Srishti Bakshi
-
Women of My Billion: కలిసి నడిచే గొంతులు
కన్యాకుమారి నుంచి శ్రీ నగర్ వరకూ 260 రోజుల పాటు 3,800 కిలోమీటర్లు దేశమంతా నడిచింది సృష్టి బక్షి. ఎందుకు? స్త్రీలపై జరిగే దురాగతాలపై చైతన్యం కలిగించడానికే కాదు స్త్రీల శక్తియుక్తులను వారికి గుర్తు చేయడానికి. ఆ సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడు ‘విమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతోంది. నటి ప్రియాంకా చోప్రా నిర్మాత.తాను నడిచి చేరుకున్న ఊరిలో ఏదైనా స్కూల్లోగాని, పబ్లిక్ హాల్లో కాని మహిళలను పోగు చేస్తుంది సృష్టి బక్షి. ‘అందరూ కళ్లు మూసుకుని దీర్ఘంగా శ్వాస పీల్చి వదలండి’ అంటుంది. ‘ఇప్పుడు మీ కళ్ల ఎదురుగా మీ 11 ఏళ్ల వయసున్న మీ రూపాన్ని గుర్తు చేసుకోండి. ఆ 11 ఏళ్ల అమ్మాయిలో ఉండే విశ్వాసం, ఆనందం ఎన్ని విధాలుగా ధ్వంసమైందో గుర్తుకు తెచ్చుకోండి. ఆ అమ్మాయికి సారీ చెప్పండి. ఎందుకంటే ఆ విధ్వంసమంతా మీ అనుమతితోనే జరిగింది’ అంటుంది. చాలామంది ఆ మాటలకు ఏడుస్తారు. గడిచివచ్చిన జీవితాన్ని తలుచుకుని బాధలో మునిగిపోతారు. అప్పుడు సృష్టి బక్షి ఒక బోర్డు మీద స్త్రీ శరీర నిర్మాణం గీచి ‘ఇదిగో ఈ అవయవాల రీత్యా మీరు మగవారి కంటే భిన్నంగా పుట్టారు. ప్రకృతి ఈ అవయవాలను మీకు ఇస్తే సమాజం అదుపు, ఆంక్షలు, వివక్ష, కుటుంబ హింస, ఆర్థిక బానిసత్వం, ఇంటి పని... ఇన్ని ఇచ్చింది. మనం ఎందుకు మగవారితో సమానం కాము?’ అని ప్రశ్నిస్తుంది.మార్పు కోసంసృష్టి బక్షిది ముంబై. ఆమె హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుకుంది. హాంగ్‌కాంగ్‌లో మార్కెటింగ్‌లో పెద్ద సంస్థల్లో పని చేసింది. తండ్రి ఆర్మీలో పని చేయడం వల్ల ఆమెకు దేశం పట్ల ఒక ఉద్వేగం ఉండేది. అయితే తాను ప్రేమించే దేశంలో స్త్రీలపై జరిగే అన్యాయాలను చూసి చలించి పోయేది. ‘2017లో హాంకాంగ్‌లో సిటీ బస్ ఎక్కి ఇంటికి వెళుతున్నప్పుడు నా ఫోన్లో ఇండియాలో తల్లీ కూతుళ్లపై తండ్రి ఎదుటే అత్యాచారం చేసి చంపేశారన్న వార్త చదివాను. చాలా నిస్పృహ కలిగింది. నాలాంటి వాళ్లు సౌకర్యంగా పడక్కుర్చీలో కూచుని చింతించడం సరికాదని రంగంలో దిగాలని అనుకున్నాను. అలా నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, ఇండియా వచ్చి దేశంలోని స్త్రీలందరితో మాట్లాడాలని 2018 మే నెలలో పాదయాత్ర ప్రారంభించాను’ అని చెప్పింది సృష్టి.రోజూ వేలాది మంది‘ఉమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో సృష్టి బక్షి మే 2018లో కన్యాకుమారి నుంచి పాదయాత్ర ప్రారంభించింది. ఈ యాత్ర రికార్డు అయ్యేలా టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. 260 రోజుల పాటు దాదాపు 4 వేల కిలోమీటర్ల పాటు సాగే ఈ యాత్రకు కోటి రూపాయలు ఖర్చవుతాయి. 50 లక్షలను క్రౌడ్ ఫండింగ్ ద్వారా పోగు చేసింది. ‘ఈ యాత్రలో స్త్రీల కలలు, ఆకాంక్షలు, వారి హక్కులు, సంఘర్షణలు. విజయాలు వినదలుచుకున్నాను. వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. నా సుదీర్ఘ యాత్రలో మన దేశంలో వరకట్నం ఇంకా పెద్ద సమస్యగా ఉందని అర్థమైంది. వరకట్నం స్త్రీలను మానసికంగా పురుషులతో సమానం అనుకోనివ్వడం లేదు. స్త్రీలను అసభ్యంగా తాకడం, హింసించడం, అణిచి పెట్టడం కొనసాగుతూనే ఉంది. ఒక దశలో నేను యాత్ర చేయలేననుకున్నాను. కాని ఆ మరుసటి రోజు నా మీటింగ్‌కు హాజరైన ఒక ఆశా వర్కర్– ‘‘రాత్రి నన్ను నా భర్త కొట్టాడు. నీ మాటలు విన్నాక ఇక ఇలాంటిది జరగనివ్వకూడదని నిశ్చయించుకున్నాను. నేను నా భర్తను నిలువరించడానికి నలుగురి సాయం తీసుకుంటాను’’ అని చెప్పింది. నా యాత్ర వల్ల జరుగుతున్న మేలు అర్థమయ్యాక కొనసాగాను’ అని తెలిపింది సృష్టి.డాక్యుమెంటరీ విడుదలసృష్టి చేసిన యాత్ర అంతా ‘విమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో డాక్యుమెంటరీగా రూపొందింది. మే 3 నుంచి అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీ మీద మంచి రివ్యూలు వస్తున్నాయి. ‘ఎందరో స్త్రీలు. వారి జీవితానుభవాలను ఈ డాక్యుమెంటరీలో పంచుకున్నారు. వారు సమస్యలు వారి తెచ్చుకున్నవి కాదు. వారికి తెచ్చిపెట్టినవి. అందుకే నటి ప్రియాంకా చోప్రా నా డాక్యుమెంటరీని చూసి తాను నిర్మాతగా మారి విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఒక స్త్రీగా, ఆడపిల్ల తల్లిగా ఆమెకు స్త్రీల సాధికారత, ఆత్మగౌరవం గురించి అక్కర ఉంది. జెండర్ ఈక్వాలిటీ గురించి స్త్రీ, పురుషుల్లో చైతన్యం రావడానికి ఈ డాక్యుమెంటరీ ఉపయోగపడుతుందని ఆమె విశ్వసిస్తున్నారు’ అని తెలిపింది సృష్టి బక్షి. -
Srishti Bakshi: గ్రేట్ ఛేంజ్మేకర్
కొన్ని సంవత్సరాల క్రితం...‘ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో తల్లీకూతుళ్లు సామూహిక అత్యాచారానికి గురయ్యారు’ అనే వార్త చదివిన తరువాత శ్రీష్ఠి బక్షీ మనసు మనసులో లేదు. కళ్ల నిండా నీళ్లు. బాధ తట్టుకోలేక తాను చదివింది కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకుంది. ‘ఇలాంటివి మన దేశంలో సాధారణం’ అన్నారు వాళ్లు. ఈ స్పందనతో శ్రీష్ఠి బాధ రెట్టింపు అయ్యింది. ఇలా ఎవరికి వారు సాధారణం అనుకోవడం వల్లే పరిస్థితి దిగజారిపోతుంది. ఒక దుస్సంఘటన జరిగితే దానిపై ఆందోళన, ఆవేదన వ్యక్తం అవుతుంది తప్ప నిర్దిష్టమైన కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు’ అనుకుంది. ఆరోజంతా శ్రిష్ఠి అదోలా ఉంది. ఈ నేపథ్యంలోనే తన వంతుగా ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. మహిళలకు సంబంధించిన భద్రత, హక్కుల గురించి అవగాహన కలిగించడానికి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుంది. దీనికి ముందు రకరకాల కేస్‌స్టడీలు, పరిశోధన పత్రాలు చదివింది. ఆధునిక సాంకేతిక జ్ఞానంతో అపూర్వ విజయాలు సాధించిన సాధారణ మహిళల గురించి అధ్యయనం చేసింది. బెంగాల్‌లోని ఒక పనిమనిషి సరదాగా యూట్యూబ్‌లో వంటలకు సంబంధించిన రకరకాల వీడియోలను పోస్ట్ చేసేది. కొద్దికాలంలోనే ఆమె యూట్యూబ్ స్టార్‌గా ఎదిగి ఆర్థికంగా బాగా సంపాదించడాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. ఆశీర్వాదం తీసుకుంటూ... తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు వాట్సాప్ కేంద్రంగా దుస్తుల వ్యాపారం మొదలుపెట్టి ఘన విజయం సాధించారు... ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక విజయాల గురించి తెలుసుకుంది. ఇలాంటి ఎన్నో విజయగాథలను తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంది. ‘టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు’ అనుకుంది శ్రిష్ఠి బక్షీ. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల గుండా 3,800 కి.మీల పాదయాత్ర చేసింది. ఈ యాత్రలో ఎంతోమంది మహిళలు ఎన్నో సమస్యలను తనతో పంచుకున్నారు. పరిష్కార మార్గాల గురించి లోతైన చర్చ జరిగిదే. ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. తాజా విషయానికి వస్తే... హక్కుల నుంచి సాధికారత వరకు వివిధ విషయాల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన శ్రిష్టి బక్షీని ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక ‘ఛేంజ్మేకర్’ అవార్డ్ వరించింది. 150 దేశాలకు చెందిన 3000 మంది మహిళల నుంచి ఈ అవార్డ్‌కు శ్రిష్ఠిని ఎంపికచేశారు. ‘యూఎన్ ఎస్డీజీ యాక్షన్ అవార్డ్‌ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సోషల్ ఛేంజ్మేకర్స్తో మాట్లాడే అవకాశం లభిస్తుంది. వారి అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వ్యక్తిగతంగానే కాదు సమష్టిగా కూడా సమాజం కోసం పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది’ అంటుంది శ్రిష్ఠి. ‘సమీకరణ, స్ఫూర్తి, ఒకరితో ఒకరు అనుసంధానం కావడం ద్వారా సుందర భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చు. మనం ఎలా జీవిస్తే మంచిది అనే విశ్లేషణకు ఇవి ఉపయోగపడతాయి. పునరాలోచనకు అవకాశం ఉంటుంది’ అంటుంది ఎస్డీజీ యాక్షన్ క్యాంపెయిన్ కమిటీ. ఇ–కామర్స్ స్ట్రాటజిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రిష్ఠి హాంకాంగ్‌లో పెద్ద ఉద్యోగం చేసేది. ‘నా జీవితం ఆనందమయం’ అని ఆమె అక్కడే ఉండి ఉంటే ‘ఛేంజ్మేకర్’గా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేది కాదు. టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు. ఆ వార్త చదివిన తరువాత తన కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ‘నేనేం చేయలేనా!’ అని భారంగా నిట్టూర్చింది. అంతమాత్రాన శ్రిష్ఠి బక్షీ బాధలోనే ఉండిపోలేదు. బాధ్యతతో ముందడుగు వేసింది... -
240 రోజులు.. కన్యాకుమారి- కశ్మీర్ వరకు 4000 కి.మీ..
‘అర్ధరాత్రి ఏంఖర్మ... పట్టపగలు కూడా ఆడపిల్ల స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి మనదేశంలో ఉంది’ అనే మాటను తన చిన్నప్పటి నుంచి వింటూనే ఉంది శ్రిష్టి బక్షి. ఆ మాటలు విన్నప్పుడల్లా ఒక రకమైన అసంతృప్తి, కోపం. ‘మనదేశంలో ఒంటరిగా ప్రయాణం చేసే అవకాశం ఆడపిల్లలకు లేదా!’ అనే నిరాశ ఆమెలో కమ్ముకుంటున్న సమయంలో ఒకరోజు.... శ్రిష్టి ఏదో ఊరు వెళ్లి తిరిగి ఇంటికి వస్తోంది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ రాత్రి హైవే 91లో ఒక మహిళ తన కూతురు తో కలిసి ధైర్యంగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యం ఆమె కంటపడింది. మన దేశం గురించి సానుకూల దృక్పథం నింపిన ఆ దృశ్యం తనలో ఒక ఆలోచన మెరిపించింది. పాదయాత్ర తో దేశాన్ని చుట్టి రావాలని! ‘ఊహాలు బానే ఉన్నాయి గానీ కల ఫలిస్తుందా?’ అనుకునేలోపే ‘శభాష్’ అంటూ భుజం తట్టాడు భర్త. ‘ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే చేసేయాలి’ అని ప్రోత్సహించాడు. ఇక నాన్న ‘నేను ఉన్నాను కదమ్మా’ అంటూ రూట్‌మ్యాప్ గీసిచ్చాడు. శ్రిష్టి పాదయాత్ర గురించి తెలిసి సన్నిహితులు, మిత్రులు ‘మేము సైతం..’ అంటూ ముందుకొచ్చారు. ఒంటరిగా మొదలుపెడదామనుకున్న పాదయాత్రలో పదకొండు మంది కలిశారు. అలా పన్నెండు మందితో పాదయాత్రకు అంకురార్పణ జరిగింది. మహిళా బృందాలతో శ్రిష్టి తొలి అడుగు తమిళనాడు నుంచి మొదలైంది. వీళ్లు అలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు పొలంలో పనిచేసుకుంటున్న ఓ మహిళ వచ్చి ఆసక్తిగా వివరం అడిగింది. విన్న తరువాత ఆమె పరుగున వెనక్కి వెళ్లి బుట్ట నిండా పండ్లు ఇచ్చి ‘మీరు మా బిడ్డల భవిష్యత్ కోసం నడుస్తున్నారు. మీకు అంతా మంచే జరగాలి’ అని ఆశీర్వదించింది. ఈ సంఘటనతో శ్రిష్టి బృందం ఉత్సాహం రెట్టింపు అయింది. ఒక ఊళ్లో యాసిడ్ దాడి బాధితురాలిని కలిశారు. ‘దురదృష్టకర సంఘటన జరిగింది. అలాగని ఏడుస్తూ జీవితాన్ని చీకటి చేసుకుంటూ కూర్చోలేను కదా! నా జీవితాన్ని నేనే కొత్తగా నిర్మించుకోవాలి అనుకున్నాను’ అంటున్నప్పుడు అవి వ్యక్తిత్వవికాసానికి మేలైన పాఠంలా అనిపించాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పాదయాత్ర సాగింది. రకరకాల సమస్యల గురించి తెలుసుకొని ‘మీకు తోచిన పరిష్కారాన్ని సూచించండి’ అని అడిగినప్పుడు ‘గవర్నమెంటోళ్ల వల్లే ఏమి కావడం లేదు. మనమెంతమ్మా’ అనే ప్రతికూల ఆలోచనలే మొదట వినిపించేవి. ‘అందరూ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపే వాళ్లే. ఆ వేలు మన వైపు కూడా తిరగాలి. అప్పుడు మనలో కూడా మార్పును ఆహ్వానించగల స్పృహ ఏర్పడుతుంది’ అంటారు శ్రిష్టి. ‘మన ఇండియాలో ఎన్నో ఇండియాలు ఉన్నాయి’ అంటున్న శ్రిష్టి బక్షి బృందం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కి.మీ పాదయాత్ర చేసింది. 