higgs boson
-
‘దైవ కణం’ ఉందన్న శాస్త్రవేత్త... కన్నుమూశాడు!
ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ (94) కన్నుమూశారు. విశ్వం ఎలా ఉద్భవించిందనేది వివరించడంలో సహాయపడే ‘హిగ్స్ బాసన్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పీటర్ హిగ్స్ అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 8న తన ఇంట్లో మరణించినట్లు స్కాటిష్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. హిగ్స్ బాసాన్ సిద్ధాంతానికి బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఇంగ్లెర్ట్‌తో కలిసి హిగ్స్ నోబెల్ అవార్డు అందుకున్నారు. యాభై ఏళ్లుగా స్కాటిష్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హిగ్స్ మరణంతో భౌతిక శాస్త్ర ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయిందనడంలో సందేహం లేదు. హిగ్స్ గొప్ప అధ్యాపకుడని, యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాత అని స్కాటిష్ యూనివర్సిటీ పేర్కొంది. హిగ్స్ మహనీయుడని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీటర్ మాథిసన్ అన్నారు. అతని దార్శనికత, ఊహా ప్రపంచం మన విజ్ఞానాన్ని సుసంపన్నం చేశాయని, వేలాది మంది శాస్త్రవేత్తలు అతని రచనల నుంచి ప్రేరణ పొందారని పేర్కొన్నారు. హిగ్స్ బాసన్ సిద్ధాంతం అంటే ఏమిటి? సుమారు 1300 కోట్ల ఏళ్ల క్రితం ఓ మహా విస్ఫోటంతో ఈ విశ్వం మొత్తం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు చాలామంది అంగీకరించే సిద్ధాంతం. అయితే ఈ మహా విస్ఫోటం కచ్చితంగా ఎలా జరగింది? అణువులు, పరమాణువులు ఎలా పుట్టుకొచ్చాయి? ఆ తరువాతి క్రమంలో నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పాడ్డాయి అన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశం. 1964లో పీటర్ హిగ్స్ మరో ఐదుగురు శాస్త్రవేత్తలతో కలిసి విశ్వ ఆవిర్బావ క్రమానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కణాలన్నింటికీ ద్రవ్యరాశిని సమకూర్చే కణం ఒకటి ఉందని ఆయన ప్రతిపాదించారు. విశ్వవ్యాప్తమైన ఒక క్షేత్రంలో (హిగ్స్ ఫీల్డ్)లో కదులుతూ ఈ బోసాన్ ఇతర కణాలకు ద్రవ్యరాశిని అందిస్తుందన్న ప్రతిపాదనపై హిగ్స్తోపాటు అనేక ఇతర శాస్త్రవేత్తలూ చాలా పరిశోధనలు చేశారు. అయినప్పటికీ ఈ కణం ఉనికి స్పష్టం కాకపోవడంతో దీన్ని ‘దైవ కణం’ అని పిలిచేవారు కూడా. ఈ దైవ కణం ఉనికిని గుర్తించేందుకు స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఓ భారీ పరిశోధన ఒకటి చేపట్టారు శాస్త్రవేత్తలు. వందల కోట్ల రూపాయల ఖర్చుతో భూగర్భంలో నిర్మించిన ప్రయోగశాలల ద్వారా అసలు ఈ హిగ్స్ బాసాన్ కణం ఉందా? లేదా? నిర్ధారించేందుకు ప్రయత్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫ్రిజరేటర్ కూడా ఉన్న ఈ ప్రయోగశాలలో రెండు ఫొటాన్లను కాంతి వేగంతో పరుగెత్తించి ఢీకొట్టించడం ఫలితంగా అతిసూక్ష్మ సమయంపాటు ఏర్పడే మహా విస్ఫోట కాలం నాటి పరిస్థితులను విశ్లేషించడం ద్వారా బాసాన్ ఉనికిని 2012లో నిర్ధారించగలిగారు కూడా. -
భారత విద్యార్థుల కోసం విశ్వ రహస్యాలు
న్యూఢిల్లీ: బిగ్‌బ్యాంగ్, హిగ్స్ బోసన్ వంటి విశ్వరహస్యాలను శాస్త్రవేత్తలు భారతీయ విద్యార్థులకు వివరిస్తున్నారు. ఇందుకు లైఫ్ ల్యాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నొయిడాకు చెందిన శివ్ నాడర్ స్కూల్... స్విట్జర్లాండ్– జెనివాలోని ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్ (సెర్న్) సంస్థతో కలసి పని చేస్తోంది. ‘హై ఎనర్జీ ఫిజిక్స్’లో చేసిన పరిశోధనలకుగాను అర్చనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘విశ్వ రహస్యాలు’అనే అంశంపై 2 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెర్న్ శాస్త్రవేత్త అర్చనాశర్మ మాట్లాడుతూ.. సీఈఆర్ఎన్లో భారత్ అసోసియేట్ మెంబర్ కావడం వల్ల ఇక్కడ నేర్చుకోవడానికి విద్యార్థులకు ఎన్నో అవకాశాలున్నాయన్నారు. సమావేశాల్లో మరో ప్రధానాంశం సీనియర్ శాస్త్రవేత్త, హిగ్స్ కన్వీనర్ డాక్టర్ అల్బెర్ట్ డీ రాక్తో విద్యార్థుల ఇంటరాక్టివ్ సేషన్. విశ్వం, ఫిజిక్స్ గురించి మరింత స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ఈ కార్యక్రమాలు సాయపడతాయని శివ్ నాడర్ స్కూల్లో 12వ గ్రేడ్ విద్యార్థి ఆర్యాన్ శంకర్‌మిశ్రా చెప్పారు. -
వర్దీకి ‘ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు
లండన్: విశ్వంలో ప్రతి పదార్థానికీ ద్రవ్యరాశిని ఇస్తుందని భావిస్తున్న దైవకణం (హిగ్స్ బోసాన్) ఉనికిని కనిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రవాస భారత శాస్త్రవేత్త తేజీందర్ వర్దీ ప్రతిష్టాత్మక ‘ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నారు. లండన్‌లో ‘ఏసియన్ అచీవర్స్ అవార్డ్స్ 2014’ కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. -
దైవకణం జోలికెళితే వినాశనమే!
విశ్వంలో అన్ని రకాల పదార్థాలకూ ద్రవ్యరాశి, ఆకారం, పరిమాణాలు సమకూరేందుకు కారణమని భావిస్తున్న దైవకణం(హిగ్స్ బోసాన్) జోలికి వెళితే విశ్వ వినాశనం తప్పదట. అత్యధిక శక్తి స్థాయిల వద్ద దైవకణం స్థిరత్వాన్ని కోల్పోతుందట. అదే గనక జరిగితే విశ్వం, కాలం అకస్మాత్తుగా ధ్వంసం అయిపోతాయని బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. ప్రముఖ శాస్త్రవేత్తలు, ఖగోళ పరిశోధకుల ప్రసంగాల సంకలనంతో ప్రచురించిన ‘స్టార్మస్’ అనే పుస్తకం ముందుమాటలో హాకింగ్ ఈ మేరకు పలు విషయాలు వివరించారు. వంద బిలియన్ గిగా-ఎలక్ట్రాన్ వోల్టులకు మించిన శక్తి వద్ద దైవకణం అస్థిరంగా మారుతుందని, ఫలితంగా గాలిబుడగలా నిరంతరం కాంతివేగంతో విస్తరిస్తున్న విశ్వంలో శూన్యం లోపించి ఆ బుడగ ధ్వంసం అవుతుందని హాకింగ్ పేర్కొన్నారు. కాగా, స్విట్జర్లాండ్ సరిహద్దులో భూగర్భంలో భారీ గొట్టాలతో నిర్మించిన లార్జ్ హ్యాడ్రన్ కొల్లాయిడర్(ఎల్‌హెచ్‌సీ) ప్రయోగంలో ప్రొటాన్లను కాంతివేగంతో ఢీకొట్టించిన సెర్న్ శాస్త్రవేత్తల బృందం 2012లో దైవకణం ఉనికిని కనుగొంది. దైవకణ ంపై పరిశోధనల్లో విశేష కృషి చేసిన భారతీయ భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ స్మారకార్థం దీనికి బోసాన్‌గా నామకరణం చేశారు. -
దైవకణ శోధకులకు నోబెల్
బ్రిటన్, బెల్జియం భౌతిక శాస్త్రవేత్తలకు అవార్డు స్టాక్‌హోం: విశ్వంలో అన్ని రకాల పదార్థాలకూ ద్రవ్యరాశిని సమకూరుస్తోందని భావిస్తున్న దైవకణం (హిగ్స్ బోసాన్)పై కీలక పరిశోధనలు చేసినందుకుగాను ఈ ఏడాది ఇద్దరు శాస్త్రవేత్తలను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. బ్రిటన్‌కు చెందిన పీటర్ హిగ్స్(84), బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఎంగ్లెర్ట్(80) ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారని మంగళవారం నోబెల్ జ్యూరీ ప్రకటించింది. దైవకణం ఉనికి గురించి సుమారు ఆరు దశాబ్దాలుగా సిద్ధాంతాలు, అంచనాలు ఉన్నప్పటికీ.. అది నిజంగా ఉనికిలో ఉన్నట్లు గతేడాదే లార్జ్ హ్యాడ్రన్ కొల్లాయిడర్ ప్రయోగం ద్వారా ‘సెర్న్’ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిశోధనకే ఈసారి భౌతికశాస్త్ర నోబెల్ వస్తుందన్న విశ్లేషకుల అంచనాలు నిజమయ్యాయి. ‘దైవకణాలు లేనిదే విశ్వంలో అణువులు, మనం కూడా లేం. విశ్వమంతా శూన్యంగా కనిపిస్తున్నప్పటికీ అందులో ఒక అదృశ్య క్షేత్రం ఆవరించి ఉంది. ఆ క్షేత్రంలో హిగ్స్బోసాన్లు ఉన్నందువల్లే అన్ని పదార్థాలకూ ద్రవ్యరాశి సమకూరుతోంది. ఈ దైవకణాల ఉనికిని కనుగొనే దిశగా వీరు చేసిన పరిశోధనలు కీలకంగా తోడ్పడ్డాయి’ అని నోబెల్ జ్యూరీ తన ప్రకటనలో పేర్కొంది. అత్యున్నతమైన ఈ అవార్డు తనకు దక్కడం పట్ల హిగ్స్ ఆనందం వ్యక్తంచేశారు. దైవకణ పరిశోధనకు ఈ అవార్డు దక్కడం వల్ల విశ్వానికి సంబంధించిన ప్రామాణిక అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. మరో శాస్త్రవేత్త ఎంగ్లెర్ట్ కూడా నోబెల్ దక్కడంపై హర్షం వ్యక్తంచేశారు. వీరికి డిసెంబర్ 10న స్టాక్‌హోంలో బహుమతి ప్రదానం చేస్తారు. అవార్డు కింద ఇద్దరూ 8 మిలియన్ స్వీడిష్ క్రోనార్ల నగదు(రూ.7.73 కోట్లు)ను పంచుకోనున్నారు. పీటర్‌హిగ్స్ ఎడిన్‌బరో యూనివర్సిటీలో, ఎంగ్లెర్ట్ యూనివర్సైట్ లిబర్ డీ బ్రక్సెల్స్‌లో గౌరవ ప్రొఫెసర్లుగా ఉన్నారు. విశ్వంలో కణా లు ద్రవ్యరాశిని ఎలా పొందుతున్నాయన్న దానిపై వీరితోసహా ఆరుగురు శాస్త్రవేత్తలు 1964లో సిద్ధాంతం ప్రతిపాదించారు. హిగ్స్ బోసాన్ అంటే...: లియోన్ లాడర్మ్యాన్ అనే భౌతికశాస్త్రవేత్త 1993లో ‘ది గాడ్ పార్టికల్.. ఇఫ్ ది యూనివర్స్ ఈజ్ ద ఆన్సర్ వాటీజ్ ద క్వశ్చన్’ అనే పుస్తకంలో హిగ్స్ బోసాన్ పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు. ఇందులో హిగ్స్ అంటే విశ్వంలో అదృశ్యంగా ఉన్న క్షేత్రం కాగా, బోసాన్ అంటే అన్ని ప్రాథమిక కణాలకు ద్రవ్యరాశిని ఇచ్చే కణం. వీటిలో పీటర్ హిగ్స్ పేరు మీద హిగ్స్, కణభౌతిక శాస్త్రంలో కీలక ఆవిష్కరణలు చేసిన భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జ్ఞాపకార్థం బోసాన్ అనే పదాలను తీసుకున్నారు.