
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో శనివారం బీజేపీ బస్ భవన్ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు బస్ భవన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ని, ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డిని అరెస్ట్ చేశారు. దాంతో ఓ ఆర్టీసీ కార్మికుడు చెట్టు ఎక్కి నిరసన తెలిపాడు. ధర్నా నేపథ్యంలో బస్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్థంభించడంతో జనాలు ఇబ్బంది పడ్డారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే.. ప్రగతి భవన్‌ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇన్ని రోజులుగా కార్మికుల సమస్యలు పరిష్కరించని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి.. వారికి న్యాయం జరిగేవరకు అండగా ఉంటుందని తెలిపారు. కార్మికుల సమస్యలపై స్పందించకపోతే.. కేసీఆర్ పాలనను స్తంభింపచేస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment