మార్నింగ్‌ టీ కప్‌తోపాటు ఆకాంక్ష స్నాక్స్‌ ! ఇది కదా సక్సెస్‌! | Meet Akanksha Samiti And Her Quality Snacks, Know Their Inspiring Success Story In Telugu | Sakshi
Sakshi News home page

మార్నింగ్‌ టీ కప్‌తోపాటు ఆకాంక్ష స్నాక్స్‌ ! ఇది కదా సక్సెస్‌!

Published Wed, Jan 22 2025 11:04 AM | Last Updated on Wed, Jan 22 2025 11:57 AM

Meet Akanksha Samiti and her quality snacks

కాలక్షేపం కోసం, అందరూ కలిసి ఒకచోట టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడానికి లక్నోలోని ఐఏఎస్‌ అధికారుల భార్యలు ఒకచోట చేరేవారు. ఆ తరువాత ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ వైఫ్స్‌ (ఐఏఎస్‌ ఓడబ్ల్యూ) ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఈ సంస్థ సామాజిక సేవ వైపు తన పరిధిని విస్తరించింది. స్వయం–సహాయక సంఘం ‘ఆకాంక్ష’తో ఎంతోమంది సామాన్య మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

తాజా విషయానికి వస్తే... ‘ఆకాంక్ష’లోని మహిళా సభ్యులు కుంభమేళాలో 20 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.. ‘ఆకాంక్ష’ అనేది ‘ఐఏఎస్‌వోడబ్ల్యూ’కు స్వయం సహాయక సంఘం. కుంభమేళాలో భక్తుల సందడే కాదు లక్నోలోని ‘ఆకాంక్ష’లో భాగమైన ‘మసాల మాత్రి కేంద్ర’ మహిళల సందడి, సంతోషాలు కూడా కనిపిస్తాయి. నిన్న మొన్నటి వరకు వారు సాధారణ గృహిణులు. ఎప్పుడో తప్ప కొత్త ఊరికి వెళ్లని వారు. ‘ఆకాంక్ష’ పుణ్యమా అని వ్యాపారవేత్తలుగా మారారు. దేశంలోని ఎన్నో  ప్రాంతాలకు వెళుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ వైఫ్స్‌ అసోసియేషన్‌ (ఐఏఎస్‌ వోడబ్ల్యూ)కు కేవలం ఐఏఎస్‌ అధికారుల భార్యలు మాత్రమే నేతృత్వం వహించడం లేదు. గత సంవత్సరం జూలైలో ఐఏఎస్‌ ఆఫీసర్‌ రష్మీసింగ్‌ అధ్యక్షురాలు అయింది. ‘ఐఏఎస్‌ వోడబ్ల్యూ’కు ప్రెసిడెంట్‌ అయిన తొలి ఐఏఎస్‌ ఆఫీసర్‌గా నిలిచింది. జమ్మూకశ్మీర్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అయిన రష్మీ యూపీ చీఫ్‌ సెక్రటరీ మనోజ్‌ కుమార్‌సింగ్‌ భార్య.

మసాల, మాత్రి (ఉప్పగా ఉండే స్నాక్స్‌) తయారీకి ప్రసిద్ధి చెందిన ‘మసాల మాత్రి కేంద్ర’లో గతంతో పోల్చితే ఇప్పుడు  ప్రొఫెషనలిజం పెరిగింది. లడ్డూలు, చిక్కీలు, బ్యాగుల తయారీ, హస్తకళలలో విస్తరించింది. లక్నోకు చెందిన ఈ సంస్థ కార్యకలాపాలను నోయిడాకు విస్తరించ నున్నారు. కొన్ని నెలల క్రితం తమ ఉత్పత్తులతో భారీఎత్తున ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

‘ఈ ఎగ్జిబిషన్‌ ఆకాంక్ష సభ్యులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రిని తొలిసారి చూసినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఎగ్జిబిషన్‌ అనేది వారికి కేవలం డబ్బు సం΄ాదన మాత్రమే కాదు. కొత్త ప్రాంతానికి రావడం, కొత్త వ్యక్తులతో మాట్లాడడం... ఇలా ఎన్నో అనుభవాలను సొంతం చేసుకున్నారు’ అంటుంది రష్మీసింగ్‌.

‘మొదటిరోజు స్వయం సహాయక బృందానికి చెందిన మహిళ ఒకరు రెండు వేలే సంపాదించానని అసంతృప్తిగా మాట్లాడింది. అయితే ఈవెంట్‌ ముగిసే సమయానికి రూ.30,000 సంపాదించింది. ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంది’ అంటుంది ఐఏఎస్‌వోడబ్ల్యూ  – ఉత్తర్‌ప్రదేశ్‌ కార్యదర్శి ప్రతిభ.

యాభై నాలుగు సంవత్సరాల హలీమా గత దశాబ్దకాలంగా ‘ఆకాంక్ష’తో కలిసి పనిచేస్తోంది. ఈ కార్యక్రమం వల్ల ఆమెకు కశ్మీర్‌ నుంచి వచ్చిన మహిళలతో మాట్లాడే అవకాశం వచ్చింది. వ్యాపారం నుంచి తమ  ప్రాంత ప్రత్యేకతల వరకు ఎన్నో విషయాలపై మాట్లాడుకున్నారు. వీరు మరోసారి కుంభమేళాలో కలవనున్నారు. 

‘ఆకాంక్ష అనేది మా అందరి ప్రాజెక్ట్‌. మొదట్లో స్వయం సహాయక బృందం సభ్యుల మైండ్‌సెట్‌లో మార్పు తీసుకురావడానికి కృషి చేశాం. వారిన పాత పద్ధతుల నుంచి కొత్తదారిలోకి తీసుకువచ్చాం’ అంటుంది రష్మీసింగ్‌.

‘మా సంస్థ ఒకప్పుడు ఐఏఎస్‌ అధికారుల భార్యలు టీ తాగడానికి, ముచ్చటించడానికి, యోగా కార్యక్రమాలను నిర్వహించ డానికి వేదికగా ఉండేది. ఇప్పుడు దాని పరిధి ఎంతో విస్తరించింది. సామాజిక సేవదారిలో ప్రయాణిస్తుంది’ అంటుంది శైలజ చంద్ర.‘ నాకు మార్నింగ్‌ టీ కప్‌తోపాటు ఆకాంక్ష స్నాక్స్‌ తప్పకుండా ఉండాల్సిందే’ అంటున్నాడు ఒక కస్టమర్‌. ‘ఆకాంక్ష’ సాధించిన అద్భుత విజయానికి ఈ ఒక్క మాట చాలు కదా!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement