బామ్మ జీవితం నుండి ప్రేరణం పొంది అబ్‌స్ట్రాక్ట్ ఆర్టిస్ట్‌గానూ తల్లి సంగీత పరిజ్ఞానాన్ని ఒంటపట్టించుకొని సంగీత కళాకారిణిగానూ ఒకేసారి రెండు కళల్లోనూ రాణిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది ఢిల్లీవాసి సహాయ శర్మ. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ యువతరపు ఆలోచనలకు అద్దం పడుతుంది.
‘‘నా ఎదుగుదలలో సంగీతం పాత్ర చాలా పెద్దది. మా అమ్మ సంగీత కళాకారిణి. తను పాడుతుండటాన్ని నా చిన్ననాటి నుంచి వింటూ, నేనూ పాడుతూ పెరిగాను. సంగీత ప్రపంచం నుంచి నాదైన సొంత శైలిని కనుక్కోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉండేదాన్ని. స్కూల్, కాలేజీ రోజుల్లో ఎప్పుడు సెలవులు వచ్చినా రకరకాల పాటల్ని డౌన్‌లోడ్ చేసుకొని, ఒక ప్రత్యేకమైన జాబితా తయారు చేసేదాన్ని.
సొంతంగా ఆల్బమ్స్ విడుదల..
కిందటేడాది ముంబయిలో కిందటేడాది మా ఫ్రెండ్ మ్యూజిక్ స్టూడియోని సందర్శించాను. అక్కడ నేను రాసిన ఒక పాటను ప్లే చేశాను. ఆ పాట విన్నాక, వారు తమతో కలిసి పనిచేయవచ్చని చెప్పారు. దీంతో కిందటేడాది జూలై నాటికి అనుకున్న పాటను పూర్తి చేశాను. ఈ యేడాది మార్చిలో ‘ఫెడెక్స్ ఫెడప్’ ని విడుదల చేశాను. నా వ్యక్తీకరణను ప్రపంచంతో పంచుకోవడానికి ఇది సరైన సమయం అని భావించాను.
గొడవల నుంచి పాటలు..
రెండేళ్ల క్రితం మా కుటుంబసభ్యులతో చాలా గొడవ పడ్డాను. భగవద్గీత ఒక శ్లోకంలో కోపానికి, భయానికి మూలకారణం అనుబంధమే అని చెబుతోంది. దీనినుంచే నా ఆల్బమ్ పుట్టిందని చెప్పవచ్చు. ఒక సమయంలో జీవితం స్తంభించుకు΄ోయినట్టుగా అనిపిస్తుంది. అలాంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి మ్యూజిక్ ఆల్బమ్ చేశాను.
96 బిపిఎమ్ అనేది నాన్నతో గొడవ తర్వాత రాశాను. ఈ గొడవ తర్వాత స్త్రీ ప్రవర్తన నాకు కొత్తగా అర్థమయ్యేలా చేసింది. జీవితంలోని ఆచరణాత్మక దృక్పథాన్ని, భగవంతుని పట్ల ఉండే భక్తి అన్నీ బలమైన మనిషిగా తీర్చిదిద్దాయి. నా పాటలోని సాహిత్యం అంతా ఇలాగే ఉంటుంది. ‘నేను మళ్లీ కలుస్తూనే ఉంటాను. రౌండ్ అండ్ రౌండ్‌గా తిరుగుతూనే ఉంటాను...’ అని సాగుతుంది. ఇప్పటికి మూడు ఆల్బమ్స్ విడుదలయ్యాయి.
చిత్రకళలో ఓదార్పు..
రంగులలో లోతైన ఓదార్పును, శాంతిని కనుక్కోవడానికి ఉపయోగపడేదే పెయింటింగ్. సంగీతం ద్వారా నన్ను నేను బయటకు వ్యక్తపరుచుకుంటే పెయింటింగ్‌లో నన్ను నేను వెతుక్కోగలిగాను. ఇలా ఈ రెండు కళలు నన్ను కొత్తగా ఆవిష్కరింపజేశాయి. మా బామ్మ తన చీరలపై రకరకాల పెయింటింగ్స్‌ను చిత్రిస్తుండేది. వాటిని చూస్తూ నేనూ సాధన చేసేదాన్ని. అలా రంగుల ప్రపంచం నాకు పరిచయం అయ్యింది. అంతేకాదు, మా ఇల్లు రకరకాల పెయింట్స్, శిల్పాలతో ఒక ఆర్ట్ మ్యూజియంలా ఉంటుంది.
మా నాన్న అంత అందంగా తీర్చిదిద్దారు ఇంటిని. ఇది కళాకారిణిగా నా విజువల్ కార్టెక్స్‌లోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేసింది. అక్కడి కళాకృతుల సేకరణలో అమ్మ అభిరుచి, మన దేశీయ సంస్కృతి... నాలో లోతైన గాఢత నింపాయి. ఆ ఇష్టంతోనే సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశాను. రంగులతో ఆధ్యాత్మిక ప్రపంచాలను సృష్టిస్తుంటాను. సోలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంటాను. భార తదేశం, న్యూయార్క్, లండన్, బోస్టన్, దుబాయ్, హాంకాంగ్‌లోని కేఫ్‌లు, కోర్టులు, హోటళ్లు, గెస్ట్ హౌజ్ గోడలను నా పెయింటింగ్స్ అలంకరించాయి.
మార్చిన ప్రయాణాలు..
అమ్మానాన్నలతో కలిసి దేశమంతా తిరిగిన రోడ్డు ప్రయాణాలు, జంగిల్ సఫారీలు, ట్రెక్కింగ్ ఏరియాలు నన్ను ప్రకృతికి దగ్గర చేశాయి. నా తల్లితండ్రులు ప్రయాణంలో సంగీతం, కళ, కథలు, సంస్కృతిని పరిచయం చేశారు. అప్పటినుంచి అందమైన ప్రకృతి దృశ్యాలను నా పెయింటింగ్స్ లో చూపించడం అలవాటు చేసుకున్నాను.
కరోనా సమయంలో జీవితం ఎంత చిన్నదో కదా అనిపించింది. అప్పుడు భౌతికంగా, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. విలాసవంతమైన జీవనం అవసరమా అనేది తెలుసుకున్నాను. నా వాస్తవికత ఏమిటో అర్థమయ్యాక నేనేం సృష్టించాలో తెలుసుకున్నాను. అందువల్ల మ్యూజిక్ ఆల్బమ్స్, పెయింటింగ్స్ నన్ను కొత్తగా మార్చాయి’’ అని వివరిస్తుంది సహాయ.
Comments
Please login to add a commentAdd a comment