surrogate babies
-
ఇదేం కక్కుర్తి, అమ్మకానికి.. అమ్మతనం!
మాతృత్వం.. అడవారి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. అయితే జన్యుపరమైన కారణాలతోనో.. శారీరక లోపంతోనో ఆ భాగ్యానికి నోచుకోని వారికి అద్దెగర్భం ద్వారా పరోక్షంగా తల్లయ్యే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. కానీ కాసుల కోసం వెంపర్లాడే కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అమ్మతనాన్ని కూడా అమ్మకానికి పెట్టేస్తున్నాయి. ఈ అక్రమ వ్యవహారం తాజాగా రాజధాని నగరంలో బట్టబయలైంది. సాక్షి, చెన్నై: అద్దె తల్లుల వ్యవహారం మరోమారు చెన్నైలో వెలుగు చూసింది. చూలైమేడులో కొన్నిచోట్ల ప్రత్యేక గదుల్లో అద్దె తల్లులను ఉంచి ఓ ఆసుపత్రి యాజమాన్యం చికిత్స అందిస్తుండడం బయట పడింది. దీనిపై ఆరోగ్యశాఖ సోమవారం విచారణకు ఆదేశించింది. వివరాలు.. ప్రముఖ సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతుల సరోగసీ వివాదం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో చెన్నైలో మరోమారు అద్దె తల్లుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చూలైమేడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి అద్దె తల్లుల ద్వారా సరోగసీ విధానంలో పిల్లలను విక్రయిస్తోందనే ఆరోపణలు వెల్లవెత్తాయి. అదే సమయంలో మీడియాకు అద్దె తల్లి ఇచ్చిన సమాచారంతో అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రి బండారం బట్టబయలైంది. పేదరికమే పెట్టుబడిగా.. చూలైమేడు పరిసరాల్లో అద్దెకు అనేక ఇళ్లను తీసుకుని మరీ సంబంధిత ప్రైవేటు ఆసుపత్రి సరోగసీకి చికిత్స అందిస్తుండడం వెలుగులోకి వచ్చింది. ఈక్రమంలో ప్రత్యేక గదులకే ఈ అద్దె తల్లులను పరిమితం చేయడం గమనార్హం. అలాగే, కొన్ని ఇళ్లలో ఉన్న పేద యువతుల వద్ద అండాలను సైతం సేకరిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడైంది. అద్దె తల్లుల్లో ఆంధ్రా, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన వారే కాదు, బంగ్లాదేశ్, నైజీరియా వంటి దేశాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు తెలిసింది. అద్దెతల్లులు ఉన్న చోటకే వెళ్లి వైద్యులు పరిశోధించడం, చికిత్సలు నిర్వహించడం జరుగుతోంది. ఈ అద్దె తల్లులు అందరూ పేదరికంలో నలుగుతున్నారని, వీరిలో కొందరికి వివాహాలకు కూడా కాలేదని వెల్లడైంది. తమ ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం అద్దె తల్లులుగా వచ్చిన వారిని ఆస్పత్రి యాజమాన్యం వేదిస్తున్నట్లు, వీరు ఇస్తున్న మందులు తమపై భవిష్యత్‌లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన కలుగుతోందని 25 ఏళ్ల బాధితారులు మీడియాకు సమాచారం ఇచ్చింది. దీనిపై ఆరోగ్యశాఖ వెంటనే స్పందించింది. ఈ వ్యవహారంపై సోమవారం సమగ్ర విచారణకు ఆదేశించింది. వైద్యశాఖ అధికారులు విశ్వనాథన్, కృష్ణన్ నేతృత్వంలో నలుగురు అధికారులతో కూడిన కమిటీని దర్యాప్తు కోసం నియమించింది. చదవండి: వీధి కుక్క దాడిలో పసికందు మృతి.. పేగులు బయటకు తీయటంతో..! -
నయనతార కవలల పేర్లు తెలుసా.. వాటి అర్థాలు ఇవే..!
కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా పలువురు తారలు శుభాకాంక్షలు తెలిపారు. నయనతార ఇద్దరు మగ పిల్లలకు(ట్విన్స్) పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె భర్త విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ జంట కవల పిల్లలకు తమిళంలో ఉయిర్, ఉలగం అనే పేర్లను పెట్టారు. చాలామంది అభిమానులు వారి పేర్ల వెనుక ఉన్న అర్థాలపై ఆరా తీశారు. ఉయిర్, ఉలగం రెండూ తమిళ పదాలు కావడంతో ఫ్యాన్స్ తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. అయితే తమిళంలో ఉయిర్ అంటే జీవితం అనే అర్థం వస్తుంది. మరోవైపు ఉలగం అంటే ప్రపంచమని అర్థం వచ్చేలా పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా తల్లిదండ్రులైన కోలీవుడ్ జంటకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేష్ పోస్ట్‌పై విక్కీ కౌశల్, అర్జున్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్లు స్పందించారు. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 'నయన్, విక్కీకి అభినందనలు. పేరెంట్ క్లబ్‌కు స్వాగతం. జీవితంలో అత్యుత్తమ దశ. మీ ఇద్దరు పిల్లలకు నా ఆశీర్వాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. -
జపాన్ కుబేరుడికి భారీ ఊరట
బ్యాంకాక్: బేబీ ఫ్యాక్టరీ కేసులో జపాన్ కుబేరుడికి థాయ్‌లాండ్ కోర్టులో భారీ ఊరట లభించింది. చిన్నారుల అక్రమ వ్యాపారం చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త మిట్సుటోకి షింగెటా (28)కి తీపి కబరు వచ్చింది. 13 మంది సర్రొగేట్ చిన్నారుల ఆలనా పాలనా చూసుకునేందుకు అనుమతినిస్తూ థాయ్ కోర్టు తీర్పు వెల్లడించింది. వివరాల్లోకెళ్తే.. జపాన్ కు చెందిన మిట్సుటోకి షింగెటా కుబేరుడు. ఎన్నో వ్యాపార సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆయనకు వివాహం కాలేదు. అయితే 2014లో బ్యాంకాక్‌లో ఆయనకు చెందిన ఓ అపార్ట్మెంట్లో 13 మంది ఏడాదిలోపు వయసున్న చిన్నారులను పోలీసులు గుర్తించారు. పసివాళ్లను అక్రమ రవాణా చేయడం, చిన్నారులతో ఏదో వ్యాపారం చేస్తున్నారని థాయ్‌లాండ్ పోలీసులు భావించారు. దీంతో ఆ పసివాళ్ల ఆలనాపాలనను ప్రభుత్వం చూసుకునేలా చేశారు. వ్యాపారవేత్త మిట్సుటోకి షింగెటాపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల అనంతరం ఈ కేసు చివరి విచారణ అనంతరం స్థానిక కోర్టు.. 13 మంది చిన్నారుల ఆలనాపాలనను సరోగేట్ ఫాదర్ మిట్సుటోకి చూసుకోవచ్చునని తీర్పు వచ్చింది. పోలీసులు చిన్నారులను గుర్తించేసమయానికి ఆ పసివాళ్లు ఆరోగ్యంగా ఉన్నారని, వారి ఆలనా పాలనా చూసేందుకు ఏడుగురు మహిళలు ఉన్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడిగా ఉన్న మిట్సుటోకి జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజమని తమకు అప్పట్లో తెలియదని, ఆయన 9 మంది థాయ్‌లాండ్ మహిళల సాయంతో సరోగసి (అద్దె గర్భం) పద్ధతిలో పిల్లల కోసం చూడగా.. 13 మంది జన్మించారని వివరించారు. అయితే అక్రమంగా సరోగసిని పాటిస్తూ సరోగేట్ మదర్స్ డబ్బులు తీసుకుంటున్నారని, అనంతరం పుట్టిన పిల్లల్ని విదేశాలకు అధిక మొత్తాలకు విక్రయిస్తున్నట్లు తాము భావించినట్లు కోర్టులో పోలీసులు చెప్పారు. ఈ కేసు విచారణ జరుగుతున్నంత కాలం నెలకోసారి చిన్నారుల నానమ్మ(మిట్సుటోకి తల్లి) పసివాళ్లను చూసేందుకు జపాన్ నుంచి వచ్చి వెళ్లేవారు. దాంతోపాటుగా ఆ చిన్నారులకు ఇంగ్లీష్, జపనీస్ భాషలు నేర్పేందుకు ట్యూషన్ టీచర్లను సరోగేట్ ఫాదర్ మిట్సుటోకి నియమించారు. వ్యాపారి మిట్సుటోకికి మొత్తం 17 మంది సంతానం, కాగా వీరంతా సరోగసి పద్ధతిలో జన్మించారు. అయితే నలుగురు సంతానంలో ఇద్దరు భారత మహిళల నుంచి పుట్టిన సంతానం. అయితే బ్యాంకాక్‌లో పోలీసుల ఆకస్మిక దాడులకు ముందే నలుగురు చిన్నారుల్ని జపాన్‌లో విక్రయించిన కొత్త ఇంట్లో మిట్సుటోకి సంరక్షణలో ఉన్నారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత థాయ్ కోర్టు వ్యాపారి మిట్సుటోకి నిర్దోషి అని తేలుస్తూ బ్యాంకాక్ రైడ్‌లో దొరికిన 13 మంది చిన్నారులను సరోగేట్ ఫాదర్‌కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. 2015లో సరోగసిపై థాయ్‌లాండ్ చట్టాన్ని తీసుకొచ్చి కొన్ని ఆంక్షలు విధించిన విషయం విదితమే. -
థాయిలాండ్‌లో సరోగసీ దుమారం
బ్యాంకాక్: థాయిలాండ్‌లో సరోగసీ (అద్దెకు తల్లిగర్భం) విధానం మితిమీరుతుండటంతో సర్వత్రా దుమారం చెలరేగుతోంది. సరోగసీని వ్యాపారంగా మార్చివేయకుండా అడ్డుకునేందుకు చట్టాలను సవరించాలంటూ ఓ పక్క చర్చలు ఊపందుకుంటుండగానే మరోపక్క సరోగసీకి సంబంధించి కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. థాయిలాండ్‌లో ఏకంగా 9 మంది పిల్లలను అద్దెతల్లుల ద్వారా పొందిన జపాన్ వ్యాపారవేత్త షిగెటా మిత్సుతోకి(24) బుధవారం దేశం నుంచి పారిపోయారు. రెండు వారాల నుంచి రెండేళ్ల వయసుల మధ్య ఉన్న 9 మంది పిల్లలను, గర్భంతో ఉన్న ఓ సరోగేట్ తల్లిని లాట్ పారో జిల్లాలోని ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్లో పోలీసులు కనుగొన్నారు. ఇంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన దంపతులు సరోగేట్ తల్లి ద్వారా ఇద్దరు కవలలను పొందారు. అయితే వారిలో మగపిల్లాడు గ్యామీకి జన్యుపరమైన డౌన్స్ సిండ్రోమ్ రుగ్మత రావడంతో వాడిని వదిలేసి ఆడపిల్లను మాత్రమే తీసుకెళ్లారు. ఈ సంఘటనపై ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. చట్టాలను మార్చాలన్న డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కాగా, సరోగసీ నియంత్రణకు థాయిలాండ్‌లో ప్రత్యేక చట్టాలు లేవు. దీనికోసం కొత్తగా రూపొందించిన చట్టాన్ని ఆ దేశ జాతీయ అసెంబ్లీ త్వరలోనే ఆమోదించనుంది. అయితే డబ్బుకు అద్దెగర్భం ఇవ్వడాన్ని థాయిలాండ్ వైద్య మండలి నిషేధించింది. సంతానం పొందేవారి బంధువులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం ఆ దేశంలో 45 కేంద్రాలు, 240 మంది వైద్యులకు మాత్రమే దీనిపై అనుమతి ఉంది. నిబంధనలను ఉల్లంఘించిన వైద్యుల లైసెన్సులు రద్దుచేయడంతో పాటు ఏడాది జైలు శిక్ష, గరిష్టంగా రూ.40 వేల జరిమానా విధించే అవకాశముంది.