ఆర్టీసీపై నేడు సీఎం సమీక్ష
ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు,
ఇతర సాయంపై నివేదిక సిద్ధం చేసిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు ఇవ్వటంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 90 శాతాన్ని మించి పోయి పూర్వవైభవం కనిపిస్తోంది.. కానీ, అదే సమయంలో ప్రభుత్వం నుంచి రావా ల్సిన మొత్తం విడుదల కాకపోవటంతో, పెరిగిన ఆక్యుపెన్సీ రేషియోకు తగ్గ ఆదాయం నమోదు కావటం లేదు. మరోవైపు ఆర్టీసీ సహకార పరపతి సంఘం, భవిష్యనిధి బకాయిలు ఏకంగా రూ.2 వేల కోట్లను దాటిపోయాయి.
గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినా, దాని అమలు ఆగిపోయింది. ఇప్పుడు ఉద్యోగులకు సకా లంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఈ తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆర్టీసీ అధికారుల విన్నపాల్లో ఆయన దేనికి సానుకూలత వ్యక్తం చేస్తారోనన్న చర్చ ఇప్పుడు సంస్థలో విస్తృతంగా సాగుతోంది.
నేడు సమీక్ష లేకుంటే...
వాస్తవానికి మంగళవారం రోజునే సమావేశం ఉంటుందని చెప్పగా, ఆ రోజున వాయిదా వేసి బుధవారం ఉంటుందంటూ సమాచారం అందింది. జూన్ 2 రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున, సీఎం ఆ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఇలాంటి తరుణంలో సమీక్ష ఉండకపోవచ్చునని కూడా కొందరు అధికారులు అభిప్రాయపడుతు న్నారు. జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.
రాజకీయంగా అది కూడా ఆయన బిజీగా ఉండేందుకు కారణం కానుంది. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత సమీక్ష ఉండే అవకాశం ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. బుధవారం సమీక్ష జరగని పక్షంలో, వచ్చే పది రోజుల్లో ఉంటుందని అంటున్నారు. దీంతో, ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ఓ నివేదిక సిద్ధం చేస్తున్నారు.
అధికారులు ఏం కోరనున్నారంటే
⇒ మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి జారీ చేస్తున్న జీరో టికెట్ల ఆధారంగా ప్రతినెలా నిధులు రీయింబర్స్ చేయాలి. దాన్ని రూ.350 కోట్లకు పెంచాలి.
⇒ మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ బాగా పెరిగినందున, 4 వేల కొత్త బస్సులు సమకూర్చాలి.
⇒ ప్రతిపాదిత కొత్త బస్సుల సంఖ్య దామాషా ప్రకారం.. పది వేల మంది ఉద్యోగులను రిక్రూట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు కనీసం నాలుగు వేల పోస్టులు భర్తీ చేయాలి.
⇒ గతేడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తంలో ఇంకా రూ.వేయి కోట్లు బకాయి ఉంది. దాన్ని వెంటనే విడుదల చేయాలి
⇒ఆర్టీసీ సహకార పరపతి సంఘం, భవిష్యనిధికి సంబంధించిన రూ.2 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం సర్దుబాటు చేయాలనే అంశాలను అందులో పొందుపరుస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment