‘అర్ధరాత్రి ఏంఖర్మ... పట్టపగలు కూడా ఆడపిల్ల స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి మనదేశంలో ఉంది’ అనే మాటను తన చిన్నప్పటి నుంచి వింటూనే ఉంది శ్రిష్టి బక్షి. ఆ మాటలు విన్నప్పుడల్లా ఒక రకమైన అసంతృప్తి, కోపం. ‘మనదేశంలో ఒంటరిగా ప్రయాణం చేసే అవకాశం ఆడపిల్లలకు లేదా!’ అనే నిరాశ ఆమెలో కమ్ముకుంటున్న సమయంలో ఒకరోజు....
శ్రిష్టి ఏదో ఊరు వెళ్లి తిరిగి ఇంటికి వస్తోంది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ రాత్రి హైవే 91లో ఒక మహిళ తన కూతురు తో కలిసి ధైర్యంగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యం ఆమె కంటపడింది. మన దేశం గురించి సానుకూల దృక్పథం నింపిన ఆ దృశ్యం తనలో ఒక ఆలోచన మెరిపించింది. పాదయాత్ర తో దేశాన్ని చుట్టి రావాలని!
‘ఊహాలు బానే ఉన్నాయి గానీ కల ఫలిస్తుందా?’ అనుకునేలోపే ‘శభాష్’ అంటూ భుజం తట్టాడు భర్త. ‘ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే చేసేయాలి’ అని ప్రోత్సహించాడు. ఇక నాన్న ‘నేను ఉన్నాను కదమ్మా’ అంటూ రూట్‌మ్యాప్ గీసిచ్చాడు. శ్రిష్టి పాదయాత్ర గురించి తెలిసి సన్నిహితులు, మిత్రులు ‘మేము సైతం..’ అంటూ ముందుకొచ్చారు. ఒంటరిగా మొదలుపెడదామనుకున్న పాదయాత్రలో పదకొండు మంది కలిశారు. అలా పన్నెండు మందితో పాదయాత్రకు అంకురార్పణ జరిగింది.
మహిళా బృందాలతో శ్రిష్టి
తొలి అడుగు తమిళనాడు నుంచి మొదలైంది. వీళ్లు అలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు పొలంలో పనిచేసుకుంటున్న ఓ మహిళ వచ్చి ఆసక్తిగా వివరం అడిగింది. విన్న తరువాత ఆమె పరుగున వెనక్కి వెళ్లి బుట్ట నిండా పండ్లు ఇచ్చి ‘మీరు మా బిడ్డల భవిష్యత్ కోసం నడుస్తున్నారు. మీకు అంతా మంచే జరగాలి’ అని ఆశీర్వదించింది. ఈ సంఘటనతో శ్రిష్టి బృందం ఉత్సాహం రెట్టింపు అయింది. ఒక ఊళ్లో యాసిడ్ దాడి బాధితురాలిని కలిశారు. ‘దురదృష్టకర సంఘటన జరిగింది. అలాగని ఏడుస్తూ జీవితాన్ని చీకటి చేసుకుంటూ కూర్చోలేను కదా! నా జీవితాన్ని నేనే కొత్తగా నిర్మించుకోవాలి అనుకున్నాను’ అంటున్నప్పుడు అవి వ్యక్తిత్వవికాసానికి మేలైన పాఠంలా అనిపించాయి.
పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పాదయాత్ర సాగింది. రకరకాల సమస్యల గురించి తెలుసుకొని ‘మీకు తోచిన పరిష్కారాన్ని సూచించండి’ అని అడిగినప్పుడు ‘గవర్నమెంటోళ్ల వల్లే ఏమి కావడం లేదు. మనమెంతమ్మా’ అనే ప్రతికూల ఆలోచనలే మొదట వినిపించేవి. ‘అందరూ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపే వాళ్లే. ఆ వేలు మన వైపు కూడా తిరగాలి. అప్పుడు మనలో కూడా మార్పును ఆహ్వానించగల స్పృహ ఏర్పడుతుంది’ అంటారు శ్రిష్టి.
‘మన ఇండియాలో ఎన్నో ఇండియాలు ఉన్నాయి’ అంటున్న శ్రిష్టి బక్షి బృందం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కి.మీ పాదయాత్ర చేసింది. 240 రోజులు పట్టింది. తాము నడిచే దారిలో కలెక్టర్ నుంచి కార్మిక, కర్షకవర్గాల వరకు అందరినీ కలిసేవారు. స్వయంసహాయక బృందాలతో సమావేశం అయ్యేవారు. తమ దగ్గర ఉన్న స్టడీమెటీరియల్‌ను షేర్ చేసేవారు. వర్క్‌షాప్‌లు నిర్వహించేవారు. మహిళా సాధికారతకు డిజిటల్ అక్షరాస్యత అనేది కీలకం అనే విషయాన్ని గుర్తు చేస్తూ రాయడం, చదవడం రానివారికి కూడా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసే విషయంలో శిక్షణ ఇచ్చారు. ఎవ్రీ డే హీరోస్‌ను ఎంతోమందిని కలిసారు.
శ్రిష్టి బక్షి బృందం చేసిన పాదయాత్రపై అజితేష్ శర్మ రూపొందించిన ‘ఉమెన్ ఆఫ్ మై బిలియన్’ డాక్యుమెంటరి ఫీచర్ ఫిల్మ్ మెల్‌బోర్న్ ఫిల్మ్‌ఫెస్టివల్–2021కు ఎంపికైంది. పాత్ బ్రేకింగ్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా ప్రశంసలు అందుకుంటోంది.
ఈ పాదయాత్ర ఒక సందేశాన్ని మోసుకెళుతుంది.. స్త్రీ వంటింటికే పరిమితం కాదు ఒంటరిగా ఈ ప్రపంచాన్ని చుట్టిరాగలదు అని. ఈ పాదయాత్ర ఒక పలకరింపు అవుతుంది...‘మీ సమస్యలు ఏమిటి?’ అని స్త్రీలను అడుగుతుంది. వాటిని రికార్డ్ చేస్తుంది. ఈ పాదయాత్రలో అడుగడుగునా జీవితం అనే బడి ఉంది. ఆ బడి నుంచి ఒక పరిష్కార పాఠాన్ని వెంట తీసుకొస్తుంది. పదిమందికి పరిచయం చేస్తుంది.
Srishti Bakshi: కన్యాకుమారి- కశ్మీర్ వరకు 4000 కి.మీ. యాత్ర
Published Fri, Jul 9 2021 1:16 AM | Last Updated on Fri, Jul 9 2021 1:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment