అప్పుడెప్పుడో అనబడే రోజుల్లో.. బాగ్ లింగం పల్లి వీధుల్లో ఎడాపెడా తిరిగే ఆర్టిస్ట్ చంద్ర గారి వెంట ఆంజనేయులు అనే నీడ పడేది. ఆ ఇరుకు చీకటి నీడల్ని తడుముకుంటూ నాలుగడుగులు వేస్తే తగిలేదే బేచులర్ కొంప ఆఫ్ అంజనేయులు అండ్ ఫ్రెండ్స్. ఆ ఇరుకు మురికింట్లో మంచం పైనా, పరుపు కింద అట్టలు గట్టుకు పొయిన అట్టల మధ్య ఉండేది ఆంజనేయుల్స్ కలక్షన్ ఆఫ్ ఆర్ట్. వందలాది దేశీయ విదేశీయ బొమ్మల కత్తిరింపు కలెక్షనది. అవన్నీ అలా తలకిందుంచుకుని నిద్దరోతే కలలోనైనా బొమ్మలొస్తాయేమోనన్నది హనుమంతుల వారి థీరి.
ఆంజనేయులుగారి రూముకి వెళ్ళినప్పుడల్లా ఆ బొమ్మలని తీసి చూస్తూ ఉండటం నాకో ముచ్చట. అంతటి ఆ బొమ్మల కలెక్షన్ లో ఒకసారి నాక్కనబడిందో నలుపు తెలుపుల ఇంద్రచాపం. దూరాన మైసూర్ మహరాజవారి ప్యాలెస్, దసరా సంరంభం, ఏనుగులు అంబారీలతో సహా బారులు తీరాయి. కొమ్ములూదుతున్న నల్లని శరీరాలు, చత్రాలు పుచ్చుకుని రాజ సేవకులు, దారికిరువైపులా జనం.. 1970-80 మధ్యలో అచ్చయిన పత్రికా ప్రకటన తాలూకు బొమ్మ అది. బహుశా నేనపుడే కళ్ళు తెరవడం, నడక, ప్రాకటం లాంటి వయసులోవుంటా. బొమ్మలాగే కింది సంతకం కూడా చక్కగా వుంది రవి పరంజపే అని.
ఆనాటి నుండి మొదలైంది రవి పరంజపే గురించిన అన్వేషణ, నాకు తెలిసిన వారికెవరికి తెలీని పేరిది. ఎక్కడి వారో, ఇప్పుడెక్కడ వున్నారో చేప్పేవారే లేరు. కాలం గడుస్తూ వుంది, గూగ్లింగ్ సాగుతొంది, "నహీ ఉదాస్ నహీ" హేమంత్ కుమార్ పాట వినబడుతూనే వుంది. కృషో, దీక్షో, పట్టుదలో, అదృష్టమో 1098/A రుతిక, మోడల్ కాలని, పూనే. ఇది పరంజపే పతా, ఫొన్ నంబర్‌తో సహ దొరికింది,.ఫోన్ చేసి ఆయనతో మాట్లాడా, ఎక్జైంటింగా వుంది ఆయన్ని వింటుంటే, దయగల గొంతు, ప్రేమగా మాట్లాడారు, పూనే రమ్మన్నారు, నా బొమ్మలు పట్టుకు రమ్మన్నారు. ఆ దినం నుండి రెండు నెలలపాటు చాలా మంది స్థానిక చిత్రకారులతో మాట్లాడా. వారందరికీ ఆయన బొమ్మల లింక్ పంపించా. ఆయన వర్ణ విన్యాసాలు వివరించా. అందరూ నాకు మళ్ళేనే థ్రిల్లయ్యారనిపించింది. చివరకు ట్రైను ఎక్కేరోజు నన్ను నేనే మోసుకుని బయలుదేరా.. చలో మహారాష్ట్ర్, జై మహారాష్ట్ర్.
ఉదయం 6 గంటలకు దిగి చూస్తే రోమింగ్ లేక ఫోన్ డెడ్, మొబైళ్ల పుణ్యమాని వీధులో పబ్లిక్ బూతులు, ఎస్టీడి షాపులు లేవు, ఒకే ఒక్క కాల్ ప్లీజని సెల్లున్న వాడినెవడినైనా అడుక్కుంటే అలీబాబా 27వ దొంగని చూసినట్టు నా వైపు అదో లుక్కు. ఇదంతా వ్రాయదగ్గ మరో చావు. అఫ్జల్ గంజ్ టూ లంగర్ హౌజ్ వయా తార్నాక సూత్రం తెలిసిన ఆటో వాడి ఆటోలో 9:30 కు మొడల్ కాలనీలో ఆడుగు పెట్టా. ఇంటి నెంబర్ దొరక బుచ్చుకొడానికి చాతకాల(మధ్యలో వొ యధార్థ జోక్ బాపు గారిని కలవడానికి మద్రాస్ వెల్లినపుడు ఆయనకు ఫొన్ చేస్తే ఆయనన్నారు "ఫలానా కాలనీకి వచ్చి ఫలనా చోట ఆగి ఫలానా బాపు ఇల్లెక్కడని అడగకండి! ఎవరికీ తెలియదు, మలయాళి సూపర్ స్టార్ ముమ్ముట్టి ఇల్లు అడగండి ఎవరైనా చెబుతారు, ఆయన ఇంటి ఎదురిల్లే మాది, చాలా ఈజీ ". సిగ్గులేకుండా మేమలాగే బాపుగారి చిరునామా కనుక్కున్నాం కూడా.)
పూనా లెఖ్ఖ కాస్త తేడాగా వుంది పరంజపే ఇల్లు అడిగీ అడగంగానే అరకిలొమీటర్ దూరం నుండే జనాలు సినిమా థియేటర్ అడ్రస్ చెప్పినంత ఈజీగా చేప్పేశారు .పరంజపేది పెద్ద బంగళా. భక్తిగా, ప్రాణంగా చేసిన బొమ్మల పని సంపాదించి పెట్టిన ఇల్లది. ఇంటర్నెట్లో చూసి వూహించుకున్న బొమ్మలు వేరు, ఇక్కడి వాస్తవం వేరు. ఇంటి గోడలనిండా గోడలంత పెద్ద పెద్ద పెయింటింగులు, ఇంటర్నెట్లో చూసి ఇది పెన్సిల్ పనని, ఇది సాఫ్ట్ పేస్టలతో వేసిందని ఊహించిన బొమ్మలన్ని అయన ఆయిల్స్ లో, ఆక్రిలిక్కుల్లో చిత్రించినవి! జిగేలని గులాబీలో మెరిసిపోతూ నీలంలోకి జరిగిన అ వర్ణ సమ్మేళనం ఆయిల్లొ ఎట్లా జరిగిందో, అసలెట్లా జరుగుతుందో అంతు చిక్కని రహస్యం ఆ పెయింటింగుల నిండా ఆవరించుకుని వుంది. బొమ్మలమీంచి పొడుగ్గా సాగిన గీతలు బొమ్మ వెనుక డిజైన్ లోకి అల్లుకుపోవడం కేవలం రంగుపెన్సిల్కే కదా సాధ్యం అనే సంభ్రమానికి ఫుల్ స్టాపిస్తూ ఆయన ఆ గీతల్ని బ్రష్ పుచ్చుకుని కేన్వాస్ మీదికి లాగాడనేదే నిజమంత నిజం.
తను కథలకు, అడ్వర్టైజ్మెంట్లకు వేసిన నలుపు తెలుపు బొమ్మలు!! రోట్రింగ్ పెన్ 90 డిగ్రీల కోణంలో నిలపెట్టి లాగితే రావాల్సిన లైనది, అటువంటి లైన్ ను పాయింట్ బ్రష్ తీసుకుని మందం చెడకుండా గీశాడాయన.(తరువాత ఆ బొమ్మలన్నింటినీ కుంచె మాంత్రికుడు మోహన్ గారికి చూపి బ్రష్ తో గీశాట్ట! అంటే నిస్సహాయంగా నవ్వడాయన) బొమ్మల స్టడీ అంటూ వీధులెంట తిరుగుతూ ఆయిల్ పేస్టల్స్ తో చేసిన స్కెచ్లు మహా అరాచకం, ఆయన చేతిలోని మైనం వీధులు గట్టిన వైనం చూడాల్సిందే (అద్రుష్టవశాత్తు ఆయన బొమ్మలన్ని పుస్తకాల రూపంలో వచ్చాయి) ఆయన వేసిన ప్రకృతి చిత్రాలు, కథల బొమ్మలు, అడ్వర్టైజ్మెంట్ డిజైన్లు, పొర్ట్రైట్లు, పెన్సిల్ స్కెచ్లు ఇదంతా ఒక ఎత్తైతే, ఆర్చిటెక్చర్ రంగంలో ఆయన గీసిన పర్ఫెక్టివ్ బొమ్మలు ఇంకా ఎత్తు. అవి వేయడం వెనుక కృషి, కష్టం గురించి చెప్పుకుంటూ పొతుంటే వినడానికే కష్టంగా వుంది, వేయడానికి ఆయన ఇంకెంత కష్టపడ్డారో చూస్తే తప్ప తెలీదు.
ఒక శైలి కాదు, ఒక తరహాలో నిలవలేదు, ఇదే ఉపరితలమని భీష్మించుక్కూచ్చోలేదు, బొమ్మ రహస్యం తేల్చడానికి రంగు అంతు చూడటానికి ఈ చిత్రకారుడు చేసిన కృషి మాటలలో చెప్పలేనిది, వాక్యాలలో వ్రాయలేనిది. మాటల మధ్యలో, బొమ్మల మధ్యలో మీకు తెలుగు చిత్రకారుల గురించి తెలిసిందెంత అని అడిగా, ఆయనకేం తెలీదు, ఎవరి పేరూ వినలేదు (మనమేం తక్కువ గొప్పవాళ్ళమా మనమూ రవి పరంజపే పేరు వినలేదుగా, దీనానాధ్ దలాల్ గురించి తెలుసుకోలేదుగా). కళ్ళు మూసుకుని బాపు తదితర పెద్దల పేర్లు వల్లించా, చంకలోని సంచినుంచి బాపు కొన్ని తులనాత్మక బొమ్మలు లాంటి పుస్తకం చేతిలో పెట్టా, మాట్లాడక పుస్తకం అంతా తిరగేశారు, దయచేసి నాకు ఈ పుస్తకం ఇవ్వగలవా అని తీసుకున్నారు, మళ్ళీ వాటినొకమారు సుతారంగా తిరగేసి, ఏ బాపు సాబ్ మహాన్ హై బహుత్ కాం కియా ఇనోనే అన్నారు. మనకా సంగతి తెలుసు కాబట్టే ఏ రాష్ట్ర మేగినా ఎందు కాలిడినా బాపు గారే మన ట్రంప్ కార్డ్.
బాక్ టూ పరంజపే.. ఆయనది ఒక బొమ్మ చూసినా, వంద చూసినా వినిపించేది సంగీతమే అది రేఖా సంగీతం. ఈయన వర్ణ జంత్రగాడు. ఈయనకు సంగీతమంటే ప్రాణం. భీం సేన్ జోషి నా మానసిక సాంగీతిక్ గురువు. 1951 నుండి అయన్ని ఆరాధిస్తున్నాను, ఆయన గొంతునుంచి ఏదైతే నేను విన్నానో దాన్నే నా బొమ్మల్లో వినిపించాలని నా ప్రయత్నం అంటారు పరంజపే. దాన్ని నూటికి నూరుపాల్లు నిరూపించారు కూడా. ఒక చిత్రకారునిగా పరంజపేని చూడాలనుకున్న నాకు ఆయన అంతకు మించి ఎంతో వినిపించారు. జీవితం పట్ల ఆయనకున్న దృష్టి గొప్పది. మానవతం పట్ల విశ్వాసం ఆశాజనకమైనది. దేశ విభజనకు పూర్వం నుంచి ఈనాటి దాక మనుషుల, దేశాల మధ్య ఏర్పడిన గీతలు, వాటి వెనుక స్వార్ధాలు, జిన్నాను కాంగ్రేస్ నుంచి తప్పిచడానికి గాంధీజీ మద్దతించిన ఖిలాఫత్ కుట్ర, రాజకీయాల దగ్గర్నుంచి కేవలం స్థల, కాల సాపేక్షాలైనా మతాల వరకు నిరశించారు.
ఆయన భావనలో ధర్మం గొప్పది. కులాల్ని, మతాన్ని పట్టుకు అదే ధర్మం అనుకుంటున్నారు. అసలైన ధర్మాన్ని తెలుసుకోవడానికి సౌందర్య భక్తి ఒక్కటే మార్గమని, ఆ దృశ్య సౌందర్యం, శ్రావ్య సౌందర్యమే తన ధర్మమన్నారు.. ఆఖరుగా సెలవు తీసుకుని వెనక్కు తిరిగి గుమ్మం దాటుతున్న నన్ను పిలిచారు.. ఏమని వెనక్కి తిరిగి చూస్తే చేతులు జోడించి "అన్వర్ అప్కే బాపు సాబ్కో మేరా ప్రణామ్ బోలో" అన్నారు.
1935 కర్ణాటకలోని బెల్గాంలో పుట్టిన రవి పరంజపె.. కేబీ కులకర్ణి గారి శిష్యరికంలో బొమ్మల్లో ఓనమాలు దిద్దుకున్నారు, బ్రతుకు తెరువుగా బొమ్మల్ని ఎంచుకుని బొంబాయి చేరిన రవి పరంజపే శాశ్విత నివాసం పూనె అయ్యింది. బొమ్మలకు సంభందించిన ప్రతి పనిలో నైపుణ్యాన్ని సాధించారాయన. లెక్కకు మించిన దేశ విదేశ పురస్కారాలు ఆయన్ని వరించాయి. 2008లో ప్రతిష్టాత్మకమైన భైరు రతన్ దమని సాహిత్య పురస్కారం ఆయన ఆత్మ కథకు లభించింది. చిత్రకళకు సంభంధించి ఈయన ఇప్పటికీ అర డజనుకు పైగా పుస్తకాలు వెలువరించారు. చిత్రకారులు, చిత్రకళపై ఆసక్తి వున్నవారు తప్పక చూడదగ్గ, చదవదగ్గ, నేర్చుకోదగ్గ సంపద ఇందులో వుంది.
2022 జూన్ 11వ తేదీన గొప్ప చిత్రకారులు రవి పరంజపే కళ్ళు మూసారు. ఆయన స్ఫూర్తి దీపాన్ని వారి సతీమణి పట్టుకు నిలబడ్డారు. ఆ దీప కాంతిలో దారి పోల్చుకుంటూ నేటికీ చిత్రకారులు అనేకులు ఆయన ఇంటికి వస్తారు. ఆయన బొమ్మలని చూస్తారు. ఉత్తేజితులవుతారు. వర్క్ షాపులు నిర్వహించుకుంటారు. బొమ్మల గురించి కథలు కబుర్లు మాటాడుకుంటారు. బొమ్మలు వేస్తారు. బొమ్మలని శ్వాసిస్తారు. రవి పరంజపే గారు తన జీవితకాలంలో కల్చరల్ ఐకన్. ఆయన మరణానంతరం ఆయన ఇల్లు ఒక సాంస్కృతిక కేంద్రం.
రష్యన్ చిత్రకారుడు ఇల్యారెపిన్ గురించి మన తెలుగు ఆర్టిస్ట్ మోహన్ గారు ఇలా అన్నారు. "ఇల్యా రెపిన్ చిన్న వయసులోనే 'సక్సెస్' రుచి చూశాడు. దేశంలోనూ, బయటా గొప్ప విఖ్యాతి. ఎంత ఖ్యాతి అంటే జారిస్టు సెన్సార్ మందకు ఆయన బొమ్మలు మింగుడు పడకపోయినా ఏమీ చేయలేక పోయారు. 20వ శతాబ్దారంభానికి ఆయన పేరు ప్రఖ్యాతులు అత్యున్నత శిఖరాలకు చేరాయి. అయినా సరే 1900వ సంవత్సరంలో ఆయన అకాడమీనీ, భవంతులనీ, ప్రశంసలనీ, సంపదలనీ వదిలి పీటర్స్బర్కు దూరంగా చిన్న గ్రామానికి వెళ్ళి అక్కడే కుటీరంలో ఉన్నాడు.
ఆయన వ్యక్తిత్వం అయస్కాంతం లాంటిది. మాగ్జిమ్ గోర్కీ, అలెగ్జాండర్ కుప్రిన్, పావెల్ బునిన్ ఆ కుటీరానికి వచ్చేవారు. మయకోవ్స్కీ, సెర్గీ ఎసెనిన్ లాంటి ప్రముఖులంతా ఈ కుటీరంలో రెపిన్తో గడిపేవారు. లియో టాల్స్టాయ్ ఆయనకు ఆప్తమిత్రుడు. రష్యాలోని ప్రముఖ శాస్త్రజ్ఞులూ కళాకారులూ ఇక్కడికొచ్చి ప్రసంగాలిచ్చేవారు. ఈ కుటీరంపై పోలీసు నిఘా ఉండేది. వేగుల సమాచారం ఎప్పటికప్పుడు జార్కు చేరుతుండేది. ఆ కుటీరం ఇపుడు రష్యాలో పుణ్యతీర్థం లాంటిది. ఏటా లక్షమంది జనం అక్కడికెళ్లి ఇది రెపిన్ ఇల్లు, ఇది రెపిన్ తోట అని భక్తితో చూసి వస్తారు. గురజాడ ఇల్లు చూడడానికి మనమిలా విజయ నగరం వెళ్తామా"?
– అన్వర్.
Comments
Please login to add a commentAdd a comment