ప్రోటీన్లపై పరిశోధనకు నోబెల్‌ | Chemistry Nobel Prize 2024: three Scientists for Protein Design And Structure Prediction | Sakshi
Sakshi News home page

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం

Published Wed, Oct 9 2024 3:56 PM | Last Updated on Thu, Oct 10 2024 4:30 AM

Chemistry Nobel Prize 2024: three Scientists for Protein Design And Structure Prediction

డేవిడ్‌ బెకర్, డెమిస్‌ హసాబిస్, జాన్‌ జంపర్‌లకు రసాయన నోబెల్‌

స్టాక్‌హోమ్‌: మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూలస్తంభాలైన ప్రోటీన్ల డిజైన్లు, వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్‌ అవార్డ్‌ వరించింది. ప్రోటీన్లపై శోధనకుగాను శాస్త్రవేత్తలు డేవిడ్‌ బెకర్, డెమిస్‌ హసాబిస్, జాన్‌ జంపర్‌లకు 2024 ఏడాదికి కెమిస్ట్రీ నోబెల్‌ ఇస్తున్నట్లు కెమిస్ట్రీ నోబెల్‌ కమిటీ సారథి హెనర్‌ లింక్‌ బుధవారం ప్రకటించారు. పురస్కారంతోపాటు ఇచ్చే దాదాప రూ.8.4 కోట్ల నగదు బహుమతిలో సగం మొత్తాన్ని బేకర్‌కు అందజేయనున్నారు. మిగతా సగాన్ని హసాబిస్, జాన్‌ జంపర్‌లకు సమంగా పంచనున్నారు.  

జీవరసాయన శాస్త్రంలో గొప్ప మలుపు 
‘‘అమైనో ఆమ్లాల క్రమానుగతి, ప్రోటీన్ల నిర్మాణం మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వీరి పరిశోధన రసాయనరంగంలో ముఖ్యంగా జీవరసాయన శాస్త్రంలో మేలి మలుపు. ఈ ముందడుగుకు కారకులైన వారికి నోబెల్‌ దక్కాల్సిందే’’ అని నోబెల్‌ కమిటీ కొనియాడింది. అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో డేవిడ్‌ బేకర్‌ పనిచేస్తున్నారు. 

హసాబిస్, జాన్‌ జంపర్‌ లండన్‌లోని గూగుల్‌ సంస్థకు చెందిన డీప్‌మైండ్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ‘‘బేకర్‌ 2003లో ఒక కొత్త ప్రోటీన్‌ను డిజైన్‌చేశారు. అతని పరిశోధనా బృందం ఇలా ఒకదాని తర్వాత మరొకటి కొత్త ప్రోటీన్లను సృష్టిస్తూనే ఉంది. వాటిల్లో కొన్నింటిని ప్రస్తుతం ఫార్మాసూటికల్స్, టీకాలు, నానో మెటీరియల్స్, అతి సూక్ష్మ సెన్సార్లలో వినియోగిస్తున్నారు. వీళ్ల బృందం సృష్టించిన సాంకేతికతతో వెలువడిన ఎన్నో కొత్త డిజైన్ల ప్రోటీన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి’’అని నోబెల్‌ కమిటీలో ప్రొఫెసర్‌ జొహాన్‌ క్విస్ట్‌ శ్లాఘించారు.  
 

 

నిర్మాణాలను అంచనా వేసే ఏఐ మోడల్‌ 
డెమిస్‌ హసాబిస్, జంపర్‌లు సంయుక్తంగా ప్రోటీన్ల నిర్మాణాలను ఊహించగల కృత్రిమమేధ నమూనాను రూపొందించారు. దీని సాయంతో ఇప్పటిదాకా కనుగొన్న 20 కోట్ల ప్రోటీన్ల నిర్మాణాలను ముందే అంచనావేయొచ్చు.
 

చదవండి: ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్‌ నోబెల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement