radio artist
-
Ameen Sayani: పాటల పూలమాలి వెళ్లిపోయాడు..!
‘బెహనో.. ఔర్ భాయియో..’ ఈ గొంతుతో ప్రేమలో పడని రేడియో శ్రోత ఉండేవాడు కాదు. ‘బినాకా గీత్మాల’ టాప్ 13లో ఏ పాట నిలుస్తుందో చూద్దామని వారమంతా ఎదురుచూపులు. నవ్వుతూ నవ్విస్తూ గుంజిపారేసే ఆకర్షణీయమైన గొంతుతో దశాబ్దాల పాటు పాటలను పంచిన రేడియో ప్రెజెంటర్ అమిన్ సయానీ తన 91వ ఏట బుధవారం వీడ్కోలు తీసుకున్నాడు. ఇకపై భారతీయ సాంస్కృతిక ఆనవాలై అతను వెలగనున్నాడు. పాటలు విరబూస్తాయి. అదిగో అల్లంత దూరాన ఒక చామంతి పూస్తుంది. ముళ్లను వెనక్కు నెడుతూ ఒక రోజా మెడ నిక్కి చూస్తుంది. గుబురు చాటున మల్లెమొగ్గ ఒకటి సిగ్గుతో మొహం దాచుకుంటుంది. గరిక పచ్చతావులో గడ్డిపూవు వర్ణనకు అందని రంగుతో కాంతిలీనుతుంది. వాటి మానాన అవి ఉన్నప్పుడు మన చూపు పడకపోవచ్చు. పడినా వాటి సౌందర్యమేమిటో తెలియకపోవచ్చు. అప్పుడొక పూలమాలి వస్తాడు. ఒక పువ్వు సువాసన ఎంత ప్రత్యేకమైనదో చెబుతాడు. మరో పూలరెక్క వయ్యారాన్ని చూపి విస్మయపడతాడు. ఒక పువ్వును నాసిక దగ్గర చేర్చడమే భాగ్యమంటాడు. ఒక పువ్వునలా కొమ్మకు వదిలిపెట్టమని మారాము చేస్తాడు. అప్పుడా పూల మీద మనకు ప్రేమ కలుగుతుంది. మనమూ వాటికి మాలిగా మారాలనుకుంటాము. గుండెకు దగ్గరగా చేర్చుకుంటాము. హృదయంతో వాటి పోషణకు పూనుకుంటాము. అమిన్ సయానీ చేసింది అదే.. రేడియో సిలోన్లో హిందీ సినిమా పాటలను శ్రోతలకు చేర్చడం. వాటిపై ప్రేమను పంచడం. వాటిని పాడుకుంటూ, కూనిరాగాలు తీస్తూ, ఆ మనోహర మాయలో చిక్కుకుంటూ జనం తమ బతుకు బాదరబందీని కాసేపు మరచిపోయేలా చేయడం. 1952 డిసెంబర్లో మొదటి షోగా మొదలైన ‘బినాకా గీత్మాల’ బినాకా టూత్‌పేస్ట్ వారి స్పాన్సర్డ్ప్రోగ్రామ్. ప్రతి బుధవారం సాయంత్రం రేడియో సిలోన్లో ప్రసారమయ్యేది. టాప్ 13తో మొదలయ్యి టాప్ 1 వరకూ కౌంట్‌డౌన్‌గా పాటలు ప్రసారమయ్యే ఆ షో చివరలో తర్వాతి వారం కోసం ‘లిస్ట్’ అయిన పాటలను చెప్పి వాటిని శ్రోతలు ఏ వరుసలో మెచ్చుతారో రాసి పంపమనేవారు. టాప్ వన్‌గా నిలిచే పాటను ఎక్కువమంది దేనిని ఎంపిక చేస్తారో దానికి ఆ ర్యాంక్ ఇచ్చేవారు. టాప్ 1ను సూచించిన వారి పేర్ల నుంచి జాక్‌పాట్ తీసి ఒక శ్రోతకు 100 రూపాయల బహుమతి ఇచ్చేవారు. అమిన్ సయాని మొదటి షో చేసేసరికి ఎంత హిట్ అయ్యిందంటే మరుసటి వారానికి 9 వేల ఉత్తరాలు స్పందనగా అందాయి. సంవత్సరం గడిచే సరికి వారం వారం వచ్చే ఉత్తరాల సంఖ్య 65 వేలకు చేరుకుంది. పోస్టాఫీసు వాళ్లు, రేడియో స్టేషన్ వారూ పిచ్చెత్తి పోయేవారు. తర్వాత ఈ రెస్పాన్స్ తంతును ఆపేసి సయానీ ఎంపిక మీద, రికార్డుల అమ్మకాలను బట్టి టాప్ 1ను డిసైడ్ చేసేవారు. ఏ జందగీ ఉసీకి హై.. అమిన్ సయానీ చేసిన బినాకా గీత్ మాలాలో ఏ వారం ఏ సింగర్ పాడిన పాట టాప్ సాంగ్‌గా నిలుస్తుందో తెలుసుకోవడం శ్రోతలకే కాదు సినీ రంగ దిగ్గజాలకు కూడా పెద్ద ఆసక్తిగా ఉండేది. బినాకా చార్ట్‌లో చోటు చేసుకోవడం గౌరవంగా భావించేవారు. ఇక కొన్ని పాటలైతే వారాల తరబడి టాప్ 1గా నిలిచి ఆ గాయకులకు, సంగీత దర్శకులకు క్రేజ్‌ను సంపాదించి పెట్టేవి. సంవత్సరం చివరలో అమిన్ సయానీ ‘సాంగ్ ఆఫ్ ద ఇయర్’ అంటూ ఒక పాటను ప్రకటించేవాడు. ఆ రోజుల్లో ‘ఏ జందగీ ఉసీకి హై’ (అనార్కలీ– 1953), ‘జాయెతో జాయె కహా’ (టాక్సీ డ్రైవర్ – 1954), ‘మేరా జూతా హై జపానీ’ (ఆవారా – 1955), ‘ఏ దిల్ ముష్కిల్ జీనా యహా’ (సి.ఐ.డి – 1956)... ఇలా పాటలు శ్రోతల మెచ్చుకోలుతో వెలిగేవి. బినాకా గీత్మాలాలో ఎక్కువసార్లు టాప్ ΄÷జిషన్‌లో నిల్చున్న గాయని లతా. ఆ తర్వాత రఫీ. ఆ మృదుత్వం.. ఆ దగ్గరితనం.. అమిన్ సయానీ గొంతు, వాడే సులభమైన భాష, ఉచ్చారణ, మధ్య మధ్య జోకులు, కొన్ని ఆసక్తికరమైన కథనాలు ఇవన్నీ కలిసి షోను విపరీతంగా హిట్ చేశాయి. అమిన్ రేడియో అనౌన్సర్లకు మార్గదర్శి అయ్యాడు. ‘గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో’ అనిపించుకున్నాడు. జీవితాంతం ఫ్రీలాన్సర్‌గానే అమిన్ రేడియో సిలోన్లో, వివి«ద్ భారతిలో షోస్ చేశాడు. అలాగే ఎన్నో అడ్వర్టైజ్మెంట్లలో ఆయన గొంతు వినిపించేది. సినిమా వాళ్ల అవార్డు ఫంక్షన్లలో, మ్యూజిక్ ప్రోగ్రాముల్లో అమినే యాంకర్. అంటే ఇవాళ దేశంలో ఉన్న పాపులర్ అనౌన్సర్లకు, యాంకర్లకు సయానీ సిలబస్ సెట్ చేసి వదిలాడు. ‘సినిమా పాటలే మన దేశంలో సగటు ప్రజలందరినీ కలిపి ఉంచాయి’ అంటాడు అమిన్ సయానీ. బొంబాయిలో పుట్టి పెరిగి ముంబైలోనే తుదిశ్వాస వదిలిన అమిన్ సయాని ఆల్ ఇండియా రేడియో ఉజ్వల రోజులను, గోల్డెన్ ఎరా ఆఫ్ హిందీ మ్యూజిక్‌ను ప్రస్తావించినప్పుడల్లా తన ప్రియమైన గొంతుతో పునరుత్థానం చెందుతూనే ఉంటాడు. ఇకపై కూడా అందమైన పూలు ఎన్నో పూయవచ్చు. కాని వాటిని ఊరికూరికే చూస్తూ పదేపదే సంబరపడిపోయే ఒక మాలి మరి ఉండడు. అదంతా గతం. సుందరమైన గతం. ఎంతో శ్రావ్యంగా పదిలపరుచుకునే గతం. అది సినీ సంగీతాన్ని ఇష్టపడే వారి సొంతమైన జ్ఞాపకం. ఇవి చదవండి: Karishma Mehta: కథలు మార్చగలవు -
అలనాటి ఆకాశ వాణి
‘‘కలదు ఆ శారదకు వీణ కరములందు కలదు ఈ శారదకు వీణ గళమునందు కలదు ఆ శారద కవుల కవితలందు కలవు కవితలే ఈమె గానామృతమందు శారద కాని శారదకు శారదలోగల సత్కళా సుధా సారదకున్... విశారదకు సాదర పూర్వ నమస్సుమాంజలులు’’ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్‌కు ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారిన ప్రశంస ఇది. 19.6.1977వ తేదీన ఆత్రేయ స్వహస్తాలతో రాసిన ఈ లేఖ శారదా శ్రీనివాసన్ దగ్గర ఇంకా భద్రంగా ఉంది. ఈ నెల రెండవ తేదీన హైదరాబాద్‌లో ‘లాడ్లీ మీడియా అండ్ అడ్వర్టైజింగ్ అవార్డ్స్ ఫర్ జెండర్ సెన్సిటివిటీ’ ప్రాంతీయ పురస్కారం అందుకున్నారామె. 45 ఏళ్ల కిందటి ఆత్రేయ గారి ప్రశంస, ఇప్పుడు ఈ పురస్కారానికి మధ్య ఆమె అందుకున్న గౌరవాలను లెక్క పెట్టడం సాధ్యం కాని పని. అలాగే ఆమె గళమిచ్చిన పాత్రల సంఖ్య కూడా! వేలల్లో ఉంది. తనకు గుర్తింపు, గౌరవం అన్నీ రేడియోతోనే అన్నారామె. శారదా శ్రీనివాసన్ తన రేడియో ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు. గళం దేవుడిచ్చాడు! ఉచ్చారణ ఇల్లు నేర్పించింది! ‘‘నేను పుట్టింది కృష్ణాజిల్లా, అవనిగడ్డ. మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. అప్పుడు అక్కడ ఉద్యోగం చేసేవారు. నాకు భగవంతుడు చక్కటి గొంతునిచ్చాడు. చక్కగా ఉచ్చరించడం మా ఇంట్లో అలవడింది. ఏ తొందరపాటులోనో ఒకపదంలో ఒక్క ఒత్తును సరిగ్గా పలకకపోయినా సరే ఉపేక్షించేవారు కాదు, ‘ఏం పలికావు? మళ్లీ పలుకు’ అని కోప్పడుతూ ఎప్పటికప్పుడు సరిదిద్దేవారు. మేము తణుకులో ఉన్నప్పుడు నన్నయ భట్టారకుని జయంతి సందర్భంగా పాఠశాల బాలికలకు పద్యపఠనం నిర్వహించారు. నేను కూడా ఓ నాలుగు పద్యాలు కంఠతా పట్టి ఆ పోటీల్లో వినిపించాను. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బహుమతితో ఇంటికి వస్తే మా నాన్న ఏమన్నారో తెలుసా... ‘ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అన్నట్లు, నీకు ప్రథమ బహుమతి వచ్చిందా’ అని నవ్వారు. యాదృచ్ఛికంగా మొదలైంది! మేము విజయవాడ, మాచవరంలో ఉన్నప్పుడు హిందీకాలేజ్లో ప్రవీణ, ప్రచారక్ చేస్తున్న రోజుల్లో అనుకోకుండా వచ్చింది అవకాశం. రేడియో కాంటాక్ట్ కోసం వాయిస్ టెస్ట్ చేశారు. మా లెక్చరర్ చొరవతో వాయిస్ టెస్ట్‌లో పాల్గొనడం, సెలెక్ట్ కావడం జరిగిపోయింది. ఇది 1956–57ల నాటి మాట. అలా మొదలైన నా ఆకాశవాణి ప్రయాణంలో నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. 1995 ఆగస్టులో రిటైరయ్యే వరకు నేను గళమిచ్చిన ప్రతి కార్యక్రమం నాకు ఒక పాఠమే. నన్ను సమగ్రంగా తయారు చేసిన యూనివర్సిటీ రేడియో. నవరసాలూ గొంతులోనే పానుగంటి వారి రచనల్లోని పాతతరం తెలుగు భాషను ఒంటపట్టించుకోవడం కొంచెం శ్రమ అనిపించేది. అంతే తప్ప మరెక్కడా ఇబ్బంది పడలేదు. బాలగంగాధర తిలక్ ‘సుప్తశిల’ నేను చాలా బాగా చేశానని నాకనిపించిన నాటిక. రంగస్థలం మీద నటించేటప్పుడు హావభావాలు ప్రేక్షకులకు కనిపిస్తుంటాయి. రేడియోలో అలా కాదు. నవరసాలనూ గొంతులోనే పలికించాలి. అంతేకాదు, శ్రోతలకు మేము కనిపించడం లేదు కదా అని ఒకే చోట కూర్చుని మాట్లాడుతూ నాటికను రికార్డు చేస్తే జీవం రాదు. ఒక గదిలో నుంచి మరో గదిలోకి వెళ్తున్న సన్నివేశంలో కానీ, ఒక పాత్ర ఇంటి నుంచి బయటకు వెళ్తూ ‘వెళ్లొస్తాను’ అంటూ వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మొదటి అక్షరం పలకడానికి చివరి అక్షరం పలకడానికి మధ్య మైక్‌కు దూరం వెళ్తేనే ఆ సన్నివేశం శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలను దర్శకులు చెప్పరు. ఎవరికి వారు సాధనలో తెలుసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం... ఉచ్చారణ ఉద్దేశం ఏమిటి? ఎదుటి వారికి తెలియాల్సిన ఒక విషయాన్ని మనం చెబుతున్నామనే కదా! పదాలను ఎక్కడ ఆపాలో, ఎక్కడ కలిపి పలకాలో స్పష్టత లేకపోతే వినేవాళ్లకు విషయం ఎలా తెలుస్తుంది? టీవీలో వార్తలు చదివే వాళ్లు ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే బావుణ్ణనిపిస్తుంటుంది. ఉత్సాహాన్నిచ్చింది ఇక నా కుటుంబ విషయానికి వస్తే... చెన్నై నుంచి వచ్చిన ఫ్లూట్ ఆర్టిస్ట్ శ్రీనివాసన్‌తో రేడియోలోనే పరిచయమైంది. పెళ్లి చేసుకున్నాం. మాకు ఒకమ్మాయి నీరద. నాటికల ద్వారా ఎన్నో జీవితాలను ఆయా పాత్రల్లో ఇమిడిపోయినంతగా చదివాను. అందుకే ఎన్నో కోణాలను అర్థం చేసుకోగలిగాను. ముందే చెప్పాను కదా... ఆకాశవాణి అనే యూనివర్సిటీలో పట్టా పొందిన విద్యార్థిని నేను. ఈ రోజు లాడ్లీ్ల వంటి సంస్థ గుర్తించడానికి కారణమూ రేడియోనే. ఎనభై ఎనిమిదేళ్ల వయసులో ఈ అవార్డు నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పటికీ గళం సహకరిస్తూ ఉండడం నా అదృష్టమనే చెప్పాలి’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు రేడియో ఆర్టిస్ట్, రచయిత శారదా శ్రీనివాసన్. ఆకాశవాణి... నా బడి గుడి! నాటికలు నా ప్రధాన విభాగం. అయినప్పటికీ స్పోకెన్ వర్డ్ ఆర్టిస్ట్‌గా రకరకాల స్క్రిప్టులు చదివాను. సాహిత్యం, చరిత్ర, నవలాపఠనం, వైద్య కథనాలు, మహిళలు – పిల్లల అంశాలు, కార్మికుల కార్యక్రమాలు, పిల్లల పాఠ్యాంశాలు... ఇలా అదీ ఇదీ అని పరిమితం కాకుండా అన్ని విభాగాల్లోనూ నా గొంతు వినిపించాను. యువవాణి మినహా రేడియోలో అన్ని విభాగాల్లోనూ నా గొంతు వినిపించాను. -
'బండెనక బండి..' కట్టిన సీతాదేవి ఇకలేరు!
యునైటెడ్ స్టేట్స్: 'బండెనక బండి కట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లె వస్తవు కొడకో..' అనే పాట వినని, తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తికాదు. ఇలాంటి ఎన్నెన్నో జానపద బాణీలు కట్టిన సంగీతకారిణి, ప్రముఖ రేడియో ప్రయోక్త వింజమూరి సీతాదేవి ఇకలేరు. ప్రస్తుతం అమెరికాలో ఉంటోన్న ఆమె అక్కడే కన్నుమూశారు. 'వింజమూరి సిస్టర్స్'గా ప్రపంచఖ్యాతి పొందిన సోదరీమణులలతో ఒకరైన సీత.. తన సోదరి అనసూయతో కలిసి లెక్కకుమించి ప్రదర్శనలు, రేడియో షోలు నిర్వహించారు. కవిరేడు దేవులపల్లి కృష్ణశాస్త్రికి మేనకోడలైన సీతాదేవి.. 1962 నుంచి 1684 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో జానపద సంగీత ప్రయోక్తగా బాధ్యతలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల జానపద గీతాలను సేకరించి, అవే బాణీలతో స్టూడియో కళాకారులతో రికార్డు చేసేవారు. సోదరి అనసూయతో కలిసి జాతీయ అంతర్జాతీయ వేదికల మీద లలిత జానపద సంగీత ప్రదర్శనలిచ్చారు. 'ఆంధ్రప్రదేశ్ జానపద సంగీతం' పేరుతో గ్రామ్ ఫోన్ రికార్డు లను విడుదల చేశారు. తెలుగులో రూపుదిద్దుకున్న అద్భుత చిత్రాల్లో ఒకటైన 'మా భూమి' సినిమాకు వింజమూరి సీతాదేవి సంగీత దర్శకత్వం వహించారు. 1979 లో విడుదలైన ఈ సినిమాలోని 'బండెనక బండి కట్టి..', 'పల్లెటూరి పిల్లగాడ పసులగాసె మొనగాడ పాలు మరచి ఎన్నాళ్లయిందో.. ' లాంటి పాటలు ఇప్పటికీ జనం నోళ్లల్లో నానుతూఉన్నాయంటే.. ఆ ఘనత సీతాదేవికి కూడా దక్కుతుంది. ఆమె మరణంతో జానపదానికి పెద్ద దిక్కు కోల్పోయినట్లయింది.