చింతలపూడి వెంకట్రామయ్య (ఫైల్ ఫోటో)
సాక్షి, విశాఖ : జనసేన పార్టీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది. ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు నేతలు జనసేనను వీడుతున్న విషయం తెలిసిందే. నిన్నటికి నిన్న ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ పార్టీని వీడితే తాజాగా గాజువాకలోనూ ఆ పార్టీ నేత, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య ఝలక్ ఇచ్చారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెంకట్రామయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన నిన్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. గాజువాక నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు తాను జనసేన పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తాను గత 15 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలతో పాలు పంచుకుంటూ అయిదేళ్లుగా శాసనసభ్యుడిగా పని చేసి... ప్రజలందరికి అనునిత్యం చేదోడు వాదోడుగా ఉన్నాను. భవిష్యత్‌లో కూడా రాజకీయంగా గాజువాక నియోజకవర్గంలో మాత్రమే ఉండాలని కార్యకర్తల, శ్రేయోభిలాషుల కోరిక మేరకు జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెంకట్రామయ్య తెలిపారు. ఇంతవరకూ తనపై చూపిన అదరాభిమానాలకు కృతజ్ఞుడినని ఆయన అన్నారు.
ఇక చింతలపూడి వెంకట్రామయ్య రాజీనామాతో గాజువాకలో జనసేన పార్టీ ఖాళీ అయినట్లే. కాగా పవన్ నేతృత్వంలోని జనసేన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో కొన్ని రోజులుగా పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు, ఆకుల సత్యనారాయణ జనసేనకు గుడ్‌బై చెప్పారు. వీరి బాటలోనే మరికొందరు నడవనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment