ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ (94) కన్నుమూశారు. విశ్వం ఎలా ఉద్భవించిందనేది వివరించడంలో సహాయపడే ‘హిగ్స్ బాసన్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పీటర్ హిగ్స్ అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 8న తన ఇంట్లో మరణించినట్లు స్కాటిష్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. హిగ్స్ బాసాన్ సిద్ధాంతానికి బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఇంగ్లెర్ట్‌తో కలిసి హిగ్స్ నోబెల్ అవార్డు అందుకున్నారు. యాభై ఏళ్లుగా స్కాటిష్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హిగ్స్ మరణంతో భౌతిక శాస్త్ర ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయిందనడంలో సందేహం లేదు.
హిగ్స్ గొప్ప అధ్యాపకుడని, యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాత అని స్కాటిష్ యూనివర్సిటీ పేర్కొంది. హిగ్స్ మహనీయుడని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీటర్ మాథిసన్ అన్నారు. అతని దార్శనికత, ఊహా ప్రపంచం మన విజ్ఞానాన్ని సుసంపన్నం చేశాయని, వేలాది మంది శాస్త్రవేత్తలు అతని రచనల నుంచి ప్రేరణ పొందారని పేర్కొన్నారు.
హిగ్స్ బాసన్ సిద్ధాంతం అంటే ఏమిటి?
సుమారు 1300 కోట్ల ఏళ్ల క్రితం ఓ మహా విస్ఫోటంతో ఈ విశ్వం మొత్తం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు చాలామంది అంగీకరించే సిద్ధాంతం. అయితే ఈ మహా విస్ఫోటం కచ్చితంగా ఎలా జరగింది? అణువులు, పరమాణువులు ఎలా పుట్టుకొచ్చాయి? ఆ తరువాతి క్రమంలో నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పాడ్డాయి అన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశం. 1964లో పీటర్ హిగ్స్ మరో ఐదుగురు శాస్త్రవేత్తలతో కలిసి విశ్వ ఆవిర్బావ క్రమానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కణాలన్నింటికీ ద్రవ్యరాశిని సమకూర్చే కణం ఒకటి ఉందని ఆయన ప్రతిపాదించారు. విశ్వవ్యాప్తమైన ఒక క్షేత్రంలో (హిగ్స్ ఫీల్డ్)లో కదులుతూ ఈ బోసాన్ ఇతర కణాలకు ద్రవ్యరాశిని అందిస్తుందన్న ప్రతిపాదనపై హిగ్స్‌తోపాటు అనేక ఇతర శాస్త్రవేత్తలూ చాలా పరిశోధనలు చేశారు. అయినప్పటికీ ఈ కణం ఉనికి స్పష్టం కాకపోవడంతో దీన్ని ‘దైవ కణం’ అని పిలిచేవారు కూడా.
ఈ దైవ కణం ఉనికిని గుర్తించేందుకు స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఓ భారీ పరిశోధన ఒకటి చేపట్టారు శాస్త్రవేత్తలు. వందల కోట్ల రూపాయల ఖర్చుతో భూగర్భంలో నిర్మించిన ప్రయోగశాలల ద్వారా అసలు ఈ హిగ్స్ బాసాన్ కణం ఉందా? లేదా? నిర్ధారించేందుకు ప్రయత్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫ్రిజరేటర్ కూడా ఉన్న ఈ ప్రయోగశాలలో రెండు ఫొటాన్లను కాంతి వేగంతో పరుగెత్తించి ఢీకొట్టించడం ఫలితంగా అతిసూక్ష్మ సమయంపాటు ఏర్పడే మహా విస్ఫోట కాలం నాటి పరిస్థితులను విశ్లేషించడం ద్వారా బాసాన్ ఉనికిని 2012లో నిర్ధారించగలిగారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment