డియర్ ఐన్‌స్టీన్ సార్.. నేనెవరో మీకు తెలీదు
అల్బర్ట్ ఐన్‌స్టీన్.. ఓ ప్రపంచం మేధావి. అలాంటిది అపరిచితుడిగా పరిచయం చేసుకుంటూనే ఆయన నుంచి ‘శెభాష్’ అనిపించుకున్నాడు భారత్‌కు చెందిన యువ శాస్త్రవేత్త. ఆయనే సత్యేంద్ర నాథ్ బోస్. భౌతిక శాస్త్రం(ఫిజిక్స్)లో వీళ్లిద్దరి కృషికి బోస్-ఐన్‌స్టీన్ గణాంకాలుగా గుర్తింపు దక్కించుకుంది. ఆ గుర్తింపు దక్కి నేటికి 98 ఏళ్లు అవుతుంది.
1924, జూన్ 4వ తేదీన జర్మనీ భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్.. భారత్‌కు చెందిన సత్యేంద్రనాథ్ బోస్ కృషిని గుర్తించారు. క్వాంటమ్ మెకానిక్స్‌లో బోస్ కనిపెట్టిన థియరీతో ఏకీభవించారు ఐన్‌స్టీన్. అంతేకాదు స్వయంగా ఆయనే జర్మన్లోకి అనువదించి మరీ.. బోస్ పేరిట వ్యాసం ప్రచురించారు. భౌతిక శాస్త్రంలో అరుదైన ఈ ఘట్టానికి 98 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. గూగుల్ సత్యేంద్రనాథ్ బోస్ గౌరవార్థం డూడుల్‌ను రిలీజ్ చేసింది.
‘‘డియర్ సర్, మీ పరిశీలన, అభిప్రాయం కోసం నేను మీకు ఈ కథనాన్ని పంపించాను. క్లాసికల్ ఎలెక్ట్రోడైనమిక్స్ నుండి స్వతంత్రంగా ప్లాంక్ నియమం లోని గుణకం 8π ν2/c3ను తగ్గించడానికి నేను ప్రయత్నించాను. దశ-అంతరాళంలో అంతిమ ప్రాథమిక ప్రాంతంలో కంటెంట్ h3 ఉందని మాత్రమే ఊహిస్తారు. ఈ పరిశోధనా పత్రాన్ని అనువదించడానికి నాకు తగినంత జర్మన్ భాష తెలియదు. ఈ పత్రం ప్రచురణ విలువైనదని మీరు అనుకుంటే, మీరు దాని ప్రచురణను "జైట్స్క్రిఫ్ట్ ఫర్ ఫిజిక్" లో వచ్చేటట్లు చేస్తే నేను కృతజ్ఞుడను.
నేను ఎవరో మీకు తెలియదు. అలాంటి అభ్యర్థన చేయడంలో నాకు ఏమాత్రం సంకోచం లేదు. ఎందుకంటే మీ రచనల ద్వారా మీ బోధనల ద్వారా లాభం పొందిన మేమంతా మీ విద్యార్థులం. సాపేక్షతపై మీ పత్రాలను ఆంగ్లంలో అనువదించడానికి కలకత్తాకు చెందిన ఎవరైనా మీ అనుమతి కోరినట్లు మీకు ఇంకా గుర్తుందో,లేదో నాకు తెలియదు. మీరు ఆ అభ్యర్థనను అంగీకరించారు. అప్పటి నుండి ఆ పుస్తకం ప్రచురించబడింది. సాధారణీకరించిన సాపేక్షతపై మీ పరిశోధనా పత్రాలను నేనే అనువదించాను. మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి నేను ఆత్రుతగా ఉన్నాను’’ అంటూ లేఖ పంపారు సత్యేంద్రనాథ్ బోస్.
► ఇండియన్ ఫిజిక్స్ త్రిమూర్తులుగా.. సర్ సీవీరామన్, మేఘనాథ్ సాహా, సత్యేంధ్రనాథ్ బోస్‌లకు పేరుంది.
► ఫిజిక్స్ కణ భౌతికశాస్త్రంలో వినిపించే హిల్స్ బోసన్(దైవకణాలు) అనే పదంలో.. బోసాన్ అంటే ఏంటో కాదు.. బోస్ పేరు మీదే బ్రిటిష్ సైంటిస్ట్ పాల్ డిరాక్ అలా నామకరణం చేశారు.
► బోస్-ఐన్‌స్టీన్ స్టాటిక్స్కుగానూ.. 1956లో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఫిజిక్స్‌పై ఆయన పరిశోధలను, రచనలను నోబెల్ కమిటీ పట్టించుకోలేదు.
► కానీ, బోస్ ప్రతిపాదించిన బోసన్, బోస్-ఐన్‌స్టీన్ థియరీల ఆధారంగా చేపట్టిన పరిశోధనలకు ఏడు నోబెల్ బహుమతులు వచ్చాయంటే ఆయన కృషి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
► 1954లో భారత ప్రభుత్వం సత్యేంద్రనాథ్ బోస్‌ను పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
► పలు యూనివర్సిటీలలో బోధకుడిగా, పరిశోధనా కమిటిలలోనూ ఆయన పని చేశారు.
► సత్యేంద్రనాథ్బోస్.. పశ్చిమ బెంగాల్ కోల్‌కతా(కలకత్తా)లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు.
► ప్రఫుల్ల చంద్రరాయ్, జగదీశ్చంద్రబోస్లు ఈయనకు గురువులు.
► లూయిస్ డి బ్రోగ్లీ, మేరీ క్యూరీ , ఐన్‌స్టీన్‌లతో కలిసి పని చేసే అవకాశం దక్కింది ఈయనకు.
► అనువర్తిత గణితశాస్త్రంలో ఎమ్మెస్సీ కలకత్తా యూనివర్సిటీ నుంచి పూర్తి చేశాడాయన.
► 1974 ఫిబ్రవరి 4వ తేదీన 80 ఏళ్ల వయసులో కలకత్తాలోనే ఆయన కన్నుమూశారు.
► కేవలం ఫిజిక్స్ మాత్రమేకాదు.. మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆర్ట్స్‌లోనూ ఆయన ఎంతో కృషి చేశారు.
► నోబెల్ దక్కకపోతేనేం.. ఈ మేధావి మేధస్సును గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కొనియాడారు. మాతృదేశం గుర్తించింది. నేడు భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తున్న పరిశోధకులు.. తమ పరిశోధనలతో ఆయన కృషిని నిరంతరం గుర్తు చేస్తూ ఉన్నారు.