240 రోజులు పట్టింది. తాము నడిచే దారిలో కలెక్టర్ నుంచి కార్మిక, కర్షకవర్గాల వరకు అందరినీ కలిసేవారు. స్వయంసహాయక బృందాలతో సమావేశం అయ్యేవారు. తమ దగ్గర ఉన్న స్టడీమెటీరియల్‌ను షేర్ చేసేవారు. వర్క్‌షాప్‌లు నిర్వహించేవారు. మహిళా సాధికారతకు డిజిటల్ అక్షరాస్యత అనేది కీలకం అనే విషయాన్ని గుర్తు చేస్తూ రాయడం, చదవడం రానివారికి కూడా ఇంటర్నెట్ను యాక్సెస్ చేసే విషయంలో శిక్షణ ఇచ్చారు. ఎవ్రీ డే హీరోస్‌ను ఎంతోమందిని కలిసారు. శ్రిష్టి బక్షి బృందం చేసిన పాదయాత్రపై అజితేష్ శర్మ రూపొందించిన ‘ఉమెన్ ఆఫ్ మై బిలియన్’ డాక్యుమెంటరి ఫీచర్ ఫిల్మ్ మెల్బోర్న్ ఫిల్మ్‌ఫెస్టివల్–2021కు ఎంపికైంది. పాత్ బ్రేకింగ్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా ప్రశంసలు అందుకుంటోంది. ఈ పాదయాత్ర ఒక సందేశాన్ని మోసుకెళుతుంది.. స్త్రీ వంటింటికే పరిమితం కాదు ఒంటరిగా ఈ ప్రపంచాన్ని చుట్టిరాగలదు అని. ఈ పాదయాత్ర ఒక పలకరింపు అవుతుంది...‘మీ సమస్యలు ఏమిటి?’ అని స్త్రీలను అడుగుతుంది. వాటిని రికార్డ్ చేస్తుంది. ఈ పాదయాత్రలో అడుగడుగునా జీవితం అనే బడి ఉంది. ఆ బడి నుంచి ఒక పరిష్కార పాఠాన్ని వెంట తీసుకొస్తుంది. పదిమందికి పరిచయం చేస్తుంది. -
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆమె పాదయాత్ర
-
ఆమె పాదయాత్ర 3,800 కిలోమీటర్లు
సాక్షి, న్యూఢిల్లీ : కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అంటే దేశ దక్షిణ మూల నుంచి ఉత్తర కొన వరకు బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే వారిని మనం ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. తీర్థ యాత్రల కోసం, ప్రకతి వీక్షణ కోసమో అలాంటి వారు ప్రయాణిస్తుంటారు. వారందరికి భిన్నంగా సృష్టి భక్షి అనే యువతి కన్యాకుమారి నుంచి గతేడాది సెప్టెంబర్ 14వ తేదీన కశ్మీర్‌లోని శ్రీనగర్ వరకు పాదయాత్రను ప్రారంభించారు. అదీ ఓ సమున్నతాశయం కోసం. దేశంలోని మహిళలను సంపూర్ణ సాధికారత సాధించే దిశగా వారికి స్ఫూర్తినివ్వడం కోసం, మహిళలకు, ఆడ పిల్లలకు భారత దేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆమె ఈ యాత్ర ప్రారంభించారు. ఈ ఆశయ సాధన కోసం సృష్టి భక్షి ‘క్రాస్బో మైల్స్’ను స్థాపించి అదే బ్యానర్‌పై ఆధునిక దండి యాత్ర పేరిట 3,800 కిలోమీటర్ల పొడువైన పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 260 రోజులు సాగనున్న పాతయాత్రలో ఆమె ఇప్పటికే 128 రోజుల యాత్రను ముగించారు. సృష్టి భక్షి 3,800 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసేటప్పటికీ వందకోట్ల అడుగులు పూర్తవుతాయన్నది ఆమె చెబుతున్న ఒక అంచనా. సృష్టి తన పాద యాత్ర సందర్భంగా పలు నగరాలు, పట్టణాల్లోని విద్యా సంస్థల్లో, మహిళా సంస్థల ఆధ్వర్యంలో మహిళా సాధికారికతపై సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కళాకారులతో కలసి గోడలపై పెయింటింగ్స్ రూపంలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజల విరాళాలపై అంటే, ఆహారం, వసతి కల్పించడం లాంటి సాయంతో పాదయాత్ర కొనసాగిస్తున్న సృష్టి వెంట ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ బృందం కూడా వెళుతోంది. మార్గమధ్యంలో అనేక వర్గాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళా పోలీసులు సృష్టి భక్షికి సంఘీభావంగా కలిసి కొంతదూరం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఏదో లక్ష్యం కోసం ఎవరైనా పాద యాత్రను నిర్వహించవచ్చని ఆమె ప్రజలకు పిలుపునిస్తున్నారు.