కళ సామాజిక ప్రయోజనం గురించి చెప్పుకోవడానికి బోలెడు మ్యాటర్ ఉంది. ‘వ్యక్తిగతం’ మాట ఏమిటి? అనే విషయానికి వస్తే...‘కళ అద్భుత ఔషధం’ అంటున్నారు అమెరికాలోని బాల్టిమోర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్వేతారావు గార్గ్.
‘ఒత్తిడిని చిత్తు చేయడానికి, ఉత్సాహాన్ని శక్తిగా చేసుకోవడానికి కళ బలమైన ఔషధంలా ఉపయోగ పడుతుంది’ అంటున్న శ్వేతారావు గార్గ్ బోధకురాలు, రచయిత్రి, ఆర్టిస్ట్. శ్వేతారావు గార్గ్ కాలేజీ రోజుల్లోకి వెళితే...‘ఒత్తిడి నుంచి బయటపడాలి’
‘మనసుకు కాస్త ఉత్సాహం కావాలి’ అనుకున్నప్పుడల్లా ఆమె చేసే పని... కలాన్ని చేతిలోకి తీసుకొని తన మనసులోని భావాలను కాగితంపై పెట్టడం. లేదా కుంచె తీసుకొని రంగు రంగుల చిత్రాలు వేయడం. ఈ ఉపశమనం, ఉత్సాహాన్ని ఇచ్చే పని కళాప్రపంచంలో తనకు చోటు కల్పిస్తుందని శ్వేత ఊహించి ఉండదు.
మొదట్లో తాను వేసిన చిత్రాలను ఇతరులకు చూపించేది కాదు. వాటిని రహస్యంగా దాచేది. వివిధ కారణాల వల్ల రచనలు చేయడానికి, బొమ్మలు వేయడానికి దూరమైన శ్వేత మళ్లీ కళాప్రపంచంలోకి వచ్చింది. అప్పుడు తనకు ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. బొమ్మలు వేయడమే కాదు నవలలు రాసే ప్రయత్నం కూడా మొదలుపెట్టింది.
రచనలు చేస్తున్న కొద్దీ, బొమ్మలు వేస్తున్న కొద్దీ తనమీద తనకు ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘వీటిని రహస్యంగా దాచుకోవడం ఎందుకు! ప్రపంచానికి చూపించాలి’ అనుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ రచనలు, చిత్రాలను అధ్యయనం చేసిన శ్వేత అనుకరణ నీడల్లోకి వెళ్లకుండా తనదైన సొంత శైలిని సృష్టించుకుంది.
వంటగది నుంచి పిల్లల పెంపకం వరకు మహిళల దైనందిన జీవితంలో రకరకాల ఘట్టాలను కథలుగా మలిచింది. శ్వేత కళాత్మక సాధనలో ‘స్త్రీవాదం’ అనేది ప్రధాన అంశంగా మారింది. ఆమె రచనల్లో స్త్రీ ΄ాత్రలు పరాధీనంగా, బేలగా, నిస్సహాయంగా కనిపించవు. పురుషాధిపత్య ధోరణులను సవాలు చేసేలా, స్వతంత్య్రవ్యక్తిత్వంతో కనిపిస్తాయి. నిత్య ఉత్సాహంతో శక్తిమంతంగా కనిపిస్తాయి.
ఇక చిత్రకళ విషయానికి వస్తే శ్వేత ఏ ఆర్ట్ స్కూల్‌లోనూ పట్టా పుచ్చుకోలేదు. అయితే విన్సెంట్ వాన్ గోహ్ నుంచి అమృతా షేర్‌గిల్ వరకు ఎంతోమంది చిత్రకారులతో మౌనసంభాషణ చేస్తూనే ఉంటుంది. తనదైన విలక్షణ దృశ్యభాషను సృష్టించుకోవడానికి సాధన చేస్తూనే ఉంటుంది.
‘కాలేజీ రోజుల నుంచి నా భావాల వ్యక్తీకరణకు కళ అనేది బలమైన మాధ్యమంగా ఉపయోగపడింది. కథ అయినా కవిత్వం అయినా చిత్రం అయినా కొత్త కోణంలో కనిపించాలనుకుంటాను’ అంటుంది శ్వేత.
బోధన, పరిశోధన, కళలలో తనకు ఇష్టమైనది ఏమిటి?
ఆమె మాటల్లోనే చె΄్పాలంటే... ‘అవేమీ దేనికవి ప్రత్యేకమైన ప్రపంచాలు కావు. ఉదాహరణకు నా బోధన నేను చేసే పరిశోధనపై, నా పరిశోధన నా కళపై ప్రభావితం చూపిస్తాయి. ఒకదానికొకటి ఉపకరిస్తాయి’
శ్వేతారావు గార్గ్ గ్రాఫిక్ నవల ‘ది టేల్స్ ఫ్రమ్ క్యాంపస్: ఏ మిస్ గైడ్ టు కాలేజి’ క్యాంపస్ వాతావరణం కాస్తో కూస్తో పరిచయం లేని వారిని కూడా క్యాంపస్‌లోకి తీసుకువెళ్లి ప్రత్యక్ష అనుభవాన్ని సొంతం చేస్తుంది. లింగభేదం, వేధింపులు, వర్గ హక్కులు, కులవివక్ష... ఇలా ఎన్నో అంశాలపై స్టూడెంట్స్ ఆలోచనలు, అవగాహనను ఈ నవల ప్రతిబింబిస్తుంది. పదమూడు చాప్టర్‌లలో ప్రతి చాప్టర్ తరువాత వచ్చే ‘స్టాప్ అండ్ థింక్’ సెక్షన్ ఎన్నో విషయాలలో పునరాలోచనకు అవకాశం కల్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment