ప్రధానమంత్రి బాల్ పురస్కార్ అవార్డు పొందిన పిల్లలతో ప్రధాని మోదీ
న్యూడిల్లీ: విధులను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా నవభారత నిర్మాణం జరుగుతుందని, అప్పుడు హక్కులకోసం పోరాడాల్సిన అవసరం ఉండదని ప్రధాని మోదీ యువతకు సందేశమిచ్చారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న యువతను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భిన్నత్వంలో ఏకత్వమే భారత్ గొప్పదనం. భారత్‌లోని ప్రాంతాలుగానీ, ప్రజలుగానీ తాము వివక్షకు గురయ్యామన్న భావన రాకుండా మనమే చూసుకోవాలి.
గత 70 ఏళ్లుగా ప్రపంచం ముందు మనం గొప్పగా నిలబడ్డాం. విధులు సక్రమంగా పాటించడం ద్వారా దీన్ని నిలుపుకోగలం. ఇదే గణతంత్ర దినోత్సవ పరేడ్ వెనుక ఉన్న అసలు లక్ష్యం’ అంటూ ప్రధాని మోదీ యువతకు పిలుపునిచ్చారు. రాజ్‌పాత్‌లో జరుగుతున్న కార్యక్రమం భారత శక్తిని ప్రపంచానికి చూపుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ కాడెట్స్, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. విలువలు, ఆలోచనలు కలిగిన నవభారత్‌ను నిర్మించేందుకు శ్రమించాలని యువతకు సందేశం ఇచ్చారు.
మీ నుంచి స్ఫూర్తి పొందుతాను..
‘వివిధ రంగాల్లో మీరు సాధించిన విజయాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంత చిన్న వయసులో మీరు సాధించిన విజయాలు అమోఘం’ అంటూ ప్రధాని మోదీ.. ‘ప్రధానమంత్రి బాల్ పురస్కార్’ అవార్డు పొందిన పిల్లలతో ముచ్చటించారు. శుక్రవారం మోదీ తన నివాసంలో అవార్డు పొందిన పిల్లలను కలిశారు. ‘మీరు చేసిన పనుల గురించి వింటున్న సమయంలో, మీతో మాట్లాడుతున్న సమయంలో.. నేను కూడా స్ఫూర్తిని, శక్తిని పొందుతాను’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment