సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. టీఎస్‌ఐపాస్ ద్వారా సకాలంలో విద్యుత్ కనెక్షన్లను జారీ చేయడంలో దేశంలోనే ఇతరులకన్నా ముందున్న తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖకు ప్రతిష్టాత్మక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ అవార్డు దక్కింది. ఈ మేరకు సోమవారం మింట్ కాంపౌండ్‌లో ఆ విభాగం ప్రధాన అధికారి ఏజీ రమణప్రసాద్ విలేకరులకు వెల్లడించారు. ‘నాణ్యత నిర్వహణ వ్యవస్థ ధృవీకరణ లైసెన్స్’ను పొంది న తొలి రాష్ట్రం మనదేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి చేతుల మీదుగా ఇటీవలే ఈ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. ఈ తరహా లైసెన్స్ తెలంగాణలోని ఏ ప్రభుత్వ శాఖ కూడా ఇప్పటి వరకు పొందలేదన్నారు.
కేవలం ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి కార్యాలయానికే కాకుండా నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌సిటీ, నిజామాబాద్ కార్యాలయాలకు కూడా ఈ గుర్తింపు దక్కిందని స్పష్టం చేశారు. తెలం గాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆన్‌లైన్ విధానం అమలు చేయడం, టీఎస్‌ఐపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సకాలంలో అనుమతులు జారీ చేయడం, విద్యుత్ వినియోగం, ప్రమాదాల నివారణ, నిర్దేశిత సమయంలోనే పరిశ్రమలకు కనెక్షన్లు మంజూరు చేయడం, ధ్రువీకరణ పత్రాల జారీ వంటి విషయంలో దేశంలోనే తెలంగాణ విద్యుత్ తనిఖీశాఖ ముందుందని, సీఎం కేసీఆర్ చొరవ, ఉద్యోగుల సమష్టికృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు.టీఎస్‌ఐపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను సమర్థంగా పరిశీలించినందుకు గుర్తింపుగా గతేడాది జనవరిలో అత్యుత్తమ ప్రదర్శన అవార్డు దక్కిందని, ఎత్తైన భవనాల్లో భద్రతను పెంచడంలో కృషిచేసినందుకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇటీవలే బహుమతిని ఇచ్చి సత్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment