VENKATRAMAIAH
-
గాజువాకలో జనసేనకు భారీ ఝలక్
సాక్షి, విశాఖ : జనసేన పార్టీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది. ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు నేతలు జనసేనను వీడుతున్న విషయం తెలిసిందే. నిన్నటికి నిన్న ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ పార్టీని వీడితే తాజాగా గాజువాకలోనూ ఆ పార్టీ నేత, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య ఝలక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెంకట్రామయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన నిన్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. గాజువాక నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు తాను జనసేన పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తాను గత 15 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలతో పాలు పంచుకుంటూ అయిదేళ్లుగా శాసనసభ్యుడిగా పని చేసి... ప్రజలందరికి అనునిత్యం చేదోడు వాదోడుగా ఉన్నాను. భవిష్యత్‌లో కూడా రాజకీయంగా గాజువాక నియోజకవర్గంలో మాత్రమే ఉండాలని కార్యకర్తల, శ్రేయోభిలాషుల కోరిక మేరకు జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెంకట్రామయ్య తెలిపారు. ఇంతవరకూ తనపై చూపిన అదరాభిమానాలకు కృతజ్ఞుడినని ఆయన అన్నారు. ఇక చింతలపూడి వెంకట్రామయ్య రాజీనామాతో గాజువాకలో జనసేన పార్టీ ఖాళీ అయినట్లే. కాగా పవన్ నేతృత్వంలోని జనసేన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో కొన్ని రోజులుగా పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు, ఆకుల సత్యనారాయణ జనసేనకు గుడ్‌బై చెప్పారు. వీరి బాటలోనే మరికొందరు నడవనున్నట్లు సమాచారం. -
హిందీ రాబట్టి తెలుగు తేలికైంది
రేడియో అంతరంగాలు ఆకాశవాణిలో అనౌన్సర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి... అనువాదకునిగా, న్యూస్‌రీడర్‌గా, రేడియో జర్నలిస్టుగా ప్రఖ్యాతులైన దివి వెంకట్రామయ్య... టీవీ చానళ్లు లేని కాలంలో రేడియో జర్నలిజాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లారు. కృషా ్ణజిల్లా గుడివాడలో జన్మించి, ఏఎన్నార్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన వెంకట్రామయ్యకు బాల్యం నుంచి సాహిత్యం, నాటకాలు అంటే ఆసక్తి. రేడియో కార్యక్రమాలు, నాటికలు చేయాలనే ఆశతోనే అసలీ రంగంలోకి ఆయన అడుగు పెట్టారు. ‘‘జర్నలిజం నా వృత్తి, సాహిత్యం నా ప్రవృత్తి, సినిమా నా ప్రేయసి’’ అని అంటుండే వెంకట్రామయ్యను ‘రేడియో అంతరంగాలు’ శీర్షిక కోసం శారదా శ్రీనివాసన్ చేసిన ఇంటర్వ్యూలోని విశేషాంశాలివి. డి ఫర్ దేవులపల్లి? నా సర్వీసంతా హైదరాబాద్‌లోనే సాగింది. 1963లో అనౌన్సర్‌గా చేరాను. నన్ను ఇంటర్వ్యూ చేసిన కమిటీలో దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ఉన్నారు. నా పేరు డి. వెంకట్రామయ్య అనగానే... ‘డి’ అంటే దేవులపల్లా అని చమత్కరించారు. ఓ నాలుగేళ్లు అనౌన్సర్‌గా పని చేశాక జర్నలిజంపై ఉన్న ఇష్టంతో హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ రీడర్‌గా చేరి, ఇరవై ఏడేళ్లు పని చేశాను. కేవలం వార్తలు చదవడమే కాకుండా రిపోర్టింగ్ చేస్తూ నా శక్తి, అవగాహన మేరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. రాంబాబు... ఏకాంబరం నేను, ఉషశ్రీ, రతన్‌ప్రసాద్, సత్యనారాయణ అలా కొందరం కలసి కార్మికుల కార్యక్రమాన్ని ప్రారంభించాం. దానికి పూర్తిగా రచన, కార్యక్రమం రూపకల్పన నేనే. దాదాపు పదేళ్ల పాటు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాను. ఆ కార్యక్రమంలోని మా పాత్రలను శ్రోతలు ఎంతగానో ఆదరించారు. నన్ను రాంబాబుగా, సత్యనారాయణను ఏకాంబరంగా బాగా గుర్తు పెట్టుకునేవారు. దిగ్గజాల మధ్య... రేడియో పుణ్యమా అని స్థానం నరసింహారావు, నాయని సుబ్బారావు, బుచ్చిబాబు, బాలాంత్రపు రజనీకాంతరావు, భాస్కరభట్ల కృష్ణారావు వంటి మహానుభావులతో కలసి పని చేసే అదృష్టం దక్కింది. వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. వారి తర్వాతి తరంలో గొల్లపూడి మారుతీరావు, శ్రీగోపాల్, శంకరమంచి సత్యం నేను కలసి పని చేశాం. మాడపాటి సత్యవతి, నేను కలసి వార్తావాహిని కార్యక్రమం నిర్వహించాం. శ్రోతలు దానిని ఎంతగానో ఆదరించారు. అప్పుడు టీవీలు లేవు. బయట ఏవైనా కార్యక్రమాలు, సభలు, సమావేశాలు జరిగితే మేమే వెళ్లి రికార్డు చేసుకొచ్చి ఎడిట్ చేసి వాటికి వ్యాఖ్యానాలు రాసి ప్రసారం చేసేవాళ్లం. రేడియోలో ప్రముఖుల వాయిస్ వినిపించే వాళ్లం. అలా నేను పీవీ నరసింహారావు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రముఖ సినీ నటులను ఇంటర్వ్యూ చేశాను. అనువాదంలో వాడుక భాష ఏ వార్త అయినా శ్రోతలందరికీ సులువుగా, సరళంగా అర్థమయ్యేలా ఉండాలనుకుంటాను. మామూలుగా ఇతర భాషల్లోంచి తెలుగులోకి వార్తలు, కథలు అనువాదం చేసినప్పుడు చదవడానికి ఇబ్బందిగా ఉంటాయి. అలా కాకుండా ఆ రచనకు మూలం తెలుగే అన్నట్టు ఉండాలనుకునేవాణ్ని. అందుకే అనువాదాన్ని వాడుక భాషలోకి తెచ్చేందుకు నా వంతు కృషి చేశా. నేను విడిగా హిందీ నేర్చుకున్నా. డిగ్రీలో నా రెండో భాష హిందీనే. అది నాకు ఎంతోగానో ఉపయోగపడింది. సినిమాతో అనుబంధం మొదటి నుంచీ నాకు సినిమాలంటే బాగా ఇష్టం. అప్పట్లో సినిమా పరిశ్రమ మొత్తం మద్రాసులోనే ఉన్నా చాలామంది ఆర్టిస్టులు నాకు పరిచయం ఉండేవాళ్లు. ‘విజయా’ చక్రపాణిగారు నా కార్యక్రమాలు విని హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నన్ను పిలిపించి అభినందించేవారు. ఆయన నడిపిస్తున్న పత్రికకు నన్ను కథలు, వ్యాసాలు కూడా రాయమన్నారు. ఇదంతా రేడియో గొప్పతనమే. అలాగే సింగీతం శ్రీనివాసరావుగారి ‘పంతులమ్మ’ చిత్రానికి స్క్రిప్ట్ నేనే రాశాను. అక్కినేని నాగేశ్వరరావు, వహీదా రెహ్మాన్‌లు నటించిన ‘బంగారు కలలు’ సినిమాలో హీరోయిన్‌కు మీరు (శారదా శ్రీనివాసన్) డబ్బింగ్ చెప్పారు కదా. ఆ సంభాషణలు రాసింది నేనే. అప్పట్లో తెలుగు, హిందీ సినిమాలపై వివిధ పత్రికల్లో రివ్యూలూ రాశాను. ఇప్పటికీ సినిమాలు బాగానే చూస్తాను. రచయితగా... రేడియోలో ఉద్యోగం చేస్తూనే కథలు రాసేవాణ్ణి. ఉదయరాగం, పువ్వులమేడ వంటి నవలలూ రాశా. అందరూ నవల ఆధారంగా నాటకాలు చేస్తే నేను అందుకు భిన్నంగా రేడియో నాటకాన్నే పుస్తకంగా మార్చాను. న్యూస్రీడర్లకు శిక్షణ పదవీ విరమణ చేసినప్పటి నుంచి గత పదేళ్లుగా ఎంతోమందికి వార్తల అనువాదం, చదివే పద్ధతి, ఎడిటింగ్ వంటి అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నాను. మనకున్న విద్యను పదిమందికి నేర్పితే వచ్చే సంతృప్తి, ఆనందమే వేరు. అవార్డులు డీవీ కథలకు బుచ్చిబాబు స్మారక అవార్డు వచ్చింది. ‘‘బుచ్చిబాబుగారు నాకు ఇష్టమైన రచయిత. ఆయన పేరు మీద పురస్కారం అందుకోవడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది’’ అంటారు డీవీ. అలాగే తన కథలకు తెలుగు యూనివర్సిటీ అవార్డు అందుకున్నారు. రావిశాస్త్రి గారి పేరుపై తీసుకున్న ఆ పురస్కారం కూడా తనకు ఎంతో ముఖ్యమైందని అంటారు డీవీ. తెలుగులో వార్తలు ప్రారంభమై 75 ఏళ్లు నిండిన సందర్భంలో ఆలిండియా రేడియో వాళ్లు కూడా వెంకట్రామయ్యను ఢిల్లీలో సన్మానించారు. -
పీలేరులో దళితుల ధర్నా
పీలేరు, న్యూస్‌లైన్: అగ్రకులస్తుల దాడిలో గాయపడిన దళితుడు మృతి చెందడంతో పీలేరు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మృతదేహంతో దళితులు నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలంలోని యర్రగుంట్లపల్లె పంచాయతీ మారెంరెడ్డిగారిపల్లెలో ఈ ఏడాది జనవరి 2న దళితులపై అగ్రకుల స్తులు దాడికి పాల్పడడంతో గాయపడిన సీ.వెంకట్రామయ్య మంగళవారం తెల్లవారు జామున తిరుపతి రుయాలో మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన వివిధ దళిత సంఘా ల నాయకులు, మారెంరెడ్డిగారిపల్లె దళితులు పెద్దఎత్తున మంగళవారం మధ్యాహ్నం పీలేరు తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వెంకట్రామయ్య మృతదేహంతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ వెంకట్రామయ్య భార్య సీ.నాగమ్మకు గానీ, చిన్న కుమార్తె సీ.సంతోషమ్మకు గానీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాడిలో గాయపడిన బాధితులందరికీ 2 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి మంజూరు చేయాలని, బాధిత కుటుంబాలకు పునరావాసం కింద ఇళ్ల స్థలాల మంజూరుతో పాటు గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరారు. అలాగే బాధిత కుటుంబాల పిల్లలందరికీ ప్రభుత్వ రెసిడెన్సియల్ పాఠశాలలో, వసతి గృహాల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో బాధితులకు ఎస్సీ, ఎస్టీ పీవో యాక్టు ప్రకారం రావాల్సిన నష్టపరిహారం తక్షణం అందించాలన్నారు. దాడులకు ప్రధాన కుట్రదారులైన బాలం నరేంద్రరెడ్డి, లక్ష్మీకర్, ప్రసాద్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని, కుట్రదారులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని, అగ్ర కులస్తులకు కొమ్ముకాసిన, చట్టాన్ని దుర్వినియోగం చేసిన అప్పటి పోలీస్ అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పీలేరు తహశీల్దార్ గోపాల్‌రెడ్డి, పీలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ టీ.నరసింహులు దళిత నాయకులతో మాట్లాడారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుం టామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు నివేదించి కేసు రీ ఓపన్ చేస్తామన్నారు. జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అయినా దళితులు శాంతించలేదు. విషయం తెలుసుకున్న మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌నారాయణ గుప్తా, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ ధనుంజయరావు మంగళవారం రాత్రి పీలేరు చేరుకున్నారు. బాధితులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు మృతుని కుమారులిద్దరికీ ఇళ్లు మంజూ రు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నాలుగు గంటల అనంతరం దళితులు ధర్నా విరమించారు. ధర్నాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అడిషనల్ ఎస్పీ అన్బురాజన్, పీలేరు సీఐ టీ.నరసింహులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో దళిత నాయకులు గుండాల నాయక్, ధనశేఖర్, రిటైర్డ్ డీఎస్పీ రామచంద్ర, చం ద్రయ్య, గట్టప్ప, రాజమ్మ, శ్రీనివాసు లు, ప్రసాద్‌రావ్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ప్రతినిధులు వృథా!
=ఏసీడీపీ నిధులకు గ్రహణం =ఎమ్మెల్యేల పనితీరుకు నిదర్శనం =రూ. కోట్లలో మూలుగుతున్నా పట్టించుకోని వైనం =ఇన్‌ఛార్జి మంత్రి కోటా నిధుల తీరు దారుణం విశాఖ రూరల్, న్యూస్‌లైన్: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి (ఏసీడీపీ) నిధుల వ్యయం విధానం జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుకు అద్దం పడుతోంది. వారి నిర్లక్ష్యం నియోజకవర్గాల్లో అభివృద్ధికి శాపంగా పరిణమిస్తోంది. రూ. కోట్లలో మంజూరవుతున్న నిధులను మూడేళ్లుగా అభివృద్ధి పనులకు వినియోగించకపోవడంతో నిరుపయోగమవుతున్నాయి. కొన్ని అభివృద్ధి పనులు,మౌలిక సదుపాయాలకు సర్కారు నుంచి నిధులు రాకపోగా.. ఉన్నవి ఖర్చు చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏసీడీపీ నిధులు ఒక్కో ఎమ్మెల్యేకు ఏటా రూ. కోటి వంతున ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇందులో 50 శాతం అంటే రూ.50 లక్షలు జిల్లా ఇన్చార్జి మంత్రి కోటాలోకి వెళ్తాయి. ప్రతి మూడు నెలలకు (క్వార్టర్‌కు) రూ.12.5 లక్షలు ఎమ్మెల్యేలకు, రూ.12.5 లక్షలు ఇన్చార్జి మంత్రికి ఇవ్వాలి. ఎమ్మెల్సీలకూ ఇలాగే కేటాయించాలి. కానీ ప్రభుత్వం వీటిని సకాలంలో విడుదల చేయడం లేదు. ఒక ఆర్థిక సంవత్సరం నిధులను మరో ఏడాది విడుదల చేస్తోంది. దీంతో అనేక కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో చివరి రెండు క్వార్టర్లకు రూ.50 లక్షలు చొప్పున ఇన్‌ఛార్జి మంత్రి కోటాను కలిపి ఈ ఏడాదివ్వడం విశేషం. అయితే 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి రెండు క్వార్టర్లకు రూ. 25 లక్షల ఏసీడీపీ నిధులు విడుదలయ్యాయి. 50 శాతం కూడా ఖర్చు కాలేదు : జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు 50 శాతం నిధులు కూడా ఖర్చు చేయకపోవడం శోచనీయం. విశాఖ-దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు 2010 నుంచి ఇప్పటి వరకు మూడేళ్లలో రూ.1.37 కోట్లు రాగా రూ.55.099 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. ఇన్‌ఛార్జి మంత్రి కోటాలోనూ రూ.57.089 లక్షలను మాత్రమే వివిధ పనులకు వినియోగించారు. యలమంచిలి ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి రాజు(కన్నబాబు) కోటాలో మూడేళ్లలో రూ.58.481 లక్షలు వినియోగించారు. గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య రూ.56.216 లక్షలు, విశాఖ-తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రూ.71.143 లక్షలు ఖర్చు చేయగా 2012-13కు సంబంధించి విడుదలైన నిధులు అలాగే ఖజానాలో మూలుగుతున్నాయి. విశాఖ-ఉత్తరం ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ రూ.35.159 లక్షలు, విశాఖ పశ్చిమం ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్ రూ.58.208 లక్షలు, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు రూ.81.416 లక్షలు, మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు 82.621 లక్షలు వివిధ పనులకు ఉపయోగించారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకట్రామయ్య, ద్రోణంరాజు శ్రీనివాసరావు, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, మళ్ల విజయ్‌ప్రసాద్, సివేరి సోమ, తైనాలవిజయ్‌కుమార్, కన్నబాబు, వెలగపూడి రామకృష్ణబాబులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం గమనార్హం. మూలుగుతున్న ‘ఇన్‌ఛార్జి’ నిధులు : నియోజకవర్గాల్లో వివిధ అవసరాలు, పనుల కోసం ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తే, వాటికి ఇన్చార్జి మంత్రి తన వాటాలో నిధులను మంజూరు చేస్తారు. మూడేళ్లుగా జిల్లాలో వరదలు, కరవు పరిస్థితులు ఉన్నాయి. నష్టాల నివారణకు, అభివృద్ధి పనులకు రూ. కోట్లు అవసరమున్నా.. ఈ నిధులను ఖర్చు చేయకపోవడం ప్రజా సంక్షేమంపై వీరి కున్న శ్రద్ధ ఏపాటిదో అవగతమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు క్వార్టర్ల నిధులు మంజూరైనా ఒక్క పనికి కూడా వాటిని వినియోగించ లేదు. ప్రస్తుతం జిల్లాకు ఇన్చార్జి మంత్రి లేకపోవడంతో ఆ కోటా నిధులు ఖజానా లో మూలుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2013-14లో ఇన్చార్జి మంత్రి కోటా కింద వచ్చే రూ. 8.5 కోట్లు కూడా నిరుపయోగం కానున్నాయి.