్టానానికి రాజీనామా లేఖను పంపినట్టు తెలిపారు.
కిషన్‌రెడ్డితో భేటీ..
మరోవైపు.. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన చిత్తరంజన్ దాస్, బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 1న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ రానుండగా.. ఆయన సమక్షంలోనే చిత్తరంజన్ కాషాయతీర్థం తీసుకోనున్నట్టు సమాచారం. కాగా, ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో చిత్తరంజన్ దాస్ భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని కిషన్ రెడ్డి ఆహ్వానించగా.. అందుకే చిత్తరంజన్ దాస్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
నాడు ఎన్టీఆర్‌ను ఓడించి జాయింట్ కిల్లర్‌గా..
ఇదిలా ఉండగా.. చిత్తరంజన్ దాస్‌కి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన పేరు ఉంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను ఓడించి జాయింట్ కిల్లర్‌గా పేరుగాంచారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎన్టీఆర్ పోటీ చేయగా.. కాంగ్రెస్ తరపున చిత్తరంజన్ దాస్ పోటీ చేసి గెలుపొందారు. అనంతరం, చిత్తరంజన్ దాస్ 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్‌లో చేరారు. కాగా, ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. చిత్తరంజన్ రాజీనామా స్థానికంగా బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తెలిసిందే. నిన్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హస్తం గూటికి చేరారు.
ఇది కూడా చదవండి: కారు చివరి సీట్లు ఖరారు.. పెండింగ్ స్థానాలకూ అభ్యర్థుల ఖరారు
Comments
Please login to add a commentAdd a comment