సాక్షి, హైదరాబాద్: మూతపడే దశలో ఉన్న ఆర్టీసీ సహకార పరపతి సంఘాని(సీసీఎస్)కి ఎట్టకేలకు రవాణా సంస్థ నిధులు కేటాయించింది. వేయి కోట్లకు పైగా సంఘం నిధులు సొంతానికి వాడుకుని, దాన్ని దివాలా దశకు చేర్చిన ఆర్టీసీ.. తాజాగా దానికి రూ.90 కోట్లు అందజేసింది. త్వరలో నేషనల్ క్రెడిట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) నుంచి ప్రభుత్వ పూచీకత్తు ద్వారా సీసీఎస్‌కు రూ.400 కోట్ల నిధులు సమకూర్చాల్సి ఉంది.
కానీ గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి సీసీఎస్ కొంత బకాయి పడింది. అవి మొండి బకాయిలుగా మారటంతో సంఘం ప్రస్తుతం ఎన్‌పీఏ జాబితాలోకి చేరింది. ఆ బకాయిలు తీరిస్తేగానీ ఎన్‌సీడీసీ నుంచి రుణం పొందే వీలులేదు. ఈ నేపథ్యంలోనే అందుకు కావాల్సిన నిధులు కేటాయించాల్సిందిగా సీసీఎస్ చాలాకాలంగా ఆర్టీసీని కోరుతోంది. కానీ పట్టించుకోలేదు. అయితే ఆర్టీసీ కొత్త ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో.. ఆ కసరత్తు వేగం అందుకుంది. నాలుగు రోజుల క్రితం రూ.90 కోట్లు సీసీఎస్‌కు అందాయి.
వడ్డీ బకాయిలకు రూ.7.5 కోట్లు: తాజా నిధుల్లోంచి బ్యాంకు బకాయిల కిం ద రూ.80 కోట్లను చెల్లించిన సీసీఎస్, మిగతా మొత్తం నుంచి రిటైర్డ్ ఉద్యోగుల డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు చెల్లించనుంది. గత మూడు నెలలుగా రిటైర్డ్ ఉద్యోగులు వడ్డీ అందక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద వచ్చిన మొత్తాన్ని సీసీఎస్‌లోనే డిపాజిట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment