పీలేరులో దళితుల ధర్నా | Dalits dharna in pileru | Sakshi
Sakshi News home page

పీలేరులో దళితుల ధర్నా

Published Wed, Mar 26 2014 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM

Dalits dharna in pileru

 పీలేరు, న్యూస్‌లైన్: అగ్రకులస్తుల దాడిలో గాయపడిన దళితుడు మృతి చెందడంతో పీలేరు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మృతదేహంతో దళితులు నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలంలోని యర్రగుంట్లపల్లె పంచాయతీ మారెంరెడ్డిగారిపల్లెలో ఈ ఏడాది జనవరి 2న దళితులపై అగ్రకుల స్తులు దాడికి పాల్పడడంతో గాయపడిన సీ.వెంకట్రామయ్య మంగళవారం తెల్లవారు జామున తిరుపతి రుయాలో మృతి చెందారు.

 దీంతో ఆగ్రహించిన వివిధ దళిత సంఘా ల నాయకులు, మారెంరెడ్డిగారిపల్లె దళితులు పెద్దఎత్తున మంగళవారం మధ్యాహ్నం పీలేరు తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వెంకట్రామయ్య మృతదేహంతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ వెంకట్రామయ్య భార్య సీ.నాగమ్మకు గానీ, చిన్న కుమార్తె సీ.సంతోషమ్మకు గానీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాడిలో గాయపడిన బాధితులందరికీ 2 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి మంజూరు చేయాలని, బాధిత కుటుంబాలకు పునరావాసం కింద ఇళ్ల స్థలాల మంజూరుతో పాటు గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరారు.

అలాగే బాధిత కుటుంబాల పిల్లలందరికీ ప్రభుత్వ రెసిడెన్సియల్ పాఠశాలలో, వసతి గృహాల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో బాధితులకు ఎస్సీ, ఎస్టీ పీవో యాక్టు ప్రకారం రావాల్సిన నష్టపరిహారం తక్షణం అందించాలన్నారు. దాడులకు ప్రధాన కుట్రదారులైన బాలం నరేంద్రరెడ్డి, లక్ష్మీకర్, ప్రసాద్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని, కుట్రదారులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని, అగ్ర కులస్తులకు కొమ్ముకాసిన, చట్టాన్ని దుర్వినియోగం చేసిన అప్పటి పోలీస్ అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పీలేరు తహశీల్దార్ గోపాల్‌రెడ్డి, పీలేరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టీ.నరసింహులు దళిత నాయకులతో మాట్లాడారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుం టామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు నివేదించి కేసు రీ ఓపన్ చేస్తామన్నారు. జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

అయినా దళితులు శాంతించలేదు. విషయం తెలుసుకున్న మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌నారాయణ గుప్తా, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ ధనుంజయరావు మంగళవారం రాత్రి పీలేరు చేరుకున్నారు. బాధితులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు మృతుని కుమారులిద్దరికీ ఇళ్లు మంజూ రు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నాలుగు గంటల అనంతరం దళితులు ధర్నా విరమించారు. ధర్నాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అడిషనల్ ఎస్పీ అన్‌బురాజన్, పీలేరు సీఐ టీ.నరసింహులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో దళిత నాయకులు గుండాల నాయక్, ధనశేఖర్, రిటైర్డ్ డీఎస్పీ రామచంద్ర, చం ద్రయ్య, గట్టప్ప, రాజమ్మ, శ్రీనివాసు లు, ప్రసాద్‌రావ్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement