First Time Urban Company Sued On Protesting Women Workers, Check Details Inside - Sakshi
Sakshi News home page

ఆందోళనలో 50 లక్షల మంది ఉద్యోగుల భవితవ్యం!.. ఆ చట్టానికి మోక్షం ఎప్పుడో?

Published Fri, Dec 24 2021 1:10 PM | Last Updated on Fri, Dec 24 2021 1:56 PM

Urban Company Sues Protesting Women Workers Fears In Gig Sector - Sakshi

Urban Company Sues Women Employees: దేశంలో మొట్టమొదటిసారి ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందనే చర్చ నడుస్తోంది. సాధారణంగా హక్కుల ఉల్లంఘనల మీద ఉద్యోగులు కంపెనీల మీద కోర్టుకు వెళ్లడం చూస్తుంటాం. అయితే ప్రైవేట్‌ స్టార్టప్‌ కంపెనీనే ఉద్యోగులపై దావా వేసిన ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది. 


గురుగ్రామ్‌(హర్యానా) నగర వేదికగా హోం అండ్‌ బ్యూటీ సర్వీసులు అందించే ‘అర్బన్‌ కంపెనీ’.. మహిళా ఉద్యోగిణులపై కోర్టుకెక్కింది.  కంపెనీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు తమ తమ ఆదాయాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయంటూ..  మహిళా ఉద్యోగిణులు రోడ్డెక్కి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ల నిరసనను వ్యతిరేకిస్తూ unfair labor practices కింద గురుగ్రామ్‌ జిల్లా కోర్టుకు వెళ్లింది అర్బన్‌ కంపెనీ. దీంతో ఉద్యోగిణులు ఉన్నపళంగా నిరసనలను విరమించినట్లు సమాచారం.  



మ్యానిక్యూర్‌ సేవల నుంచి కార్పెట్‌ క్లీనింగ్‌, చిన్న చిన్న రిపేర్లు.. తదితర సేవలను మొబైల్‌ యాప్‌ ద్వారా అందిస్తోంది అర్బన్‌ కంపెనీ. ఇందుకోసం వేల సంఖ్యలో భాగస్వాములతో(ఆడామగా ఉద్యోగులతో) ఒప్పందం చేసుకుంటోంది.  అయితే ఆమధ్య కంపెనీ ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. దాని ప్రకారం..  సబ్‌స్క్రిప్షన్ స్కీమ్ తోపాటు భాగస్వాములు(ఉద్యోగిణులు) ముందుగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రతి నెలా కనీస సంఖ్యలో ఉద్యోగాలు, కొత్త భాగస్వామ్య వర్గాలు, కస్టమర్‌ల కోసం తీసుకొచ్చిన తగ్గింపు పథకం పాటించాల్సి వస్తుంది. ఈ పరిమితులన్నింటి వల్ల తమ ఆదాయానికి గండిపడుతోందన్నది ఉద్యోగిణుల(భాగస్వాముల) అభ్యంతరం. 

భాగస్వామి పాయింట్‌తో కొట్టింది!

ఈ కొత్త పాలసీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల కంటే ముందునుంచే.. ‘బెటర్‌ పే, వర్కింగ్‌ కండిషన్‌’ డిమాండ్‌లతో అక్టోబర్‌ నుంచే ఉద్యోగిణులు రోడ్డెక్కడం గమనార్హం. సుమారు 50 మంది ఉద్యోగిణులు గురుగ్రామ్‌లోని కంపెనీ ముందు నినాదాలతో రాత్రింబవలు ప్రదర్శనలు చేపడుతున్నారు.  ఈ తరుణంలో నలుగురు మహిళా ఉద్యోగిణుల పేర్లను చేర్చి మరీ దావా వేసింది అర్బన్‌ కంపెనీ. వాళ్ల(ఉద్యోగిణుల) చర్యలను అనైతికం, అన్యాయంగా పేర్కొంది కంపెనీ. పైగా వాళ్లను ఉద్యోగిణులుగా కాకుండా ‘భాగస్వాములు’గా దావాలో పేర్కొనడం కేసును మలుపు తిప్పింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సదరు భాగస్వాములకు(ఉద్యోగిణులకు) లీగల్‌ నోటీసులు జారీ అయ్యాయి. అంతేకాదు అర్బన్‌ కంపెనీ ఆఫీస్‌ ప్రాంగణంలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ఊహించని ఈ పరిణామంతో మహిళా ఉద్యోగిణులు బుధవారం తమ నిరసనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. 



తమ నిరసనలు మాత్రం కొనసాగుతాయని దావాలో పేర్కొనబడిన ఓ ఉద్యోగిణి చెప్తుండడం విశేషం. ఇదిలా ఉంటే మహిళా ఉద్యోగిణులను భాగస్వామ్యులుగా ప్రకటించుకుంటూ దేశవ్యాప్తంగా 35 వేల మందితో పని చేస్తోంది అర్బన్‌ కంపెనీ. భారత్‌తో పాటు అసీస్‌, సింగపూర్‌లోనూ సేవలిందిస్తోంది. ఇప్పుడు భాగస్వాములనే కారణాన్ని కోర్టులో పేర్కొంటూ..  వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.



గిగ్‌ సెక్టార్‌లో వణుకు
మన దేశంలో యాభై లక్షల మందికి పైగా గిగ్‌(చిన్న చిన్న పనులు.. ప్రదర్శనలు, ఇతరత్ర సేవలు.. స్టార్టప్‌ తరహా కంపెనీల్లో) ఎంప్లాయిస్‌ ఉన్నట్లు ఆల్‌ ఇండియా గిగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ చెప్తోంది. వీళ్ల వల్ల గిగ్‌ ఎకానమీ సమర్థవంతంగా నడుస్తోంది. అర్బన్‌ కంపెనీ వ్యవహారం ఉద్యోగుల్లో అభద్రత భావాన్ని కలిగిస్తోందని, తద్వారా గిగ్‌ సెక్టార్‌కు చాలా మంది దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆల్‌ ఇండియా గిగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే వీళ్ల హక్కుల రక్షణకు ఎలాంటి చట్టం సమర్థవంతంగా అమలు కావడం లేదు. ఫుడ్‌ డెలివరీ, రైడ్‌ ఇలాంటి యాప్స్‌లో పని చేసే ఉద్యోగులకు భద్రత కరువైంది. కరోనా పరిస్థితుల తర్వాత ఇది మరీ ఘోరంగా ఉంటోంది. ఈ తరుణంలో ఈ ఏడాది అక్టోబర్‌లో 35వేలమంది గిగ్‌ ఎంప్లాయిస్‌తో కూడిన  ఓ యూనియన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉబెర్‌, ఒలా, జొమాటో, స్వీగ్గీ.. ఇలా కంపెనీల నుంచి సోషల్‌ సెక్యూరిటీ బెనిఫిట్స్ కలిగించాలంటూ ఉన్నత న్యాయస్థానాన్ని వేడుకుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ‘సోషల్‌ సెక్యూరిటీ చట్టం’ను 2020లోనే ప్రతిపాదించినప్పటికీ.. అది ఇంకా అమలుకు నోచుకోవడం లేదు.

-సాక్షి, వెబ్‌ స్పెషల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement