Savitri Devi
-
Savitri Devi: నిందలు పడి కూతుర్ని విజేతను చేసింది
‘కూతుర్ని ఎవరికో అమ్మేసింది. ఏ తప్పుడు పనుల్లోనో పెట్టింది’... భర్త చనిపోయిన సావిత్రి తన కూతుర్ని పొరుగూరి స్కూల్లో చేర్చాక ఊరి ఆడవాళ్ల నుంచి ఎదుర్కొన్న నింద అది. ‘ఏమైనా సరే నా కూతురు క్రికెట్ ఆడాలి’ అనుకుంది సావిత్రి. అందుకే ఘోరమైన పేదరికంలో కూడా కూతురి కలలకు అండగా నిలబడింది. ఇవాళ ఆ కూతురు– అర్చనా దేవి ప్రపంచ విజేతగా నిలిచింది. ‘అండర్– 19’ క్రికెట్ జట్టులో బౌలర్‌గా, ఫీల్డర్‌గా రాణించి ఫైనల్స్ గెలవడంలో కీలకంగా మారింది. ఆడపిల్లల ఆకాంక్షలకు ఎన్ని అవరోధాలు ఉన్నా తల్లి గట్టిగా నిలబడితే కొండంత బలం అని తల్లులకు ఈ స్ఫూర్తిగాథ సందేశం ఇస్తోంది. సౌత్ ఆఫ్రికాలో అండర్ 19 టి 20 మహిళా ప్రపంచకప్. 16 దేశాలు తలపడ్డాయి. మన అమ్మాయిలు కప్ సాధించారు. మొత్తం 16 మంది టీమ్. ఒక్కొక్కరు శివంగిలా మారి అన్ని జట్లతో తలపడ్డారు. ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను అతి తక్కువ స్కోర్ (68) వద్ద కట్టడి చేసి 14 ఓవర్లకే మూడు వికెట్ల నష్టానికి విజయం సాధించారు. ఇంగ్లాండ్ జట్టును బౌలర్లు హడలగొట్టారు. వారిలో టిటాస్ సాధు, పార్శవి కాకుండా మూడో బౌలర్ ఉంది. అర్చనా దేవి. కీలకమైన రెండు వికెట్లు పడగొట్టడమే కాకుండా ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి మూడవ వికెట్ పడేందుకు కారణమైంది. వరల్డ్ కప్‌లో ప్రతి ఒక్కరిదీ ఒక విజయగాథే అయినా అర్చనా దేవిది భిన్నమైనది. కష్టాలను తట్టుకుని అర్చనా దేవి (18) సొంత ఊరు ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని రతై పూర్వ. గంగానది ఒడ్డునే వీరి పొలం. ఊరు. వరదలతో ఆ పొలం సంవత్సరంలో సగం రోజులు మునకలో ఉండేది. మిగిలిన సగం రోజుల్లో తండ్రి శివరామ్ వ్యవసాయం సాగించేవాడు. కాని ఆయనను 2008లో కేన్సర్ కబళించింది. దాంతో ఊళ్లో ఆడవాళ్లందరూ అర్చనా తల్లి సావిత్రిదేవిని నష్ట జాతకురాలిగా పరిగణించసాగారు. సావిత్రి వెరవలేదు. ఇద్దరు కొడుకులను, కూతురైన అర్చనను రెక్కల కింద పెట్టుకుని సాకసాగింది. దురదృష్టం... ఆఖరు కొడుకు బుద్ధిమాన్ కూడా మరణించాడు. దాంతో సావిత్రిని చూస్తే చాలు ఊరు దడుచుకునేది. ‘ఇదో మంత్రగత్తె. మొదట భర్తను మింగింది. తర్వాత కొడుకును’ అని... ఎదురుపడితే పక్కకు తప్పుకునేవారు. సావిత్రి దేవి ఇంకా రాటు దేలింది. పిల్లల కోసం ఎలాగైనా బతకాలనుకుంది. కూతురి క్రికెట్ అర్చనకు క్రికెట్ పై ఆసక్తి, పట్టు కూడా సోదరుడు బుద్ధిమాన్ వల్ల వచ్చినవే. అతను అర్చనను వెంటబెట్టుకుని పొలాల్లో క్రికెట్ ఆడేవాడు. తోడుగా అర్చన బ్యాటు ఝళిపించేది. అర్చన టాలెంట్‌ను బుద్ధిమాన్ వెంటనే గమనించాడు. ‘నువ్వు క్రికెటర్‌వి కావాలి’ అనేవాడు. అర్చన ఆశలు పెట్టుకుంది కాని తల్లి పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు బుద్ధిమాన్ బాల్ని కొడితే అది దూరంగా చెత్తలో పడింది. వెళ్లి చేతులతో చెత్తను కదిలిస్తూ ఉంటే పాము కరిచింది. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుంటే కొన ఊపిరితో ఉన్న బుద్ధిమాన్ ‘అర్చనను క్రికెట్ మాన్పించవద్దు’ అని చెప్పి మరణించాడు. ఆ రోజు సావిత్రి సంకల్పించుకుంది ఎలాగైనా అర్చనను క్రికెటర్ చేయాలని. స్కూల్లో చేర్చి అర్చన క్రికెట్ కొనసాగాలంటే చదువును, ఆటలను నేర్పించే స్కూల్లో చేర్పించాలని సావిత్రి నిశ్చయించుకుంది. తమ పల్లెకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే గంజ్ మొరాదాబాద్‌లోని గర్ల్స్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించింది. వాళ్లుండే పల్లె నుంచి అలా మరో ఊరి బోర్డింగ్ స్కూల్లో ఏ ఆడపిల్లా చేరలేదు. అందుకని ఊరి ఆడవాళ్లు సావిత్రిని అనుమానించారు. కూతుర్ని ఎవరికో మంచి బేరానికి అమ్మేసి ఉంటుందని అనేవారు. చెడ్డ పనుల కోసం ఊరు దాటించింది అనేవారు. అవన్నీ సావిత్రీదేవి నిశ్శబ్దంగా భరించింది. కొడుకును ఢిల్లీలో బట్టల ఫ్యాక్టరీలో పనికి పెట్టి తమకున్న ఒక ఆవు, ఒక బర్రె పాల మీద ఆధారపడి కూతురి ఖర్చులను అతి కష్టం మీద చూసేది. ‘నేను ఉన్నాను’ అని అర్చనకు ధైర్యం చెప్పేది. దశ తిరిగింది బోర్డింగ్ స్కూల్లోని ఒక టీచరు అర్చన ప్రతిభను గమనించి కాన్పూరులో ఉండే కోచ్ కపిల్ పాండే దృష్టికి తీసుకెళ్లింది. ఆ టీచరు తీసిన అర్చన బౌలింగ్ వీడియోలు చూసిన కపిల్ పాండే వెంటనే కాన్పూరుకు పిలిపించి అక్కడి క్రికెట్ అసోసియేషన్‌లో జాయిన్ చేసి తన శిష్యురాలిగా తీసుకున్నాడు. కపిల్ పాండే క్రికెటర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా కోచ్ కావడంతో కుల్దీప్ యాదవ్ అర్చనను ప్రోత్సహించాడు. ఆమె శిక్షణకు సాయం అందించాడు. అతిథులయ్యారు ‘ఒకప్పుడు మా ఇంట నీళ్లు కూడా ఎవరూ తాగలేదు. ఇవాళ అందరూ అతిథులుగా వచ్చి మీ దశ తిరిగింది అని భోజనం చేస్తున్నారు’ అంది అర్చన తల్లి సావిత్రి. వాళ్ల ఊరిలో ఆ కుటుంబం ఇప్పుడు సగర్వంగా నిలబడింది. తల్లి తన కూతురి ద్వారా అలా నిలబెట్టుకుంది. ఆ తల్లీకూతుళ్లను చూసి ఊరు మురిసిపోతోందిగాని అది ఎన్నో ఎదురీతల ఫలితం. ఎవరో అన్నట్టు... అపజయాల ఆవల విజయ తీరం ఉంటుంది. అర్చన విజయానికి తెడ్డు వేసిన నావ– ఆ తల్లి సావిత్రీ దేవి. అందుకే అర్చన విజయంలో సగం ఆ తల్లిదే. ఇంగ్లాండ్‌తో ఫైనల్స్‌లో అర్చన క్యాచ్ ప్రపంచ విజేత మన జట్టు -
సావిత్రీదేవి కన్నుమూత
లక్డీకాపూల్ : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, సామాజిక కార్యకర్త టి.సావిత్రీదేవి(95) సోమవారం కన్నుమూశారు. పంజగుట్టలోని నాగార్జున సర్కిల్లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కిన్నెర, మాధురితో పాటు నలుగురు మనవరాళ్లు ఉన్నారు. వీరిలో నిర్వి తన ప్రతిభా పాటవాలతో చిన్న వయసులోనే సెలబ్రిటీగా నిలిచారు. సోమవారం సావిత్రీదేవి అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరిపారు. పలువురు ప్రముఖులు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
మంగళహారతి సావిత్రి
రేడియో అంతరంగాలు అద్భుత స్వరం... ఆమెకు దేవుడిచ్చిన వరం. ఆ స్వరంతో దాదాపు నలభై ఏళ్ల పాటు ఆకాశవాణి శ్రోతలను అలరించారు ప్రముఖ రేడియో కళాకారిణి పాకాల సావిత్రీ దేవి. రేడియోలో పని చేసినంత కాలం ఎందరో మహానుభావుల స్వరాలకు శ్రుతి కలిపారామె. కర్ణాటక సంగీత విద్వాంసురాలైన సావిత్రీ దేవి ఆకాశవాణిలో సాంప్రదాయిక పాటలతో పాటు ఎన్నో జానపదాలూ పాడారు. అలా దాదాపు 4 వేల పాటలు పాడారు. అలాగే న్యాయపతి కామేశ్వరి (రేడియో అక్కయ్య) నిర్వహించిన కార్యక్రమంలో కూడా నటించారు. ఈ వారం ‘రేడియో అంతరంగాలు’ ఆమెను ఆత్మీయంగా పలకరించారు ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్. ఆ విశేషాలు సావిత్రీ దేవి మాటల్లోనే... ఏడేళ్ల వయసులోనే సంగీత సాధన ప్రారంభించాను. మా అమ్మనాన్నలు ఇద్దరూ పాడేవారు. అలా సంగీతం నాకు వారసత్వంగా వచ్చిందేమో. నేను చిలకలపూడి వెంకటేశ్వరశర్మ, చావలి కృష్ణమూర్తి, గద్వాల్ ఆస్థాన విద్వాంసులు పురాణం కనకయ్యగారి లాంటి ఎంతోమంది గొప్ప విద్వాంసుల దగ్గర సంగీతం నేర్చుకున్నాను. అలా నా జీవితమే సంగీతంతో ముడిపడి పోయింది. రెగ్యులర్ ఆర్టిస్ట్‌గా... మొదట నేను విజయవాడ స్టేషన్లో క్యాజువల్ ఆర్టిస్ట్‌గా పాటలు పాడేదాన్ని. ఓ సారి హైదరాబాద్‌లో ‘గీత గోవిందం’, ‘గీతా శంకరం’ అనే సంగీత రూపకాలు చేయడానికి నన్ను పిలిచారు. అవి చేసి నేను తిరిగి వెళ్తుండగా అప్పటి స్టేషన్ డెరైక్టర్ నాయర్‌గారు నన్ను ఇక్కడే స్టాఫ్ ఆర్టిస్ట్‌గా ఉండి పొమ్మన్నారు. అప్పుడు నేను నా తల్లిదండ్రులను అడిగి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. అలా 1958లో హైదరాబాద్ స్టేషన్లో రెగ్యులర్ స్టాఫ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టాను. నా కోసం మా కుటుంబమంతా ఇక్కడకు వచ్చేసింది. సాహిత్య దిగ్గజాల పాటలు నా నలభై ఏళ్ల సర్వీసులో దేవులపల్లి కృష్ణశాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావు, స్థానం నరసింహారావుగారు లాంటి ఎంతోమంది గొప్ప రచయితలు రాసిన పాటలు ఎన్నో పాడాను. ఆకాశవాణి వల్లే నాకు ఆ అదృష్టం దక్కింది. వారు నా కోసం ప్రత్యేకంగా పాటలు రాసేవారు. మా రెండో అమ్మాయి పుట్టినప్పుడు నెలరోజులకే నేను డ్యూటీలో చేరాను. అప్పుడు నేను చంటిపిల్ల తల్లినని కృష్ణశాస్త్రి గారు నా కోసం ‘మూసే నీ కనుల, ఎవరు పూసేరో నిదుర’ అనే జోల పాటను ప్రత్యేకంగా రాసి పాడించారు.. నా సర్వీసును విజయవంతంగా పూర్తి చేసి స్టాఫ్ ఆర్టిస్ట్‌గానే 1999లో పదవీ విరమణ పొందాను. భక్తి పాటలు అనేకం నేను కర్ణాటక సంగీతంతో పాటు లలిత సంగీతమూ పాడేదాన్ని. ‘భక్తి రంజని’ కార్యక్రమంలో సంప్రదాయ కీర్తనలు ఎన్నో పాడాను. చిత్తరంజన్గారితో కలిసి పాడటం గొప్ప అనుభవం. ఆయన ఎంతో ఓర్పుతో నేర్పించేవారు. రేడియోలోనే కాకుండా బయట కూడా ఎన్నో కచ్చేరీలు చేశాను. అందులో సోలో కచ్చేరీలూ చాలా ఉన్నాయి. ఇప్పటికీ పాడుతూనే ఉంటాను. పాటలు మననం చేసుకోవడమే నాకు బలం. రేడియో సంగీతం కృష్ణశాస్త్రిగారు రాసిన ‘శర్మిష్ఠ’ లాంటి ఎన్నో రూపకాల్లో పాడాను. నా పాటలను ప్రశంసిస్తూ స్టేషన్‌కు ఎన్నో ఉత్తరాలు వచ్చేవి. కేవలం శాస్త్రీయ సంగీతమే కాకుండా వింజమూరి సీతాదేవిగారి సారథ్యంలో జానపద గీతాలూ పాడాను. ఎన్నో దేశభక్తి గీతాలూ ఆలపించాను. ఇక స్త్రీల కార్యక్రమంలో నేను, మీరు (శారదా శ్రీనివాసన్) కలిసి ఎన్నో పాటలు పాడాం. కృష్ణశాస్త్రి, రజనీకాంతరావుగారు కలిసి రాసిన ‘నీ ఇంటికీ పిలువకూ, నన్ను లోనికి రమ్మనకూ..’ అనే పాట నాకెంతో పేరు సంపాదించి పెట్టింది. అలాగే వారానికో కొత్త మంగళహారతి పాటను శ్రోతలకు పరిచయం చేసేదాన్ని. దాంతో నన్ను చాలామంది ‘మంగళహారతి సావిత్రి’ అనే పిలిచేవాళ్లు. నాటకాల్లోనూ ప్రవేశం.. పాటలు మాత్రమే కాకుండా అడపా దడపా రేడియో నాటకాల్లోనూ చేశాను. రేడియో అక్కయ్యగారు, తురగా జానకీరాణిగారు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. మహిళా సమాజం, రంగవల్లిలో చేశాను. మహిళా సమాజంలో ప్రతి బుధవారం ‘పెద్దక్క పెత్తనాలు’లో నేను, శ్యామలాదేవిగారు చేసేవాళ్లం. అందులో నేను వారమంతా అన్ని ఊళ్లూ తిరిగినట్టు ఆ వారం రాష్ట్రంలో జరిగిన ఉత్సవాలు, ఉరుసులు, వార్తలు, ముఖ్యమైన సంఘటనల గురించి చెప్పేదాన్ని. అలా పెద్దక్కగా నన్ను శ్రోతలు గుర్తుపెట్టుకున్నారు. ప్రస్తుతం గుళ్లలో కచ్చేరీలూ ఇస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నాను. ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల ఫొటోలు: ఠాకూర్ రవీంద్రభారతి శంకుస్థాపన రోజు... హైదరాబాద్‌లో ఇప్పుడున్న కట్టడాల్లో చాలా వరకు మా పాటలతోనే ప్రారంభమయ్యాయి. రవీంద్రభారతి శంకుస్థాపన రోజు మేం పాటలు పాడాం. అలా ఎన్నో ప్రభుత్వ భవనాలు, పరిశ్రమలు ప్రారంభించే ముందు మా సంగీతం తప్పనిసరిగా ఉండేది. భారత తొలి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్ మొదలుకొని జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటి రాజకీయ నాయకులు నగరానికి వచ్చిన ప్రతిసారీ వారి ఎదుట మేము పాటలు పాడేవాళ్లం.