కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అంటే దేశ దక్షిణ మూల నుంచి ఉత్తర కొన వరకు బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే వారిని మనం ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. తీర్థ యాత్రల కోసం, ప్రకతి వీక్షణ కోసమో అలాంటి వారు ప్రయాణిస్తుంటారు. వారందరికి భిన్నంగా సృష్టి భక్షి అనే యువతి కన్యాకుమారి నుంచి గతేడాది సెప్టెంబర్ 14వ తేదీన కశ్మీర్‌లోని శ్రీనగర్ వరకు పాదయాత్రను ప్రారంభించారు. అదీ ఓ సమున్నతాశయం కోసం. దేశంలోని మహిళలను సంపూర్ణ సాధికారత సాధించే దిశగా వారికి స్ఫూర్తినివ్వడం కోసం, మహిళలకు, ఆడ పిల్లలకు భారత దేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆమె ఈ యాత్ర ప్రారంభించారు.