తల్లి కష్టాన్ని కూతురు మోసింది
ఏడాదిలోపే జిల్లా పోటీలో 36 పతకాలు
అమ్మమోయగా లేనిది నేను మోయలేనా అనుకుంది!
రష్యాలో జరిగిన డబ్ల్యూపీపీఎల్ వరల్డ్ కప్ పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధించి ప్రశంసలు అందుకుంటోంది కస్తూరి రాజమూర్తి. కస్తూరి కథ చాలామంది విజేతలతో పోల్చితే భిన్నమైనది. కస్తూరి తల్లి తిరువణ్ణామలై రైల్వేస్టేషన్‌లో పోర్టర్. తల్లి పెద్ద పెద్ద బ్యాగులు, సూటుకేసులు మోస్తుంటే ఆసక్తిగా చూసేది. తల్లికి సహాయంగా తాను కూడా చిన్న చిన్న బరువులు మోసేది. ఈ కష్టం ఊరకే పోలేదు. వెయిట్ లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకునేలా, పతకాలు గెలుచుకునేలా చేసింది.
‘గెలుస్తాను అనుకోలేదు’ అంటుంది కస్తూరి రష్యాలో వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం గెలుచుకోవడం గురించి. ఎందుకంటే ఆమెను ఓటమి కంటే గెలుపు పలకరించిన సందర్భాలే ఎక్కువ. పోటీలో బరువు ఎత్తబోతున్నప్పుడు మా అమ్మ రైల్వేస్టేషన్‌లో బ్యాగులు ఎత్తి నెత్తి మీద మోసే దృశ్యాన్ని గుర్తు చేసుకున్నాను. మా అమ్మే నాకు స్ఫూర్తి. మరిన్ని పతకాలు గెలుచుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి కష్టాలు లేకుండా అమ్మను చూసుకోవాలనుకుంటున్నాను’ అంటుంది కస్తూరి.
తిరువణ్ణామలై ప్రాంతంలోని చెయ్యార్ అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన కస్తూరి అనుకోకుండా వెయిట్ లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. కొత్తూర్‌పురంలో స్థానిక ఇన్‌స్ట్రక్టర్ల దగ్గర వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఇల్లు వదిలి వేరే ఊళ్లో శిక్షణ తీసుకోవడానికి తల్లిదండ్రులు మొదట ఒప్పుకోకపోయినా కస్తూరి పట్టుదల చూసి ఆ తరువాత ఒప్పుకోక తప్పింది కాదు.
కొత్తగా పరిచయం అయిన ఆట అయినప్పటికీ ఏడాదిలోపే జిల్లా పోటీలో 36 పతకాలు గెలుచుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో యూరప్‌లో పోటీ పడే అవకాశాన్ని కోల్పోయింది. ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సహకారంతో రష్యాలోని నోవోసిబిర్క్స్ వరల్డ్‌కప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొంది. 75 కేజీల విభాగంలో డెడ్‌లిఫ్ట్ చేసింది.
తాజాగా.... ఒలింపిక్ వెయిట్‌లిఫ్టింగ్ ట్రైనింగ్ కోసం తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి కస్తూరికి ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఈ కాల్ కస్తూరిని పెద్దగా సంతోష పరిచినట్లు లేదు. ‘ముందు నాకు ఉద్యోగం కావాలి. మా కుటుంబం మొత్తం అమ్మపైనే ఆధారపడింది. నాన్న అనారోగ్యంగా ఉన్నారు. మా అక్కాచెల్లెళ్లు ఉద్యోగాల కోసం వెదుకుతున్నారు. నా కుటుంబం ఆర్థికంగా బాగుండి, సంతోషంగా ఉంటేనే నేను ఆటలపై బాగా దృష్టి కేంద్రీకరించగలుగుతాను’ అంటోంది కస్తూరి రాజమూర్తి.
Comments
Please login to add a commentAdd a comment