దైవకణ శోధకులకు నోబెల్
బ్రిటన్, బెల్జియం భౌతిక శాస్త్రవేత్తలకు అవార్డు
స్టాక్‌హోం: విశ్వంలో అన్ని రకాల పదార్థాలకూ ద్రవ్యరాశిని సమకూరుస్తోందని భావిస్తున్న దైవకణం (హిగ్స్ బోసాన్)పై కీలక పరిశోధనలు చేసినందుకుగాను ఈ ఏడాది ఇద్దరు శాస్త్రవేత్తలను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. బ్రిటన్‌కు చెందిన పీటర్ హిగ్స్(84), బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఎంగ్లెర్ట్(80) ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారని మంగళవారం నోబెల్ జ్యూరీ ప్రకటించింది. దైవకణం ఉనికి గురించి సుమారు ఆరు దశాబ్దాలుగా సిద్ధాంతాలు, అంచనాలు ఉన్నప్పటికీ.. అది నిజంగా ఉనికిలో ఉన్నట్లు గతేడాదే లార్జ్ హ్యాడ్రన్ కొల్లాయిడర్ ప్రయోగం ద్వారా ‘సెర్న్’ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిశోధనకే ఈసారి భౌతికశాస్త్ర నోబెల్ వస్తుందన్న విశ్లేషకుల అంచనాలు నిజమయ్యాయి.
‘దైవకణాలు లేనిదే విశ్వంలో అణువులు, మనం కూడా లేం. విశ్వమంతా శూన్యంగా కనిపిస్తున్నప్పటికీ అందులో ఒక అదృశ్య క్షేత్రం ఆవరించి ఉంది. ఆ క్షేత్రంలో హిగ్స్‌బోసాన్‌లు ఉన్నందువల్లే అన్ని పదార్థాలకూ ద్రవ్యరాశి సమకూరుతోంది. ఈ దైవకణాల ఉనికిని కనుగొనే దిశగా వీరు చేసిన పరిశోధనలు కీలకంగా తోడ్పడ్డాయి’ అని నోబెల్ జ్యూరీ తన ప్రకటనలో పేర్కొంది. అత్యున్నతమైన ఈ అవార్డు తనకు దక్కడం పట్ల హిగ్స్ ఆనందం వ్యక్తంచేశారు. దైవకణ పరిశోధనకు ఈ అవార్డు దక్కడం వల్ల విశ్వానికి సంబంధించిన ప్రామాణిక అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. మరో శాస్త్రవేత్త ఎంగ్లెర్ట్ కూడా నోబెల్ దక్కడంపై హర్షం వ్యక్తంచేశారు. వీరికి డిసెంబర్ 10న స్టాక్‌హోంలో బహుమతి ప్రదానం చేస్తారు. అవార్డు కింద ఇద్దరూ 8 మిలియన్ స్వీడిష్ క్రోనార్‌ల నగదు(రూ.7.73 కోట్లు)ను పంచుకోనున్నారు. పీటర్‌హిగ్స్ ఎడిన్‌బరో యూనివర్సిటీలో, ఎంగ్లెర్ట్ యూనివర్సైట్ లిబర్ డీ బ్రక్సెల్స్‌లో గౌరవ ప్రొఫెసర్లుగా ఉన్నారు. విశ్వంలో కణా లు ద్రవ్యరాశిని ఎలా పొందుతున్నాయన్న దానిపై వీరితోసహా ఆరుగురు శాస్త్రవేత్తలు 1964లో సిద్ధాంతం ప్రతిపాదించారు.
హిగ్స్ బోసాన్ అంటే...: లియోన్ లాడర్‌మ్యాన్ అనే భౌతికశాస్త్రవేత్త 1993లో ‘ది గాడ్ పార్టికల్.. ఇఫ్ ది యూనివర్స్ ఈజ్ ద ఆన్సర్ వాటీజ్ ద క్వశ్చన్’ అనే పుస్తకంలో హిగ్స్ బోసాన్ పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు. ఇందులో హిగ్స్ అంటే విశ్వంలో అదృశ్యంగా ఉన్న క్షేత్రం కాగా, బోసాన్ అంటే అన్ని ప్రాథమిక కణాలకు ద్రవ్యరాశిని ఇచ్చే కణం. వీటిలో పీటర్ హిగ్స్ పేరు మీద హిగ్స్, కణభౌతిక శాస్త్రంలో కీలక ఆవిష్కరణలు చేసిన భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జ్ఞాపకార్థం బోసాన్ అనే పదాలను తీసుకున్నారు.