సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2020పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి (ఎస్‌ఈఆర్సీ) చైర్మన్, సభ్యుల ఎంపిక విషయంలో ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి రాష్ట్రం తమదైన ఎంపిక కమిటీ ద్వారా రాష్ట్ర ఈఆర్సీ చైర్మన్, సభ్యులను ఎంపిక చేసుకోవచ్చని, ఈ కమిటీలో ప్రస్తుతం ఉన్నట్లే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు సమాన సంఖ్యలో ఉండాలని స్పష్టం చేసింది. అలాగే ఈఆర్సీలో ఖాళీలు ఏర్పడిన ప్రతిసారీ ఎంపిక కమిటీని ఏర్పాటు చేసే బదులు స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుతం హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఈ ఎంపిక కమిటీకి అధ్యక్షత వహిస్తుండగా ఇకపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహించాల్సి ఉంటుందని కొత్త నిబంధన విధించింది.
రాష్ట్రాల ఈఆర్సీల్లో ఏర్పడుతున్న ఖాళీలను సకాలంలో భర్తీ చేసేందుకు ఎంపిక కమిటీల ఏర్పాటులో కొన్ని రాష్ట్రాలు జాప్యం చేస్తున్నాయని, దీంతో ఈఆర్సీల కార్యకలాపాలు స్తంభిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఏప్రిల్‌లో ప్రకటించిన కేంద్ర విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లుపై వివిధ రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ముసాయిదా బిల్లుపై పలు అపోహలు ప్రచారంలో ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంటూ గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన ఏర్పాటు చేసే ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ)తోపాటు రాష్ట్రాల ఈఆర్సీలను నియమించాలని, ఈ కమిటీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతోపాటు రొటేషన్ పద్ధతిలో ఏదో ఒక రాష్ట్ర అధికారి సభ్యులుగా ఉంటారని గతంలో ప్రకటించిన ముసాయిదా బిల్లులో కేంద్రం పేర్కొంది. దీనిపై రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడంతో తాజాగా వెనక్కి తగ్గింది.
నగదు బదిలీతో నష్టం లేదు..
ప్రస్తుత విద్యుత్ రాయితీల విధానానికి స్వస్తిచెప్పి నగదు బదిలీ (డీబీటీ) రూపంలో రాయితీలు అందించాలన్న ప్రతిపాదనలు వినియోగదారులు, రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని వస్తున్న ఆరోపణలను కేంద్ర విద్యుత్ శాఖ తోసిపుచ్చింది. రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించని పక్షంలో వినియోగదారులకు విద్యుత్ సరఫరాను నిలిపేస్తారన్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 65 ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా సబ్సిడీలు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. ప్రతి వినియోగదారుడి పేరుతో డిస్కంలు నిర్వహించే ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ రూపంలో ఇకపై రాయితీలను జమ చేయాల్సి ఉంటుందని మాత్రమే ప్రతిపాదించామని కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రాయితీలు చెల్లించకపోయినా లేక మూడు నాలుగు నెలలపాటు చెల్లించడంలో విఫలమైనా వినియోగదారుల కనెక్షన్లను కట్ చేయొద్దని త్వరలో తీసుకురానున్న కొత్త విద్యుత్ టారిఫ్ పాలసీలో పొందుపరుస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందస్తుగా డిస్కంలకు రాయితీలు చెల్లించాలని ఆశిస్తూనే ఈ ప్రతిపాదనలను తీసుకొచ్చామని, దీని ద్వారా డిస్కంలతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సైతం ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడింది.
రాష్ట్రాల ఈఆర్సీకే టారిఫ్ ఖరారు అధికారం
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రిటైల్ విద్యుత్ చార్జీలు (టారిఫ్) ఖరారు చేస్తోందని, ఇకపై ఈ అధికారం కేంద్రం పరిధిలోకి వెళ్లనుందంటూ జరుగుతున్న మరో ప్రచారం సైతం అపోహ మాత్రమేనని కేంద్ర విద్యుత్ శాఖ వివరించింది. ప్రస్తుతం విద్యుత్ టారీఫ్‌ను రాష్ట్రాల ఈఆర్సీలే ఖరారు చేస్తున్నాయని, ఈ విషయంలో ఎలాంటి మార్పులను ప్రతిపాదించలేదని స్పష్టం చేసింది.
చార్జీల పెంపును ఈఆర్సీలు అడ్డుకోరాదు...
విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేసే వ్యయం రాబట్టే విధంగా విద్యుత్ టారిఫ్‌ను ఈఆర్సీలు ఖరారు చేయాల్సిందేనని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. చేసిన ఖర్చును వసూలు చేసుకొనేలా విద్యుత్ చార్జీలను పెంచుకోవడానికి డిస్కంలకు కొన్ని ఈఆర్సీలు అనుమతించట్లేదని, ఇలా దేశవ్యాప్తంగా రూ. 1.4 లక్షల కోట్లను వసూలు చేసుకోలేక డిస్కంలు నష్టపోయాయని పేర్కొంది. ఈ ధోరణికి తెరదించేందుకే ‘కాస్ట్ రిఫ్లెక్టివ్ టారిఫ్’నిబంధనను విద్యుత్ బిల్లులో ప్రతిపాదించినట్టు వివరణ ఇచ్చింది.
క్రాస్ సబ్సిడీని తగ్గించాల్సిందే..
‘పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీ, రైల్వే తదితర కేటగిరీల వినియోగదారులపై క్రాస్ సబ్సిడీల పేరుతో విధించే అధిక చార్జీలు సగటు విద్యుత్ సరఫరా వ్యయంలో 20 శాతానికి మించకుండా ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నా కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం వరకు క్రాస్ సబ్సిడీని విధిస్తున్నారు. దీంతో క్రాస్ సబ్సిడీలను భరించలేక పరిశ్రమలు పోటీతత్వాన్ని కోల్పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు అన్ని వర్గాలవారితో సంప్రదింపులు జరిపాక క్రాస్ సబ్సిడీలను నియంత్రించేందుకు కొత్త విద్యుత్ టారీఫ్‌ను తీసుకొస్తాం’అని కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది.
ఒప్పందం అమలు చేయకుంటే అరెస్టు...
విద్యుత్ ఒప్పందాల అమలు పర్యవేక్షణకు ప్రతిపాదించిన ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీని కేంద్ర విద్యుత్ శాఖ సమర్థించుకుంది. సివిల్ కోర్టు తరహాలో తమ ఆదేశాలను అమలు చేయించే అధికారం కేంద్ర, రాష్ట్రాల ఈఆర్సీలకు లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థల మధ్య జరిగే విద్యుత్ క్రయవిక్రయాలు, సరఫరాకు సంబంధించిన ఒప్పందాల అమలును పర్యవేక్షించే క్రమంలో ఆస్తులను అటాచ్ చేయడం, విక్రయించడం, అరెస్టు చేయడం, జైలు శిక్షలు విధించడం వంటి అధికారాలు రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేసే ఈ అథారిటీకి ఉంటాయని ప్రకటించింది. విద్యుత్ రంగంలో పెట్టుబడులను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది.
నాణ్యత కోసమే ప్రైవేటీకరణ...
విద్యుత్ రంగం ప్రైవేటీకరణలో భాగంగా ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సీ, డిస్ట్రిబ్యూషన్ ఫ్రాంచైజీ విధానాన్ని కూడా కేంద్ర విద్యుత్ శాఖ సమర్థించుకుంది. డిస్కంలు తమ పరిధిలోని కొంత ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసే అధికారాన్ని సబ్ లైసెన్సీల పేరుతో ఎవరైనా వ్యక్తికి ఈఆర్సీ అనుమతితో అప్పగించవచ్చని తెలియజేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న చట్టం ప్రకారం ఫ్రాంచైజీలను చాలా రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారని గుర్తుచేసింది. విద్యుత్ సరఫరాలో నాణ్యత కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది.
ఎల్డీసీలకు చెల్లింపుల పర్యవేక్షణ అధికారం సబబే..
విద్యుదుత్పత్తి, సరఫరా (జెన్‌కో, ట్రాన్స్‌కో) కంపెనీలకు డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలు 2019 మార్చి నాటికి రూ. 2.26 కోట్లకు పెరిగాయని, ఈ నేపథ్యంలో విద్యుత్ షెడ్యూలింగ్‌కు ముందే ఒప్పందం ప్రకారం డిస్కంలు.. జెన్‌కో, ట్రాన్స్‌కోలకు చెల్లింపులు జరిపేలా పర్యవేక్షించే అధికారాన్ని లోడ్ డిస్పాచ్ సెంటర్ల (ఎల్డీసీ)కు కల్పించామని కేంద్ర విద్యుత్ శాఖ సమర్థించుకుంది. డిస్కంలు సకాలంలో చెల్లించడంలో విఫలమవుతుండటంతో జెన్‌కో, ట్రాన్స్‌కోలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, దేశ విద్యుత్ రంగం కుప్పకూలే ప్రమాదం ఉండటంతోనే చెల్లింపులకు భద్రత కల్పించే అధికారాన్ని ఎల్డీసీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment