సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశం ప్రకారం ప్రభుత్వం ఇప్పటికైనా తమతో చర్చల ప్రక్రియ ప్రారంభించాలని ఆర్టీసీ కార్మికుల జేఏసీ డిమాండ్ చేసింది. కోర్టు చెప్పినా స్పందించకపోవడం సరికాదని పేర్కొంది. ప్రజలంతా ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నారని, శనివారం రాష్ట్ర బంద్‌ను వారు విజయవంతం చేసిన తీరును ప్రభుత్వం గుర్తించాలని సూచించింది. శనివారం సాయంత్రం జేఏసీ ప్రతినిధులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు, సుధ తదితరులు, కార్మిక ప్రతినిధులు సమావేశమై సమ్మె తదుపరి కార్యాచరణపై చర్చించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైన బంద్ ఇదేనన్నారు. దీనికి అన్ని విపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ జేఏసీలు, విద్యార్థి సంఘాలు, ఆటో, క్యాబ్ యూనియన్లు స్వచ్ఛందంగా మద్దతు పలికి విజయవంతం చేశాయన్నారు. ఆర్టీసీని పరిరక్షించుకోవాలన్న తపన అందరిలో ఎంతగా ఉందో ఈ బంద్ ఫలితమే చెబుతోందన్నారు. బంద్‌తో సమ్మె ముగిసినట్టు కాదని, ప్రభుత్వంలో మార్పు రాకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాజకీయ సంక్షోభం వస్తుందని హైకోర్టు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించాలని సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో, శాంతియుత వాతావరణంలోనే శనివారం తెలంగాణ బంద్ నిర్వహించామని, కానీ పోలీసులు అరెస్టులతో దమనకాండకు పాల్పడ్డారని, మహిళా కార్మికుల విషయంలో దురుసుగా వ్యవహరించారని, అక్రమంగా కేసులు నమోదు చేశారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. న్యూ డెమోక్రసీకి చెందిన నేత చేతి బొటన వేలును పోలీసులు వ్యూహాత్మకంగానే విరిచేశారని ఆరోపించారు. అవసరమైతే తాము మరోసారి గవర్నర్‌ను కలసి పరిస్థితిని విన్నవిస్తామని స్పష్టం చేశారు.
ఆర్టీసీని కాపాడుకోవాలంటూ జనంలోకి...
ఆర్టీసీని పరిరక్షించుకోవాలని అంశాన్ని ప్రజల్లోకి చేరవేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రాంతాల్లో ‘ఆర్టీసీని పరిరక్షించుకుందాం.. ప్రజా రవాణాను కాపాడుకుందాం’ప్లకార్డులతో ప్రజల వద్దకు వెళ్తామన్నారు. అలాగే ఆదివారం అన్ని పార్టీలతో సమావేశం కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 23న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బహిరంగ సభ నిర్వహించే యోచన కూడా చేస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment