అవార్డ్ విజేత, చిత్రకారుడు దీనా సో ఓతేహ్ నీడ– కాంతిలో విలక్షణతను చూపడంలో మాస్టర్. యునైటెడ్ స్టేట్స్‌లో ఉండే ఈ కళాకారుడి చిత్రాలు మిగతా వాటితో పోల్చితే చాలా భిన్నంగా ఉంటాయి. చీకటి నుండి వెలువడే ప్రకాశవంతమైన చిత్రాలను మన కళ్లకు కడతాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటాన్ని ‘చిత్రం’గా చూపుతాడు. గురువెవ్వరూ లేకుండానే తన ఊహల్లో నుండి పుట్టుకువచ్చిన కళ గురించి వివరిస్తుంటే వినేవారు చాలా అబ్బురంగా చూస్తారు.
‘‘మా అమ్మ చిన్నప్పటి నుండి నాలో కళాత్మక అభిరుచిని గుర్తించింది. దానిని పెంపొందించడానికి ప్రాధాన్యతను ఇచ్చింది. నేను మంచి కళాకారుడిగా మారుతానని ముందే అనుకున్నాను. కళను వృత్తిగా కొనసాగించాలనే ఆలోచన చాలా ఆలస్యంగా వచ్చింది. నాకు 12 ఏళ్ల వయసులో నా కుటుంబం యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చింది. నాటి పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. మా అమ్మనాన్నలు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో మాకు సంబంధించిన న్యాయపరమైన పత్రాలన్నీ నాన్న తనతో తీసుకెళ్లిపోయారు. సరైన పత్రాలు లేకపోవడంతో 18 ఏళ్ల వయసులో చదవుకు స్కాలర్‌షిప్‌కు అర్హత కోల్పోయాను. దీంతో ఎనిమిదేళ్లు వెయిటర్‌గా పనిచేశాను. అప్పుడు నా కెరీర్ వెయిటర్ అనే అనుకున్నాను.
అనిశ్చితి నుంచి నైపుణ్యాలు
మొదట నేను ఫైన్ ఆర్ట్ ఆర్టిస్ట్‌ను కాదు. సరైన పత్రాలు లేక΄ోవడం వల్ల వలసదారునిగా ఎనిమిదేళ్లు అనిశ్చితిని ఎదుర్కొన్నాను. ఇష్టపడే పని చేస్తున్నప్పుడే స్థిరత్వం లభించడం ప్రారంభమైంది. నాకు నేను స్వయంగా ఇలస్ట్రేషన్స్ వేసేవాణ్ణి. ఈ సాధన ద్వారా ఇలస్ట్రేషన్ నా నైపుణ్యాలు పెరిగాయి. అది ఎంతగా అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్‌లో డిగ్రీ సాధించాను. మాస్టర్స్ ప్రోగ్రామ్‌ద్వారా స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్‌లో మరింత అధ్యయనం సాధ్యమైంది. అప్పుడే ఇలస్ట్రేషన్ నాకు సరిగ్గా సరి΄ోతుందనిపించింది. కథలు చెప్పడం, నేర్చుకోవడం, సమస్యను పరిష్కరించడం, సృష్టించడం... ఇలా ప్రతీది నా మనో వికాసానికి, వృద్ధికి ఇలస్ట్రేషన్ ఆర్ట్ కొత్త తలుపులు తెరిచింది. చివరకు నాది అయిన మార్గంలో ఉన్నట్టు అనిపించింది. ఇదంతా సాధ్యమైంది మా అమ్మ ద్వారా. ఆమే నన్ను నేను గర్వపడేలా చేసింది.
నిశ్శబ్దం నుంచి...
పరధ్యానాన్ని నివారించడానికి సాధారణంగా స్కెచ్ వేయడం ప్రారంభిస్తాను. కొన్నిసార్లు తెల్లవారుజామున 4–5 గంటల సమయాన్ని ఎంచుకుంటాను. ఆ నిశ్శబ్ద సమయం, ప్రపంచం మేల్కొనే ముందు నేను చాలా సృజనాత్మకంగా ఉంటాను. పరధ్యానాల నుండి విముక్తి పొందుతాను. ఏదైనా ‘రంగు’లోనే ఆలోచిస్తాను. ఎందుకంటే అది ఏదో ఒక చిన్న సృష్టికి కారణం అవుతుంది. అక్కడ నుంచి నా స్కెచ్‌లకు విస్తృతంగా పని దొరుకుతుంది. ఆరిస్ట్ మార్షల్ అరిస్కాన్ ఎప్పుడూ ఒక మాట చెబుతాడు ‘మీకు తెలిసిన వాటిని గీయండి’ అని. ఆ పదాన్ని అర్ధం చేసుకోవడానికి నాకు సమయం పట్టింది. కానీ, కాలక్రమేణా అది స్పష్టమైంది.
కాంతి–చీకటి మధ్య అంతర్గత పోరాటం నాకు తెలిసింది. నేను నా జీవితంలో చాలా చీకటి కాలాలను ఎదుర్కొన్నాను. పోరాటాలకు మించిన అందం వాటిలోనే ఉందని నా ప్రగాఢ నమ్మకం. ఒక అంశంపై తగినంత అవగాహన లేకుండా పని మొదలుపెడితే ఆందోళన కలుగుతుంది. అయితే, ఆ క్షణంలో నేను నా అహం, ఊహాత్మక తీర్పులను, ఫెయిల్ అవుతానేమో అనే భయాలను వదిలేస్తూ ఆర్ట్‌లోకి ప్రయాణిస్తాను’’ అని వివరిస్తాడు ఈ చిత్రకారుడు
Comments
Please login to add a commentAdd a comment