కన్యాకుమారి నుంచి శ్రీ నగర్ వరకూ 260 రోజుల పాటు 3,800 కిలోమీటర్లు దేశమంతా నడిచింది సృష్టి బక్షి. ఎందుకు? స్త్రీలపై జరిగే దురాగతాలపై చైతన్యం కలిగించడానికే కాదు స్త్రీల శక్తియుక్తులను వారికి గుర్తు చేయడానికి. ఆ సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడు ‘విమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతోంది. నటి ప్రియాంకా చోప్రా నిర్మాత.
తాను నడిచి చేరుకున్న ఊరిలో ఏదైనా స్కూల్‌లోగాని, పబ్లిక్ హాల్‌లో కాని మహిళలను పోగు చేస్తుంది సృష్టి బక్షి. ‘అందరూ కళ్లు మూసుకుని దీర్ఘంగా శ్వాస పీల్చి వదలండి’ అంటుంది. ‘ఇప్పుడు మీ కళ్ల ఎదురుగా మీ 11 ఏళ్ల వయసున్న మీ రూపాన్ని గుర్తు చేసుకోండి. ఆ 11 ఏళ్ల అమ్మాయిలో ఉండే విశ్వాసం, ఆనందం ఎన్ని విధాలుగా ధ్వంసమైందో గుర్తుకు తెచ్చుకోండి.
ఆ అమ్మాయికి సారీ చెప్పండి. ఎందుకంటే ఆ విధ్వంసమంతా మీ అనుమతితోనే జరిగింది’ అంటుంది. చాలామంది ఆ మాటలకు ఏడుస్తారు. గడిచివచ్చిన జీవితాన్ని తలుచుకుని బాధలో మునిగిపోతారు. అప్పుడు సృష్టి బక్షి ఒక బోర్డు మీద స్త్రీ శరీర నిర్మాణం గీచి ‘ఇదిగో ఈ అవయవాల రీత్యా మీరు మగవారి కంటే భిన్నంగా పుట్టారు. ప్రకృతి ఈ అవయవాలను మీకు ఇస్తే సమాజం అదుపు, ఆంక్షలు, వివక్ష, కుటుంబ హింస, ఆర్థిక బానిసత్వం, ఇంటి పని... ఇన్ని ఇచ్చింది. మనం ఎందుకు మగవారితో సమానం కాము?’ అని ప్రశ్నిస్తుంది.
మార్పు కోసం
సృష్టి బక్షిది ముంబై. ఆమె హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుకుంది. హాంగ్‌కాంగ్‌లో మార్కెటింగ్‌లో పెద్ద సంస్థల్లో పని చేసింది. తండ్రి ఆర్మీలో పని చేయడం వల్ల ఆమెకు దేశం పట్ల ఒక ఉద్వేగం ఉండేది. అయితే తాను ప్రేమించే దేశంలో స్త్రీలపై జరిగే అన్యాయాలను చూసి చలించి పోయేది. ‘2017లో హాంకాంగ్‌లో సిటీ బస్ ఎక్కి ఇంటికి వెళుతున్నప్పుడు నా ఫోన్‌లో ఇండియాలో తల్లీ కూతుళ్లపై తండ్రి ఎదుటే అత్యాచారం చేసి చంపేశారన్న వార్త చదివాను. చాలా నిస్పృహ కలిగింది. నాలాంటి వాళ్లు సౌకర్యంగా పడక్కుర్చీలో కూచుని చింతించడం సరికాదని రంగంలో దిగాలని అనుకున్నాను. అలా నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, ఇండియా వచ్చి దేశంలోని స్త్రీలందరితో మాట్లాడాలని 2018 మే నెలలో పాదయాత్ర ప్రారంభించాను’ అని చెప్పింది సృష్టి.
రోజూ వేలాది మంది
‘ఉమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో సృష్టి బక్షి మే 2018లో కన్యాకుమారి నుంచి పాదయాత్ర ప్రారంభించింది. ఈ యాత్ర రికార్డు అయ్యేలా టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. 260 రోజుల పాటు దాదాపు 4 వేల కిలోమీటర్ల పాటు సాగే ఈ యాత్రకు కోటి రూపాయలు ఖర్చవుతాయి. 50 లక్షలను క్రౌడ్ ఫండింగ్ ద్వారా పోగు చేసింది.
‘ఈ యాత్రలో స్త్రీల కలలు, ఆకాంక్షలు, వారి హక్కులు, సంఘర్షణలు. విజయాలు వినదలుచుకున్నాను. వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. నా సుదీర్ఘ యాత్రలో మన దేశంలో వరకట్నం ఇంకా పెద్ద సమస్యగా ఉందని అర్థమైంది. వరకట్నం స్త్రీలను మానసికంగా పురుషులతో సమానం అనుకోనివ్వడం లేదు.
స్త్రీలను అసభ్యంగా తాకడం, హింసించడం, అణిచి పెట్టడం కొనసాగుతూనే ఉంది. ఒక దశలో నేను యాత్ర చేయలేననుకున్నాను. కాని ఆ మరుసటి రోజు నా మీటింగ్‌కు హాజరైన ఒక ఆశా వర్కర్– ‘‘రాత్రి నన్ను నా భర్త కొట్టాడు. నీ మాటలు విన్నాక ఇక ఇలాంటిది జరగనివ్వకూడదని నిశ్చయించుకున్నాను. నేను నా భర్తను నిలువరించడానికి నలుగురి సాయం తీసుకుంటాను’’ అని చెప్పింది. నా యాత్ర వల్ల జరుగుతున్న మేలు అర్థమయ్యాక కొనసాగాను’ అని తెలిపింది సృష్టి.
డాక్యుమెంటరీ విడుదల
సృష్టి చేసిన యాత్ర అంతా ‘విమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో డాక్యుమెంటరీగా రూపొందింది. మే 3 నుంచి అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీ మీద మంచి రివ్యూలు వస్తున్నాయి. ‘ఎందరో స్త్రీలు. వారి జీవితానుభవాలను ఈ డాక్యుమెంటరీలో పంచుకున్నారు. వారు సమస్యలు వారి తెచ్చుకున్నవి కాదు. వారికి తెచ్చిపెట్టినవి. అందుకే నటి ప్రియాంకా చోప్రా నా డాక్యుమెంటరీని చూసి తాను నిర్మాతగా మారి విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఒక స్త్రీగా, ఆడపిల్ల తల్లిగా ఆమెకు స్త్రీల సాధికారత, ఆత్మగౌరవం గురించి అక్కర ఉంది. జెండర్ ఈక్వాలిటీ గురించి స్త్రీ, పురుషుల్లో చైతన్యం రావడానికి ఈ డాక్యుమెంటరీ ఉపయోగపడుతుందని ఆమె విశ్వసిస్తున్నారు’ అని తెలిపింది సృష్టి బక్షి.
Comments
Please login to add a commentAdd a comment