నేడు వరల్డ్ మ్యూజిక్ డే
తొలి ఆల్బమ్‌తోనే వేలాది అభిమానులను సంపాదించుకున్నాడు దిల్లీకి చెందిన అర్పణ్ కుమార్ చందెల్. మల్టీపుల్ సూపర్–హిట్ ఆల్బమ్‌లతో అభిమానుల చేత ‘కింగ్’ అనిపించుకున్నాడు. స్వరరచనలోనే కాదు పాటల రచనలోనూ భేష్ అనిపించుకున్నాడు. చిన్న వయసులోనే పెద్ద మ్యూజిక్ కంపెనీలతో కలిసి పని చేసిన ‘కింగ్’ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో చోటు సంపాదించాడు....
పాపులర్ ర్యాప్ రియాలిటీ షో ‘హసల్’తో తొలి గుర్తింపు పొందాడు అర్పణ్ కుమార్ చందెల్. ‘టాప్ 5’లో ఒకరిగా చోటు సంపాదించాడు. ఆ తరువాత ‘హసల్ 2.వో’లో స్క్వాడ్ బాస్‌గా మరింత పేరు తెచ్చుకున్నాడు.
‘వివిధ రంగాలలో విజేతలుగా నిలిచిన వ్యక్తుల గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం. వారి గురించి చదివినప్పుడల్లా ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. ఎప్పటికప్పడు కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే నాకు ఇష్టం’ అంటున్న అర్పణ్ దిల్లీలోని సాధారణ కుటుంబనేపథ్యం నుంచి వచ్చాడు.
మొదట్లో ఫుట్‌బాల్ ఆటను బాగా ఆడేవాడు. ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. అయితే ‘ఆట’ నుంచి ‘పాట’ వైపు అతని మనసు మళ్లింది. సంగీతంపై ఆసక్తి అంతకంతకూ పెరగడం మొదలైంది. మ్యూజిక్ పట్ల తన ఆసక్తి, ప్రయోగాలకు యూట్యూబ్ వేదిక అయింది. పాటలు రాయడం మొదలు పెట్టాడు.
‘చిన్నప్పటి నుంచి నాకు రకరకాల సందేహాలు ఉండేవి. ఆ సందేహాలు, నాలోని ఊహాలతో పాటలు రాయడం మొదలుపెట్టాను’ అంటాడు అర్పణ్. ‘ది కార్నివాల్’ ‘షాంపైన్ టాక్’ ‘న్యూ లైఫ్’లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లతో సంగీత ప్రపంచంలో సందడి చేసి ‘కింగ్’గా పేరు తెచ్చుకున్నాడు అర్పణ్. ‘మేరీ జాన్’ పాట బిల్‌బోర్డ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
ప్రేమ, భావోద్వేగాలు, జ్ఞాపకాలతో కూడిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శ్రోతలను ఆకట్టుకుంది. ‘ప్రతి జెనరేషన్ కనెక్ట్ అయ్యేలా మేరీ జాన్ పాటను రూపొందించాను. ఈ పాటలోని ఒక వాక్యం....నీ నీడలా ఎప్పుడూ నీతో ఉంటాను అనేది యువతరానికి బాగా నచ్చింది’ అంటాడు అర్పణ్.
చార్ట్‌బస్టర్ ‘తూ ఆఖే దేఖ్‌లే’ తనను సంగీతకారుడిగా మరో మెట్టు పైకి ఎక్కించింది. ‘నేను చేసిన మంచి పని ఏమిటంటే నాలోని భావాలను కాగితంపై పెట్టడం. వాటికి బాణీ కట్టడం. నాకు తోచినది నేను రాస్తాను. అది శ్రోతలకు నచ్చింది. అందుకే వారు నన్ను కింగ్ అనిపిలుస్తున్నారు. తమ భావాలకు ప్రతినిధిగా చూస్తున్నారు’ అంటాడు అర్పణ్.
అర్పణ్ సక్సెస్ మంత్రా ఏమిటి? ఆయన మాటల్లోనే... ‘ఓపికగా ఎలా ఉండాలో, ఇతరులతో ఎలా వ్యవహరించాలో....ఇలా ఎన్నో విషయాలను నా ప్రయాణంలో నేర్చుకున్నాను. నేర్చుకున్నది ఏదీ వృథా పోదు’ నాన్–బాలీవుడ్ హిప్–హప్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అర్పణ్ కుమార్ చందెల్ ఇప్పుడు బాలీవుడ్ పాటలతోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.
సింపుల్‌గా స్పీడ్‌గా...
‘సింపుల్‌గా ఉండాలి, అందరూ కనెక్ట్ అయ్యేలా ఉండాలి’ అనుకొని పాట ప్రయాణం మొదలుపెడతాను. నా పాటలు శ్రోతలను ఆకట్టుకోవడానికి ఇదొక కారణం. ఈ పాట ఎవరి గురించో అనుకోవడం కంటే, ఈ పాట నా గురించే అనుకోవడంలో విజయం ఆధారపడి ఉంటుంది. పాట అనేది గాలిలో నుంచి పుట్టదు. దాని వెనుక ఏదో ఒక ప్రేరణ ఉంటుంది. నా పాటల నుంచి ఇతరులు స్ఫూర్తి పొందితే అంత కంటే కావల్సింది ఏముంది! – అర్పణ్ కుమార్ చందెల్
Comments
Please login to add a commentAdd a comment