సాక్షి, న్యూఢిల్లీ: జనగామ అసెంబ్లీ సీటు విషయంలో హైడ్రామా నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య జనగామ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాల్లో జనగామ సీటు విషయం తేల్చకపోవడంతో.. ఈ సీటును కోదండరామ్‌కు కేటాయించారని ప్రచారం సాగింది. దీంతో పొన్నాల రాహుల్‌గాంధీ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. జనగామ సీటుపై రాహుల్ పొన్నాలకు హామీ ఇచ్చారనీ.. కోదండరామ్ వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జనగామపై స్పష్టత లేదు..
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మీడియాతో శుక్రవారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ‘జనగామ సీటు విషయంలో జరుగుతున్న పరిణామాలు సంతృప్తికరంగా లేవు. కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎటూ తేల్చలేదు. సీట్ల పంపకం ఆలస్యమవడం కొంత నష్టం కలిగించేదే. ఈ రోజు సాయంత్రం టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆర్‌సీ కుంతియా, పొన్నాలతో భేటీ అవుతాను’ అని తెలిపారు.
ఏదేమైనా ప్రజాకూటమిగా ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతామని కోదండరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. టీజేఎస్ అభ్యర్థులకు రేపు బీ-ఫామ్‌లు ఇస్తామని తెలిపారు. టీజేఎస్ 8 సీట్లలో 6 సీట్లపై స్పష్టత వచ్చిందనీ, ఈ సాయంత్రం అభ్యర్థుల్ని ప్రకటిస్తామని తెలిపారు. చాడ వెంకట్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కోదండరామ్ తెలిపారు. టీజేఎస్ బలంగా ఉన్న నియోజక వర్గాల్లో ఇద్దరం కలిసి ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఒకటి, రెండు చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని అన్నారు. ప్రచారం అనుకున్నంత వేగంగా సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment