మంగళహారతి సావిత్రి
రేడియో అంతరంగాలు
అద్భుత స్వరం... ఆమెకు దేవుడిచ్చిన వరం. ఆ స్వరంతో దాదాపు నలభై ఏళ్ల పాటు ఆకాశవాణి శ్రోతలను అలరించారు ప్రముఖ రేడియో కళాకారిణి పాకాల సావిత్రీ దేవి. రేడియోలో పని చేసినంత కాలం ఎందరో మహానుభావుల స్వరాలకు శ్రుతి కలిపారామె. కర్ణాటక సంగీత విద్వాంసురాలైన సావిత్రీ దేవి ఆకాశవాణిలో సాంప్రదాయిక పాటలతో పాటు ఎన్నో జానపదాలూ పాడారు. అలా దాదాపు 4 వేల పాటలు పాడారు. అలాగే న్యాయపతి కామేశ్వరి (రేడియో అక్కయ్య) నిర్వహించిన కార్యక్రమంలో కూడా నటించారు. ఈ వారం ‘రేడియో అంతరంగాలు’ ఆమెను ఆత్మీయంగా పలకరించారు ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్. ఆ విశేషాలు సావిత్రీ దేవి
మాటల్లోనే...
ఏడేళ్ల వయసులోనే సంగీత సాధన ప్రారంభించాను. మా అమ్మనాన్నలు ఇద్దరూ పాడేవారు. అలా సంగీతం నాకు వారసత్వంగా వచ్చిందేమో. నేను చిలకలపూడి వెంకటేశ్వరశర్మ, చావలి కృష్ణమూర్తి, గద్వాల్ ఆస్థాన విద్వాంసులు పురాణం కనకయ్యగారి లాంటి ఎంతోమంది గొప్ప విద్వాంసుల దగ్గర సంగీతం నేర్చుకున్నాను. అలా నా జీవితమే సంగీతంతో ముడిపడి పోయింది.
రెగ్యులర్ ఆర్టిస్ట్‌గా...
మొదట నేను విజయవాడ స్టేషన్‌లో క్యాజువల్ ఆర్టిస్ట్‌గా పాటలు పాడేదాన్ని. ఓ సారి హైదరాబాద్‌లో ‘గీత గోవిందం’, ‘గీతా శంకరం’ అనే సంగీత రూపకాలు చేయడానికి నన్ను పిలిచారు. అవి చేసి నేను తిరిగి వెళ్తుండగా అప్పటి స్టేషన్ డెరైక్టర్ నాయర్‌గారు నన్ను ఇక్కడే స్టాఫ్ ఆర్టిస్ట్‌గా ఉండి పొమ్మన్నారు. అప్పుడు నేను నా తల్లిదండ్రులను అడిగి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. అలా 1958లో హైదరాబాద్ స్టేషన్‌లో రెగ్యులర్ స్టాఫ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టాను. నా కోసం మా కుటుంబమంతా ఇక్కడకు వచ్చేసింది.
సాహిత్య దిగ్గజాల పాటలు
నా నలభై ఏళ్ల సర్వీసులో దేవులపల్లి కృష్ణశాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావు, స్థానం నరసింహారావుగారు లాంటి ఎంతోమంది గొప్ప రచయితలు రాసిన పాటలు ఎన్నో పాడాను. ఆకాశవాణి వల్లే నాకు ఆ అదృష్టం దక్కింది. వారు నా కోసం ప్రత్యేకంగా పాటలు రాసేవారు. మా రెండో అమ్మాయి పుట్టినప్పుడు నెలరోజులకే నేను డ్యూటీలో చేరాను. అప్పుడు నేను చంటిపిల్ల తల్లినని కృష్ణశాస్త్రి గారు నా కోసం ‘మూసే నీ కనుల, ఎవరు పూసేరో నిదుర’ అనే జోల పాటను ప్రత్యేకంగా రాసి పాడించారు.. నా సర్వీసును విజయవంతంగా పూర్తి చేసి స్టాఫ్ ఆర్టిస్ట్‌గానే 1999లో పదవీ విరమణ పొందాను.
భక్తి పాటలు అనేకం
నేను కర్ణాటక సంగీతంతో పాటు లలిత సంగీతమూ పాడేదాన్ని. ‘భక్తి రంజని’ కార్యక్రమంలో సంప్రదాయ కీర్తనలు ఎన్నో పాడాను. చిత్తరంజన్‌గారితో కలిసి పాడటం గొప్ప అనుభవం. ఆయన ఎంతో ఓర్పుతో నేర్పించేవారు. రేడియోలోనే కాకుండా బయట కూడా ఎన్నో కచ్చేరీలు చేశాను. అందులో సోలో కచ్చేరీలూ చాలా ఉన్నాయి. ఇప్పటికీ పాడుతూనే ఉంటాను. పాటలు మననం చేసుకోవడమే నాకు బలం.
రేడియో సంగీతం
కృష్ణశాస్త్రిగారు రాసిన ‘శర్మిష్ఠ’ లాంటి ఎన్నో రూపకాల్లో పాడాను. నా పాటలను ప్రశంసిస్తూ స్టేషన్‌కు ఎన్నో ఉత్తరాలు వచ్చేవి. కేవలం శాస్త్రీయ సంగీతమే కాకుండా వింజమూరి సీతాదేవిగారి సారథ్యంలో జానపద గీతాలూ పాడాను. ఎన్నో దేశభక్తి గీతాలూ ఆలపించాను. ఇక స్త్రీల కార్యక్రమంలో నేను, మీరు (శారదా శ్రీనివాసన్) కలిసి ఎన్నో పాటలు పాడాం. కృష్ణశాస్త్రి, రజనీకాంతరావుగారు కలిసి రాసిన ‘నీ ఇంటికీ పిలువకూ, నన్ను లోనికి రమ్మనకూ..’ అనే పాట నాకెంతో పేరు సంపాదించి పెట్టింది. అలాగే వారానికో కొత్త మంగళహారతి పాటను శ్రోతలకు పరిచయం చేసేదాన్ని. దాంతో నన్ను చాలామంది ‘మంగళహారతి సావిత్రి’ అనే పిలిచేవాళ్లు.
నాటకాల్లోనూ ప్రవేశం..
పాటలు మాత్రమే కాకుండా అడపా దడపా రేడియో నాటకాల్లోనూ చేశాను. రేడియో అక్కయ్యగారు, తురగా జానకీరాణిగారు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. మహిళా సమాజం, రంగవల్లిలో చేశాను. మహిళా సమాజంలో ప్రతి బుధవారం ‘పెద్దక్క పెత్తనాలు’లో నేను, శ్యామలాదేవిగారు చేసేవాళ్లం. అందులో నేను వారమంతా అన్ని ఊళ్లూ తిరిగినట్టు ఆ వారం రాష్ట్రంలో జరిగిన ఉత్సవాలు, ఉరుసులు, వార్తలు, ముఖ్యమైన సంఘటనల గురించి చెప్పేదాన్ని. అలా పెద్దక్కగా నన్ను శ్రోతలు గుర్తుపెట్టుకున్నారు. ప్రస్తుతం గుళ్లలో కచ్చేరీలూ ఇస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నాను.
ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల
ఫొటోలు: ఠాకూర్
రవీంద్రభారతి శంకుస్థాపన రోజు...
హైదరాబాద్‌లో ఇప్పుడున్న కట్టడాల్లో చాలా వరకు మా పాటలతోనే ప్రారంభమయ్యాయి. రవీంద్రభారతి శంకుస్థాపన రోజు మేం పాటలు పాడాం. అలా ఎన్నో ప్రభుత్వ భవనాలు, పరిశ్రమలు ప్రారంభించే ముందు మా సంగీతం తప్పనిసరిగా ఉండేది. భారత తొలి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్ మొదలుకొని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటి రాజకీయ నాయకులు నగరానికి వచ్చిన ప్రతిసారీ వారి ఎదుట మేము పాటలు పాడేవాళ్లం.