హిందీ రాబట్టి తెలుగు తేలికైంది | Radio inner | Sakshi
Sakshi News home page

హిందీ రాబట్టి తెలుగు తేలికైంది

Published Fri, Feb 20 2015 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

హిందీ రాబట్టి  తెలుగు తేలికైంది

హిందీ రాబట్టి తెలుగు తేలికైంది

రేడియో అంతరంగాలు
 
ఆకాశవాణిలో అనౌన్సర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి... అనువాదకునిగా, న్యూస్‌రీడర్‌గా, రేడియో జర్నలిస్టుగా ప్రఖ్యాతులైన దివి వెంకట్రామయ్య... టీవీ చానళ్లు లేని కాలంలో రేడియో జర్నలిజాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లారు. కృషా ్ణజిల్లా గుడివాడలో జన్మించి, ఏఎన్నార్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన వెంకట్రామయ్యకు బాల్యం నుంచి సాహిత్యం, నాటకాలు అంటే ఆసక్తి. రేడియో కార్యక్రమాలు, నాటికలు చేయాలనే ఆశతోనే అసలీ రంగంలోకి ఆయన అడుగు పెట్టారు. ‘‘జర్నలిజం నా వృత్తి, సాహిత్యం నా ప్రవృత్తి, సినిమా నా ప్రేయసి’’ అని  అంటుండే వెంకట్రామయ్యను ‘రేడియో అంతరంగాలు’  శీర్షిక కోసం శారదా శ్రీనివాసన్ చేసిన ఇంటర్వ్యూలోని విశేషాంశాలివి.
 
డి ఫర్ దేవులపల్లి?


నా సర్వీసంతా హైదరాబాద్‌లోనే సాగింది. 1963లో అనౌన్సర్‌గా చేరాను. నన్ను ఇంటర్వ్యూ చేసిన కమిటీలో దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ఉన్నారు. నా పేరు డి. వెంకట్రామయ్య అనగానే... ‘డి’ అంటే దేవులపల్లా అని చమత్కరించారు. ఓ నాలుగేళ్లు అనౌన్సర్‌గా పని చేశాక జర్నలిజంపై ఉన్న ఇష్టంతో హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ రీడర్‌గా చేరి, ఇరవై ఏడేళ్లు పని చేశాను. కేవలం వార్తలు చదవడమే కాకుండా రిపోర్టింగ్ చేస్తూ నా శక్తి, అవగాహన మేరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను.

రాంబాబు... ఏకాంబరం

నేను, ఉషశ్రీ, రతన్‌ప్రసాద్, సత్యనారాయణ అలా కొందరం కలసి కార్మికుల కార్యక్రమాన్ని ప్రారంభించాం. దానికి పూర్తిగా రచన, కార్యక్రమం రూపకల్పన నేనే. దాదాపు పదేళ్ల పాటు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాను.  ఆ కార్యక్రమంలోని మా పాత్రలను శ్రోతలు ఎంతగానో ఆదరించారు. నన్ను రాంబాబుగా, సత్యనారాయణను ఏకాంబరంగా బాగా గుర్తు పెట్టుకునేవారు.
 
దిగ్గజాల మధ్య...


రేడియో పుణ్యమా అని స్థానం నరసింహారావు, నాయని సుబ్బారావు, బుచ్చిబాబు, బాలాంత్రపు రజనీకాంతరావు, భాస్కరభట్ల కృష్ణారావు వంటి మహానుభావులతో కలసి పని చేసే అదృష్టం దక్కింది. వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. వారి తర్వాతి తరంలో గొల్లపూడి మారుతీరావు, శ్రీగోపాల్, శంకరమంచి సత్యం నేను కలసి పని చేశాం. మాడపాటి సత్యవతి, నేను కలసి వార్తావాహిని కార్యక్రమం నిర్వహించాం. శ్రోతలు దానిని ఎంతగానో ఆదరించారు. అప్పుడు టీవీలు లేవు. బయట ఏవైనా కార్యక్రమాలు, సభలు, సమావేశాలు జరిగితే మేమే వెళ్లి రికార్డు చేసుకొచ్చి ఎడిట్ చేసి వాటికి వ్యాఖ్యానాలు రాసి ప్రసారం చేసేవాళ్లం. రేడియోలో ప్రముఖుల వాయిస్ వినిపించే వాళ్లం. అలా నేను పీవీ నరసింహారావు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రముఖ సినీ నటులను ఇంటర్వ్యూ చేశాను.
 
అనువాదంలో వాడుక భాష

ఏ వార్త అయినా శ్రోతలందరికీ సులువుగా, సరళంగా అర్థమయ్యేలా ఉండాలనుకుంటాను. మామూలుగా ఇతర భాషల్లోంచి తెలుగులోకి వార్తలు, కథలు అనువాదం చేసినప్పుడు చదవడానికి ఇబ్బందిగా ఉంటాయి. అలా కాకుండా ఆ రచనకు మూలం తెలుగే అన్నట్టు ఉండాలనుకునేవాణ్ని. అందుకే అనువాదాన్ని వాడుక భాషలోకి తెచ్చేందుకు నా వంతు కృషి చేశా. నేను విడిగా హిందీ నేర్చుకున్నా. డిగ్రీలో నా రెండో భాష హిందీనే. అది నాకు ఎంతోగానో ఉపయోగపడింది.

సినిమాతో అనుబంధం

మొదటి నుంచీ నాకు సినిమాలంటే బాగా ఇష్టం. అప్పట్లో సినిమా పరిశ్రమ మొత్తం మద్రాసులోనే ఉన్నా చాలామంది ఆర్టిస్టులు నాకు పరిచయం ఉండేవాళ్లు. ‘విజయా’ చక్రపాణిగారు నా కార్యక్రమాలు విని హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నన్ను పిలిపించి అభినందించేవారు. ఆయన నడిపిస్తున్న పత్రికకు నన్ను కథలు, వ్యాసాలు కూడా రాయమన్నారు. ఇదంతా రేడియో గొప్పతనమే. అలాగే సింగీతం శ్రీనివాసరావుగారి ‘పంతులమ్మ’ చిత్రానికి స్క్రిప్ట్ నేనే రాశాను. అక్కినేని నాగేశ్వరరావు, వహీదా రెహ్మాన్‌లు నటించిన ‘బంగారు కలలు’ సినిమాలో హీరోయిన్‌కు మీరు (శారదా శ్రీనివాసన్) డబ్బింగ్ చెప్పారు కదా. ఆ సంభాషణలు రాసింది నేనే. అప్పట్లో తెలుగు, హిందీ సినిమాలపై వివిధ పత్రికల్లో రివ్యూలూ రాశాను. ఇప్పటికీ సినిమాలు బాగానే చూస్తాను.
 
రచయితగా...


రేడియోలో ఉద్యోగం చేస్తూనే కథలు రాసేవాణ్ణి. ఉదయరాగం, పువ్వులమేడ వంటి నవలలూ రాశా. అందరూ నవల ఆధారంగా నాటకాలు చేస్తే నేను అందుకు భిన్నంగా రేడియో నాటకాన్నే పుస్తకంగా మార్చాను.
 
న్యూస్‌రీడర్లకు శిక్షణ

పదవీ విరమణ చేసినప్పటి నుంచి గత పదేళ్లుగా ఎంతోమందికి వార్తల అనువాదం, చదివే పద్ధతి, ఎడిటింగ్ వంటి అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నాను. మనకున్న విద్యను పదిమందికి నేర్పితే వచ్చే సంతృప్తి, ఆనందమే వేరు.
 
 
అవార్డులు

డీవీ కథలకు  బుచ్చిబాబు స్మారక అవార్డు వచ్చింది. ‘‘బుచ్చిబాబుగారు నాకు ఇష్టమైన రచయిత. ఆయన పేరు మీద పురస్కారం అందుకోవడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది’’ అంటారు డీవీ. అలాగే తన కథలకు తెలుగు యూనివర్సిటీ అవార్డు అందుకున్నారు. రావిశాస్త్రి గారి పేరుపై తీసుకున్న ఆ పురస్కారం కూడా తనకు ఎంతో ముఖ్యమైందని అంటారు డీవీ. తెలుగులో వార్తలు ప్రారంభమై 75 ఏళ్లు నిండిన సందర్భంలో ఆలిండియా రేడియో వాళ్లు కూడా వెంకట్రామయ్యను ఢిల్లీలో సన్మానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement