'బండెనక బండి..' కట్టిన సీతాదేవి ఇకలేరు!
యునైటెడ్ స్టేట్స్: 'బండెనక బండి కట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లె వస్తవు కొడకో..' అనే పాట వినని, తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తికాదు. ఇలాంటి ఎన్నెన్నో జానపద బాణీలు కట్టిన సంగీతకారిణి, ప్రముఖ రేడియో ప్రయోక్త వింజమూరి సీతాదేవి ఇకలేరు. ప్రస్తుతం అమెరికాలో ఉంటోన్న ఆమె అక్కడే కన్నుమూశారు. 'వింజమూరి సిస్టర్స్'గా ప్రపంచఖ్యాతి పొందిన సోదరీమణులలతో ఒకరైన సీత.. తన సోదరి అనసూయతో కలిసి లెక్కకుమించి ప్రదర్శనలు, రేడియో షోలు నిర్వహించారు.
కవిరేడు దేవులపల్లి కృష్ణశాస్త్రికి మేనకోడలైన సీతాదేవి.. 1962 నుంచి 1684 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో జానపద సంగీత ప్రయోక్తగా బాధ్యతలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల జానపద గీతాలను సేకరించి, అవే బాణీలతో
స్టూడియో కళాకారులతో రికార్డు చేసేవారు. సోదరి అనసూయతో కలిసి జాతీయ అంతర్జాతీయ వేదికల మీద లలిత జానపద సంగీత ప్రదర్శనలిచ్చారు. 'ఆంధ్రప్రదేశ్ జానపద సంగీతం' పేరుతో గ్రామ్ ఫోన్ రికార్డు లను విడుదల చేశారు.
తెలుగులో రూపుదిద్దుకున్న అద్భుత చిత్రాల్లో ఒకటైన 'మా భూమి' సినిమాకు వింజమూరి సీతాదేవి సంగీత దర్శకత్వం వహించారు. 1979 లో విడుదలైన ఈ సినిమాలోని 'బండెనక బండి కట్టి..', 'పల్లెటూరి పిల్లగాడ పసులగాసె మొనగాడ పాలు మరచి ఎన్నాళ్లయిందో.. ' లాంటి పాటలు ఇప్పటికీ జనం నోళ్లల్లో నానుతూఉన్నాయంటే.. ఆ ఘనత సీతాదేవికి కూడా దక్కుతుంది. ఆమె మరణంతో జానపదానికి పెద్ద దిక్కు కోల్పోయినట్లయింది.