రమ్మంటే భయపడుతున్నారు: చంద్రబాబు
హైదరాబాద్ : వీలైనంత త్వరగా ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాజధానికి తరలి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఆయన శుక్రవారం శాసనమండలిలో మాట్లాడుతూ త్వరలోనే రాజధాని ప్రాంతంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త రాజధాని ప్రాంతానికి రమ్మంటే అధికారులు భయపడుతున్నారన్నారు. వీలైనంత త్వరలో సిబ్బంది తరలింపు జరుగుతుందన్నారు.
గతంలో ఆంధ్రరాష్ట్రానికి మద్రాసు నుంచి కర్నూలుకు అధికారులు కట్టుబట్టలతో వచ్చినట్లుగా ...ఇప్పుడు కొత్త రాజధానికి వచ్చేందుకు అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చంద్రబాబు అన్నారు. పిల్లల చదువులు, హైదరాబాద్లో అన్ని ఉండటంతో పాటు 56ఏళ్లుగా ఇక్కడే ఉండటంతో ఏపీ రాజధాని ప్రాంతానికి రమ్మంటేనే భయపడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే గుంటూరు పరిసర ప్రాంతాల్లో సిబ్బందికి అద్దె ఇళ్లు కూడా దొరికే పరిస్థితి లేదన్నారు. కొత్త రాజధానిపై అందరూ ఇష్టాన్ని పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ వచ్చేంతవరకూ పట్టిసీమ పని చేస్తుందని చంద్రబాబు అన్నారు.