మాతృత్వం.. అడవారి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. అయితే జన్యుపరమైన కారణాలతోనో.. శారీరక లోపంతోనో ఆ భాగ్యానికి నోచుకోని వారికి అద్దెగర్భం ద్వారా పరోక్షంగా తల్లయ్యే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. కానీ కాసుల కోసం వెంపర్లాడే కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అమ్మతనాన్ని కూడా అమ్మకానికి పెట్టేస్తున్నాయి. ఈ అక్రమ వ్యవహారం తాజాగా రాజధాని నగరంలో బట్టబయలైంది.
సాక్షి, చెన్నై: అద్దె తల్లుల వ్యవహారం మరోమారు చెన్నైలో వెలుగు చూసింది. చూలైమేడులో కొన్నిచోట్ల ప్రత్యేక గదుల్లో అద్దె తల్లులను ఉంచి ఓ ఆసుపత్రి యాజమాన్యం చికిత్స అందిస్తుండడం బయట పడింది. దీనిపై ఆరోగ్యశాఖ సోమవారం విచారణకు ఆదేశించింది. వివరాలు.. ప్రముఖ సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతుల సరోగసీ వివాదం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో చెన్నైలో మరోమారు అద్దె తల్లుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చూలైమేడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి అద్దె తల్లుల ద్వారా సరోగసీ విధానంలో పిల్లలను విక్రయిస్తోందనే ఆరోపణలు వెల్లవెత్తాయి. అదే సమయంలో మీడియాకు అద్దె తల్లి ఇచ్చిన సమాచారంతో అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రి బండారం బట్టబయలైంది.
పేదరికమే పెట్టుబడిగా..
చూలైమేడు పరిసరాల్లో అద్దెకు అనేక ఇళ్లను తీసుకుని మరీ సంబంధిత ప్రైవేటు ఆసుపత్రి సరోగసీకి చికిత్స అందిస్తుండడం వెలుగులోకి వచ్చింది. ఈక్రమంలో ప్రత్యేక గదులకే ఈ అద్దె తల్లులను పరిమితం చేయడం గమనార్హం. అలాగే, కొన్ని ఇళ్లలో ఉన్న పేద యువతుల వద్ద అండాలను సైతం సేకరిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడైంది. అద్దె తల్లుల్లో ఆంధ్రా, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన వారే కాదు, బంగ్లాదేశ్, నైజీరియా వంటి దేశాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు తెలిసింది. అద్దెతల్లులు ఉన్న చోటకే వెళ్లి వైద్యులు పరిశోధించడం, చికిత్సలు నిర్వహించడం జరుగుతోంది.
ఈ అద్దె తల్లులు అందరూ పేదరికంలో నలుగుతున్నారని, వీరిలో కొందరికి వివాహాలకు కూడా కాలేదని వెల్లడైంది. తమ ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం అద్దె తల్లులుగా వచ్చిన వారిని ఆస్పత్రి యాజమాన్యం వేదిస్తున్నట్లు, వీరు ఇస్తున్న మందులు తమపై భవిష్యత్‌లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన కలుగుతోందని 25 ఏళ్ల బాధితారులు మీడియాకు సమాచారం ఇచ్చింది. దీనిపై ఆరోగ్యశాఖ వెంటనే స్పందించింది. ఈ వ్యవహారంపై సోమవారం సమగ్ర విచారణకు ఆదేశించింది. వైద్యశాఖ అధికారులు విశ్వనాథన్, కృష్ణన్ నేతృత్వంలో నలుగురు అధికారులతో కూడిన కమిటీని దర్యాప్తు కోసం నియమించింది.
చదవండి: వీధి కుక్క దాడిలో పసికందు మృతి.. పేగులు బయటకు తీయటంతో..!
Comments
Please login to add a commentAdd a comment