రాష్ట్ర పరువు బజారులో పడేస్తున్నారు
లెక్కల్లో తేడాలు చూపిస్తూ రాష్ట్ర పరువును బజారులో పడేస్తున్నారని అసెంబ్లీలో విపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్ మీద జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ పలు విషయాల్లో ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. ఇది కంప్యూటర్ యుగమని, అందరికీ అన్ని విషయాలూ తెలిసిపోతున్నాయని ఆయన అన్నారు. అందువల్ల ఇప్పుడు ఏమైనా చేయచ్చు, మోసం చేయచ్చు, అబద్ధాలు చెప్పచ్చు, వెన్నుపోటు పొడవచ్చు అనుకుంటే కుదరదని ఆయన అన్నారు. సీఎం కార్యాలయంలో ఏం చేస్తున్నారో కూడా అందరికీ తెలుస్తోందని వైఎస్ జగన్ చెప్పారు.
గతంలో రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల మహిళలు తక్కువ వడ్డీ ఉండటంతో సంతోషంగా ఉండేవారని, ఇంతలో మన ఖర్మ కొద్దీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో డ్వాక్రా గ్రూపుల అక్కా చెల్లెమ్మలు 18 శాతం వడ్డీ కట్టుకోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఇక గృహనిర్మాణం విషయానికి వస్తే.. 5.60 లక్షల ఇళ్లు సగంలో ఆగిపోయి ఉన్నాయని, ఇవి వేర్వేరు దశల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. వీటికి బిల్లులు ఆపేయాలని ఒక జీవో విడుదలైందని అన్నారు. వీటి గురించి ఒక్కసారి ఆలోచించి, ఒక్కో ఇంటికి రూ. 50 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది కానీ కేవలం 650 కోట్లే కేటాయించారని, అంటే ఒక్క కొత్త ఇల్లు కూడా రాదేమో అని చెప్పినట్లు కాదా అని నిలదీశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
''మంత్రిగారు పింఛన్ల గురించి మాట్లాడారు. రోజుకు 27 రూపాయలు మించి ఆదాయం ఉన్నవాళ్లు పేదలు కారని కేంద్రం చెబుతోంది. కానీ ఏడాదికి 60వేలు వచ్చినా వాళ్లు పేదలేనని దివంగత నేత వైఎస్ చెప్పారు. కేంద్రం చాలీచాలని విధంగా 10 శాతం మందికి కూడా సరిపోని విధంగా ఇచ్చారు. అప్పటివరకు 15 లక్షల పెన్షన్లు మాత్రమే ఉంటే, వైఎస్ హయాంలో అవి 38 లక్షలకు వెళ్లాయి. పుష్కరాల గురించి మాట్లాడుతూ రూ. 1400 కోట్లు బడ్జెట్లో కేటాయించామని చెప్పారు. కానీ రూ. 200 కోట్లు కేటాయించినట్లు చంద్రబాబుగారు సభలో చెప్పారు. ఈ లెక్కల్లో తేడాలేంటో మాకు అర్థం కావట్లేదు.''