డబ్బులివ్వం.. అప్పు చేయండి! | no funds for rtc only underwriting for cabinet resolution | Sakshi
Sakshi News home page

డబ్బులివ్వం.. అప్పు చేయండి!

Published Tue, Mar 8 2016 4:12 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

డబ్బులివ్వం.. అప్పు చేయండి!

డబ్బులివ్వం.. అప్పు చేయండి!

ఆర్టీసీకి సాయంపై తూచ్ అన్న రాష్ట్ర ప్రభుత్వం
కావాలంటే రుణం తెచ్చుకునేందుకు అనుమతి
పూచీకత్తు ఉండేందుకు కేబినెట్ తీర్మానం
గ్రాంటు ఆశలు వదులుకున్న రవాణా సంస్థ
బడ్జెట్‌లో కేటాయింపులుండవని పరోక్షంగా చెప్పిన సర్కారు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రగతి రథచక్రం దిక్కుతోచని స్థితిలో పడింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి గ్రాంటు రూపంలో సాయం కోసం ఆర్టీసీ పెట్టుకున్న ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. అప్పు తెచ్చుకొమ్మని ఉచిత సలహా ఇచ్చి.. కావాలంటే పూచీకత్తు ఉంటానన్న హామీతో సరిపుచ్చింది. అది కూడా ఆర్టీసీ బస్సు పాసు రాయితీలకు ప్రభుత్వం రీయింబర్స్ చేసే మొత్తానికి సంబంధించింది కావటంతో ఆర్టీసీ షాక్ తినాల్సి వచ్చింది. ఇవ్వాల్సిన డబ్బులే ఇవ్వకుండా అప్పు తెచ్చుకోమని చెప్పటంతో అదనంగా గ్రాంటు రావటం ఇక కల్లేనని తేలిపోయింది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఉదారంగా నిధులు కేటాయిస్తుందన్న నమ్మకం కూడా సడలిపోయింది.

 గడ్డు పరిస్థితుల్లో ఆర్టీసీ..
ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితిని ఆర్టీసీ ఎదుర్కొంటోంది. ప్రతి నెలా జీతాల కోసం దిక్కులు చూడాల్సిన దుస్థితిలో ఉంది. గతేడాది సిబ్బందికి భారీగా జీతాలు పెంచాల్సి రావటంతో ఆ భారం ఆర్టీసీకి ఇప్పుడు శాపంగా మారింది. జీతాలు పెంచిన సమయంలో.. ఆ భారాన్ని పూర్తిగా ఆర్టీసీపై రుద్దకుండా బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించటం ద్వారా ఆదుకుంటామని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పటంతో ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉందని ఎదురుచూసింది. కానీ, కేబినెట్ భేటీలో ఆ నిధుల ఊసెత్తని ముఖ్యమంత్రి.. బస్సు పాస్ రీయింబర్స్‌మెంట్ నిధులను అప్పు రూపంలో ఆర్టీసీ తెచ్చుకోవాలని, దానికి పూచీకత్తు ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు. దీనికి కేబినెట్ ఓకే చెప్పింది. ఆర్టీసీకి గ్రాంటుపై చర్చే లేదు.

బస్సు పాసుల రాయితీని భరించినందుకు దాదాపు రూ.650 కోట్ల వరకు ఆర్టీసీ నష్టపోతోంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తోంది. అందులో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఎంపీ ట్యాక్స్‌ను మినహాయించుకుని రూ.500 కోట్లు రీయింబర్స్ చేస్తోంది. ఇప్పుడు ఆ మొత్తాన్నే అప్పుగా తెచ్చుకోవాలని పేర్కొంది. రీయింబర్స్ చేయాల్సిన డబ్బులనే నేరుగా ఇవ్వకుండా అప్పు తెచ్చుకోవాలని పేర్కొనటం, గ్రాంటు గురించి ప్రస్తావించకపోవటంతో ఇక బడ్జెట్‌లో ఆర్టీసీకి ప్రత్యేక కేటాయింపులు ఉండకపోవచ్చని ఆర్టీసీ అధికారులు నిర్ణయానికొచ్చారు. కొత్త బస్సుల కోసం రూ.40 కోట్లు బడ్జెట్‌లో కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

 పేరుకుపోయిన నష్టాలు..
ఫిట్‌మెంట్ ప్రకటన తర్వాత ఎరియర్స్‌కు సంబంధించి ఆర్టీసీ రూ.200 కోట్లు చెల్లించింది. ఆ మొత్తంతో సంస్థ నష్టాలు ఒక్కసారిగా గుట్టలా పెరిగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికే నష్టాల మొత్తం రూ.600 కోట్లను మించింది. దీంతో ఎరియర్స్ భారాన్నయినా ప్రభుత్వం పంచుకుంటే బాగుండేదన్న ఆర్టీసీ అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం తోసిపుచ్చింది. అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవటం ద్వారా ఆదాయాన్ని వృద్ధి చేసుకోవాలని పదేపదే చెబుతున్న సీఎం ఇటీవల బడ్జెట్ సన్నాహక భేటీలో కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పారు. అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు సూచించే ఉదంతాలేవీ లేకపోవటంతో అధికారులు సాయం అడగటానికి సాహసించలేని పరిస్థితి ఎదురైంది. నష్టాలను అధిగమించేందుకు ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహిస్తానని గతంలో చెప్పిన సీఎం ఇప్పుడా సమావేశం నిర్వహణకు కూడా ఆసక్తి చూపటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement