దైవకణం జోలికెళితే వినాశనమే!
విశ్వంలో అన్ని రకాల పదార్థాలకూ ద్రవ్యరాశి, ఆకారం, పరిమాణాలు సమకూరేందుకు కారణమని భావిస్తున్న దైవకణం(హిగ్స్ బోసాన్) జోలికి వెళితే విశ్వ వినాశనం తప్పదట. అత్యధిక శక్తి స్థాయిల వద్ద దైవకణం స్థిరత్వాన్ని కోల్పోతుందట. అదే గనక జరిగితే విశ్వం, కాలం అకస్మాత్తుగా ధ్వంసం అయిపోతాయని బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. ప్రముఖ శాస్త్రవేత్తలు, ఖగోళ పరిశోధకుల ప్రసంగాల సంకలనంతో ప్రచురించిన ‘స్టార్మస్’ అనే పుస్తకం ముందుమాటలో హాకింగ్ ఈ మేరకు పలు విషయాలు వివరించారు.
వంద బిలియన్ గిగా-ఎలక్ట్రాన్ వోల్టులకు మించిన శక్తి వద్ద దైవకణం అస్థిరంగా మారుతుందని, ఫలితంగా గాలిబుడగలా నిరంతరం కాంతివేగంతో విస్తరిస్తున్న విశ్వంలో శూన్యం లోపించి ఆ బుడగ ధ్వంసం అవుతుందని హాకింగ్ పేర్కొన్నారు. కాగా, స్విట్జర్లాండ్ సరిహద్దులో భూగర్భంలో భారీ గొట్టాలతో నిర్మించిన లార్జ్ హ్యాడ్రన్ కొల్లాయిడర్(ఎల్‌హెచ్‌సీ) ప్రయోగంలో ప్రొటాన్లను కాంతివేగంతో ఢీకొట్టించిన సెర్న్ శాస్త్రవేత్తల బృందం 2012లో దైవకణం ఉనికిని కనుగొంది. దైవకణ ంపై పరిశోధనల్లో విశేష కృషి చేసిన భారతీయ భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ స్మారకార్థం దీనికి బోసాన్‌గా నామకరణం చేశారు.