రూ. 25 లక్షల ఐటీ జాబ్‌ వదిలేసి.. ఆర్గానిక్‌ వైపు జాహ్నవి జర్నీ! | VRich founderYogitha Jahnavis Entrepreneurial Journey | Sakshi
Sakshi News home page

రూ. 25 లక్షల ఐటీ జాబ్‌ వదిలేసి.. ఆర్గానిక్‌ వైపు జాహ్నవి జర్నీ!

Published Thu, Jan 9 2025 10:31 AM | Last Updated on Thu, Jan 9 2025 8:09 PM

VRich founderYogitha Jahnavis Entrepreneurial Journey

మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్, ఐఎమ్‌టీ ఘజియాబాద్‌లో ఎంబీఏ చదివి నగరంలోని ఐటీ కంపెనీల్లో ఏడాదికి రూ.25 లక్షలకు పైగా జీతమిచ్చే ఉద్యోగాలు చేశారు. ఆ ఉద్యోగాలను వదిలేసి..‘ఆర్గానిక్‌ ఉత్పత్తులు ఆరోగ్యాన్నిస్తాయి.. కల్తీ ఆహార ఉత్పత్తులతో రోగాల పాలు కావొద్దు’ అని ఇంటింటికీ వెళ్లి చెబుతున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన ఆర్గానిక్‌ ఉత్పత్తుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఆ విశేషాలు 
నగరవాసి యోగితా జాహ్నవి మాటల్లోనే..  – సాక్షి, సిటీబ్యూరో 

గర్భిణిగా ఉన్నప్పుడు పోషకాహారం తినాలని ప్రతి ఒక్కరూ చెబుతారు కానీ పోషకాలు అందించే ఆహారం దొరకాలి కదా.. ఇప్పుడు ఎటు చూసినా కల్తీ.. ఈ పరిస్థితుల్లో కడుపులోని బిడ్డకు స్వచ్ఛమైన ఆహారం అందించడం ఎలా?’ అంటూ చాలా ఆందోళన చెందాను’ అంటూ తాను గర్భిణిగా ఉన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు ఆర్గానిక్‌ ఉత్పత్తుల సంస్థ వీ రిచ్‌ నిర్వాహకురాలు యోగితా జాహ్నవి.  

అంతా కల్తీ.. తినేదెలా? 
అదీ ఇదీ లేదని సందేహం వలదు.. ఎందెందు వెదికినా అందందే కలదు అడల్ట్రేషన్‌.. మనం తింటున్న ఆహారం మనకు పోషకాలు ఇస్తోందా? రోగాలు తెస్తోందా? ఈ ఆందోళన గర్భిణిగా ఉన్నప్పుడు మరింత పెరిగింది. కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా స్వచ్ఛమైన పాలు, తేనె, కుంకుమ పువ్వు తీసుకోవాలనే ఆరాటంతో నా అన్వేషణ మొదలైంది. ఎంత కష్టమైనా సరే స్వచ్ఛమైన ఆహారోత్పత్తులను అందించాలనే తపన పెరిగింది. అదే ఏళ్ల తరబడి శ్రమించి అందుకున్న డిగ్రీ పట్టా, అది అందించిన లక్షల జీతమిచ్చే ఉద్యోగం.. వదిలేసి మా పల్లెటూరి వైపు నా చూపును మళ్లించింది. 

ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం

 

పాడితో కూడి.. 
ప్రభుత్వోద్యోగం చేసి రిటైరయ్యాక డైరీ ఫార్మ్‌ పెడదామని నాన్న కల. ఉద్యోగం వదిలేశాక మా నాన్న కల సాకారంతో పాటు నా ఆశయాలకు ఆకారం కూడా ఇవ్వాలని మా సొంత ఊరు కందుకూరులో ఒక డైరీ ఫార్మ్‌ను ఏర్పాటు చేశా. ఆవులు, గేదెలకు గ్రోత్‌ హార్మోన్‌ ఇంజక్షన్లు ఇవ్వకుండా వాటి మేత కూడా సహజమైన ఆహారమే అందిస్తున్నాం.. తద్వారా ఏ దశలోనూ కల్తీ కాని, రసాయనాలు కలవని స్వచ్ఛమైన పాలు ఉత్పత్తి చేస్తున్నాం. 

 పరిశోధించి.. పరిశీలించి.. 

పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ఒకే సీజన్‌లో తేనె లభిస్తుంది. ప్రభుత్వం,  ఎన్‌జీవోలు కలిపి ప్రతి ఇంటికీ తేనె సేకరించేలా ఏర్పాట్లు చేస్తారు. విభిన్న రకాల పూల నుంచి సేకరించిన ఈ తేనెలో ఔషధ విలువలు పుష్కలం. ఇది తెలిసి అక్కడకు వెళ్లి వారితో ఒప్పందం కుదర్చుకున్నా. అదేవిధంగా బెల్లం పొడి కూడా అక్కడిదే. మెటల్‌ సీడ్‌ నుంచే పుట్టే ఈ బెల్లం ఆరోగ్యకరం. ఇక్కడ లభించే బెల్లం పొడిలా దీన్ని కలిపితే పాలు విరగవు. ఇందులో ఐరన్‌  కంటెంట్‌ బాలింతలకు ఆరోగ్యకరం. అలాగే అత్యుత్తమ రైస్‌ రకం గురించి  అన్వేషిస్తే బ్లాక్‌ రైస్‌ గురించి తెలిసింది. వియత్నాం, రష్యాలో ఈ రైస్‌కి బాగా డిమాండ్‌ ఉంది. 

మన దేశంలో మణిపూర్‌లో బాగా పండిస్తారు. అక్కడి నుంచి బ్లాక్‌ రైస్‌ తెస్తున్నా. అలాగే కశ్మీర్‌ నుంచి కుంకుమ పువ్వు ఇలా దాదాపు డజనుకుపైగా అన్వేషించినవి, అత్యుత్తమమైనవి అందిస్తున్నా. దీన్నేదో కేవలం వ్యాపారంగా చూడటం లేదు. అత్యధిక శాతం మహిళా సిబ్బందితో నడిచే మా సంస్థ.. ఇంటింటికీ ఆరోగ్యకరమైన ఉత్పత్తులు చేరవేయాలని, ముఖ్యంగా బాలింతలు, బలహీనంగా ఉండే మహిళలకు బలవర్థకమైన ఆహారం అందించాలనే ఆశయంతో నిర్వహిస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement