అపురూప స్వరాల అన్వేషి
‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో ‘ఎంటర్‌టైన్‌మెంట్’ విభాగంలో చోటు
దిల్లీకి చెందిన పవిత్రాచారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... మల్టీ–టాలెంటెడ్ ఆర్టిస్ట్. ప్లేబ్యాక్ సింగర్, సాంగ్ రైటర్, వోకలిస్ట్, కంపోజర్‌గా రాణిస్తోంది. ‘కళ కళ కోసం కాదు. సమాజం కోసం’ అని నమ్మిన పవిత్ర తన ‘కళ’తో వివిధ స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. తాజాగా ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో ‘ఎంటర్‌టైన్‌మెంట్’ విభాగంలో చోటు సాధించింది... దశాబ్దకాలం పాటు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఏఆర్ రెహమాన్‌లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేసింది. ప్రతి దిగ్గజం నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందుంటుంది పవిత్ర. ‘శూన్యం నుంచి కూడా రెహమాన్ సంగీతం సృష్టించగలరు’ అంటుంది. 65వ గ్రామీ అవార్డ్‌లలో పవిత్ర పాట ‘దువా’ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీకి నామినేట్ అయింది. హెచ్‌సీఎల్, ఇండిగో ఎయిర్‌లైన్స్‌లాంటి ప్రముఖ కంపెనీల యాడ్స్‌లో నటించింది. ‘అనిరుథ్ వర్మ కలెక్టివ్’లో భాగంగా యూఎస్‌లో ఎన్నో ప్రాంతాలలో తన సంగీతాన్ని వినిపించింది. ‘చిత్రహార్ లైవ్’ టైటిల్‌తో చేసిన ఇన్‌స్టాగ్రామ్ సిరీస్‌కు మంచి పేరు వచ్చింది, ‘ఈ ప్రాజెక్ట్ ద్వారా సంగీతానికి సంబంధించిన నాస్టాల్జియాను హైలైట్ చేశాను. వ్యక్తిగతంగా, ఆన్‌లైన్‌లో ఈ ప్రాజెక్ట్‌కు ఎంతో స్పందన వచ్చింది’ అంటుంది పవిత్ర.
గత సంవత్సరం కొన్ని అద్భుతమైన వోటీటీ ప్రాజెక్ట్‌లలో భాగమైన పవిత్ర ఆ ప్రాజెక్ట్‌ల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడమే కాదు, తన ప్రతిభతో వాటికి కొత్తదనాన్ని తెచ్చింది. ‘దిల్లీ అమ్మాయి’గా పాపులర్ అయినప్పటికీ పవిత్ర మూలాలు చెన్నైలో ఉన్నాయి. తన సంగీతయాత్రలో భాగంగా దిల్లీ, చెన్నై, ముంబై నగరాల మధ్య తిరుగుతుంటుంది. ఇప్పుడు చెన్నైలో ఎక్కువ రోజులు ఉండడానికి ప్రాధాన్యత ఇస్తోంది. హిందీ పాటలే కాదు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలాంటి భాషల్లోనూ పాడుతోంది. మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో భాగం కావడమే కాదు వాటిపై తనదైన ముద్ర వేయడంలో ప్రత్యేకత సాధించింది పవిత్ర.
‘ఒకేదగ్గర ఉండిపోవడం కంటే నిరంతర అన్వేషణతో కొత్త దారులు వెదుక్కోవడం నాకు ఇష్టం. ప్రతి దారిలో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లడం అంటే ఇష్టం. కొత్త ఆసక్తి అన్వేషణకు కారణం అవుతుంది. ఆ అన్వేషణలో భాగంగా కంఫర్ట్‌జోన్ నుంచి బయటికి వచ్చి కొత్త ప్రపంచంలోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది. మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో గుర్తింపు తెచ్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది పవిత్ర. సంగీతం, సామాజికం అనేవి రెండు వేరు వేరు ప్రపంచాలని ఎప్పుడూ అనుకోలేదు పవిత్ర. ఆర్ట్స్–బేస్‌డ్ థెరపిస్ట్‌గా ఎంతోమందికి సాంత్వన చేకూర్చింది. వారి నడకకు కొత్త బలాన్ని ఇచ్చింది.
‘లైఫ్‌స్కిల్స్ ఎడ్యుకేషన్ విత్ మ్యూజిక్’ కాన్సెప్ట్‌తో వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల కోసం సంగీత కచేరీల ద్వారా నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పాటే కాదు పరిశోధన కూడా.. పవిత్రకు సంగీతప్రపంచం అంటే ఎంత ఇష్టమో, సంగీత ధోరణులకు సంబంధించిన పరిశోధన అంటే కూడా అంతే ఇష్టం. ప్రఖ్యాత గాయని శుభాముద్గల్ దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్న పవిత్ర ‘ఖాయాల్’పై ఆసక్తి పెంచుకోంది. ఈ సంగీత ప్రపంచంలోని స్త్రీవాద ధోరణుల గురించి లోతైన పరిశోధన చేసింది.
భారత ఉపఖండంలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రధాన రూపం... ఖాయాల్. అరబిక్ నుంచి వచ్చిన ఈ మాటకు అర్థం... ఊహ. ‘హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్యార్థిగా ఖాయాల్ సంగీతంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. పరిశోధన ఫలితంగా కొత్త విషయాల పట్ల అవగాహన ఒక కోణం అయితే నా గానాన్ని స్వీయ విశ్లేషణ చేసుకోవడం మరో కోణం’ అంటున్న పవిత్ర ఖాయాల్ సంగీతానికి సంబంధించి రిసోర్స్ బ్యాంక్‌ను తయారు చేసింది. దీనికి ముందు ఖాయాల్ రచనలు, వాటి మూలం, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అధ్యయనం చేసింది. ఎంతోమంది నిపుణులతో మాట్లాడింది.
Comments
Please login to add a commentAdd a comment