సాక్షి, న్యూఢిల్లీ : కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అంటే దేశ దక్షిణ మూల నుంచి ఉత్తర కొన వరకు బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే వారిని మనం ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. తీర్థ యాత్రల కోసం, ప్రకతి వీక్షణ కోసమో అలాంటి వారు ప్రయాణిస్తుంటారు. వారందరికి భిన్నంగా సృష్టి భక్షి అనే యువతి కన్యాకుమారి నుంచి గతేడాది సెప్టెంబర్ 14వ తేదీన కశ్మీర్‌లోని శ్రీనగర్ వరకు పాదయాత్రను ప్రారంభించారు. అదీ ఓ సమున్నతాశయం కోసం. దేశంలోని మహిళలను సంపూర్ణ సాధికారత సాధించే దిశగా వారికి స్ఫూర్తినివ్వడం కోసం, మహిళలకు, ఆడ పిల్లలకు భారత దేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆమె ఈ యాత్ర ప్రారంభించారు.
ఈ ఆశయ సాధన కోసం సృష్టి భక్షి ‘క్రాస్‌బో మైల్స్’ను స్థాపించి అదే బ్యానర్‌పై ఆధునిక దండి యాత్ర పేరిట 3,800 కిలోమీటర్ల పొడువైన పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 260 రోజులు సాగనున్న పాతయాత్రలో ఆమె ఇప్పటికే 128 రోజుల యాత్రను ముగించారు. సృష్టి భక్షి 3,800 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసేటప్పటికీ వందకోట్ల అడుగులు పూర్తవుతాయన్నది ఆమె చెబుతున్న ఒక అంచనా. సృష్టి తన పాద యాత్ర సందర్భంగా పలు నగరాలు, పట్టణాల్లోని విద్యా సంస్థల్లో, మహిళా సంస్థల ఆధ్వర్యంలో మహిళా సాధికారికతపై సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కళాకారులతో కలసి గోడలపై పెయింటింగ్స్ రూపంలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజల విరాళాలపై అంటే, ఆహారం, వసతి కల్పించడం లాంటి సాయంతో పాదయాత్ర కొనసాగిస్తున్న సృష్టి వెంట ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ బృందం కూడా వెళుతోంది.
మార్గమధ్యంలో అనేక వర్గాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళా పోలీసులు సృష్టి భక్షికి సంఘీభావంగా కలిసి కొంతదూరం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఏదో లక్ష్యం కోసం ఎవరైనా పాద యాత్రను నిర్వహించవచ్చని ఆమె ప్రజలకు పిలుపునిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment